అనగనగా ఓ అడవి. అందులో చాలా జంతువులు నివసిస్తూ ఉండేవి. అవి మొదట్లో కొంతకాలం సఖ్యతగానే ఉన్నా.. రానురాను వాటి మధ్యలో కీచులాటలు మొదలయ్యాయి. 'ఈ అడవికి నేనే రాజును' అని సింహం అనుకుంటూ ఉండేది. కానీ అది ఇతర జంతువులకు నచ్చేది కాదు. 'ఎప్పుడూ ఈ సింహానిదే పైచేయిగా ఉంటోంది. ఎంత కాలం ఇలా?' అని మిగతా జంతువులు ఆలోచించసాగాయి. ఈ విధంగా కాకుండా ఒక్కొక్క జంతువు కొంత కొంత కాలం రాజుగా ఉండాలని కొన్ని జంతువులు భావించాయి. కానీ అది కూడా కుదరలేదు.
సింహం తన దుర్మార్గంతో అందరినీ భయపెడుతోంది. కాబట్టి అది రాజుగా పనికిరాదు అనుకున్నాయి. నక్క జిత్తులమారి, ఎప్పుడూ కుట్రలు పన్నుతూ ఉంటుంది. అందువల్ల అదికూడా రాజుగా ఉండటానికి వీలు లేదనుకున్నాయి. జింక తన అందం చూసుకుని మురిసిపోతుంటుంది. నెమలి అస్తమానం నాట్యంలో మునిగి పోయి ఉంటుంది. కుందేలు ఎక్కడ చిన్న అలికిడి అయినా పిరికిగా పారిపోతుంటుంది. కాబట్టి ఇవేవీ రాజుగా పనికిరావనుకున్నాయి. అప్పుడు ఒక కోతి కలుగజేసుకుని 'ఈ సమస్యను మనుషులు ఎలా పరిష్కరించుకుంటుంన్నారో నేను నగరంలోకి వెళ్లి చూసి వస్తాను' అని చెప్పిబయలుదేరింది.
కొన్నాళ్ళకు తిరిగి వచ్చిన కోతి 'మనుషులలో రాజులంటూ ఇప్పుడు ఎవరూ లేరు. అందరూ కలిసి వాళ్ళను వాళ్లే పరిపాలించుకుంటున్నారు' అని చెప్పింది. ఇదేదో చాలా బాగుందని జంతువులన్నీ ఏకగ్రీవంగా అనుకున్నాయి. సింహం, నక్క, జింక, నెమలి, కోతి, కుందేలు అన్నీ కలిసి 'జంతుస్వామ్యం' ఏర్పాటు చేసుకున్నాయి.
ముట్ర కొండారెడ్డి,
బి.కొత్తకోట, అన్నమయ్య జిల్లా.