
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 2021 నుంచి ఆగస్టు 2022 మధ్యకాలంలో 100 మినరల్ బ్లాకులను వేలం వేసినట్లు కేంద్ర గనుల మంత్రిత్వశాఖ వెల్లడించింది. 2015 నుంచి దేశంలో మొత్తం 208 ఖనిజ బ్లాకులను వేలం వేసింది. దీంతో దేశంలో వాణిజ్య మైనింగ్ ముందుకు సాగిందని తెలిపింది. ఇటీవల కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ.. ఖనిజాల అన్వేషణలో మరింత మంది ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. డ్రోన్లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను మెరుగుపరచడంతో ప్రతికూల పర్యావరణ ప్రభావం లేకుండా ఖనిజ అన్వేషణ నిర్వహించబడుతుందని ఆయన అన్నారు.