
- అనుమతులు లేకున్నా ప్యాకెట్ల తయారీ
- పట్టించుకోని అధికారులు
ప్రజాశక్తి-హిందూపురం : ప్రస్తుత పరిస్థితుల్లో శుద్ధి నీటి వినియోగం ప్రజలకు నిత్యావసరమైంది. గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువ మంది నేడు మినరల్ వాటర్‌నే తాగుతున్నారు. ప్రజల అవసరాన్ని ఆసరాగా తీసుకుంటున్న కొందరు వ్యాపారులు మినరల్ పేరుతో జనరల్ నీటిలో రసాయనాలు కలిపి సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యం కంటే వారి లాభాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నీటిని నామమాత్రంగా శుద్ధి చేసి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. పైగా ఒక్కో వాటర్ క్యాన్‌కు రూ.20 నుంచి రూ.30 వరకు వసూలు చేస్తున్నారు. హిందూపురం పరిసర ప్రాంతాల్లో ఎనిమిదికిపైగా మినరల్ వాటర్ ప్లాంట్‌లు ఉన్నాయి. వీళ్లంతా నిబంధనలకు తిలోదకాలు ఇచ్చి వాటిని నిర్వహిస్తున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
వాటర్ ప్లాంట్ ఏర్పాటుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) అనుమతి తప్పనిసరిగా ఉండాలి. తొలుత పంచాయతీ లేదా మున్సిపాల్టీ నుంచి అనుమతులు తీసుకోవాలి. అనంతరం ప్లాంట్లో నీటిని మైక్రోబయాలజీ, కెమిస్ట్ నిపుణులు పరిశీలించాక అక్కడి నీరు శుద్ధజలమే అని వారు ధ్రువీకరించాలి. ఆ తర్వాతే ప్రజలకు సరఫరా చేయడానికి వారికి అనుమతి ఇస్తారు. మరోవైపు ప్లాంట్ నిర్వహణలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. పిహెచ్‌స్థాయి పదికి తగ్గకుండా చూడాలి. ప్రతిరోజూ నీటిని సరఫరా చేసిన క్యాన్‌లను పోటాషియం పర్మాంగనేట్‌తో శుభ్రంచేయాలి. నీటిలో లవణ ఖనిజాలు వంటి మినరల్స్ ఎంతశాతం ఉన్నాయో చూసుకున్నాకే ఆ నీటిని విక్రయించాలి. ఈ నిబంధనలను కనీస ప్రమాణాలను పాటించడం లేదు. అన్ని నిబంధనలు పాటించిన వారు మాత్రమే నీళ్ల ప్యాకెట్లను తయారు చేసి విక్రయించాల్సి ఉంది. ఎటువంటి అనుమతులు లేకున్నా యథేచ్ఛగా ప్యాకెట్లను తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయిస్తున్నారు.
ఈ ప్యాకెట్లపై నీళ్లు ఎప్పుడు తయారు చేశారు.. ఎన్ని రోజులు కాల వ్యవధి.. అన్నది తప్పనిసరిగా ఉండాలి. ఈ నిబందనలకు తిలోదకాలు ఇచ్చి ప్యాకెట్లలో నీటిని నింపి వాటికి వివిధ రకాల పేర్లు పెట్టి సరఫరా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణానికి వస్తున్న ప్రజలు నీళ్ల ప్యాకెట్లను తాగి అనారోగ్యం పాలవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి వాటర్‌ప్లాంట్‌ల ద్వారా నాణ్యమైన నీరు ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఫుడ్‌ఇన్స్‌పెక్టర్ జిల్లా కేంద్రానికే పరమితం..!
ఎప్పటికప్పుడు పురపాలక సంఘాలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో ఆహార పదార్థాలపై తనిఖీలు చేసి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ ఇన్స్‌పెక్టర్ జిల్లా కేంద్రానికే పరమితమయ్యారు. ప్రత్యేకంగా పెనుకొండ డివిజన్‌కు ఫుడ్‌ఇన్స్‌పెక్టర్ ఉండాలి. ప్రతిరోజూ డివిజన్ వ్యాప్తంగా తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికి తనిఖీలు చేయడం లేదు. దీంతో వ్యాపారులు తమపై ఎవరూ చర్యలు తీసుకోరు అన్న ధీమాతో యథేచ్ఛగా కల్తీ నీళ్ల వ్యాపారం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న పురపాకల సంఘం కమిషనర్, తహశీల్దార్లు మాత్రం నిబంధనలు అతిక్రమించి వాటర్ ప్లాంట్‌లను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.