కొంతమంది వ్యక్తులు సమాజాన్ని చైతన్యం చేయడంలో నిరంతరం కృషి చేస్తుంటారు. మరికొంతమంది సామాజిక సేవలో భాగం అవుతారు. చాలా కొద్దిమంది మాత్రమే ఇతరులు ఉన్నత శిఖరాలు చేరుకునేలా శ్రమిస్తారు. అలాంటివారిలో ఒకరే తమిళనాడు వెల్లూరుకు చెందిన 63 ఏళ్ల ఆర్ ఎం నారాయణన్. ఎల్ఐసి ఉద్యోగిగా ప్రస్తుతం రిటైర్డ్ అయిన ఈ వ్యక్తి 20 ఏళ్లుగా ప్రమోషన్లు కూడా వద్దనుకుని ఒకే ప్రాంతంలో ఉండిపోయారు. కారణమేమంటే తన లక్ష్యం నెరవేరాలంటే అతను అక్కడ తప్పక ఉండాలి మరి. క్రీడలపట్ల ఆసక్తి ఉండి శిక్షణ ఖర్చు భరించలేని పేద కుటుంబాలకు చెందిన వారికి ఉచితంగా షాట్ పుట్, జావెలన్ త్రో, డిస్కస్ త్రో వంటి క్రీడలు నేర్పించడమే ఆయన లక్ష్యం. అలా 1989 నుండి ఇప్పటివరకు వెయ్యి మంది క్రీడాకారులను తయారుచేశారు. ఆదాయం నుండి కొంత మొత్తం, పెన్షన్ డబ్బులను కూడా శిక్షణ కోసం ఉపయోగించారు.
63 ఏళ్ల వ్యక్తి అయినా- తెల్లవారుజామునే నడక ప్రారంభిస్తారు. రోజుకు 5 కిలోమీటర్లు పరుగెత్తుతారు. 'ఎక్కువ మంది క్రీడాకారులకు ఎక్కువకాలం శిక్షణ ఇవ్వాలంటే నేను ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం' అంటున్న ఈ పెద్దాయన 2017-18 ఏడాదికి గాను తమిళనాడు ప్రభుత్వం నుండి ఉత్తమ శిక్షకుడు అవార్డును కూడా అందుకున్నారు.
'ఉచితంగా వచ్చే దేనికైనా విలువ ఉండదని చాలా మంది అనుకుంటారు. రికార్డులు బద్దలుకొడుతున్న నా విద్యార్థులు ద్వారా ఉత్తమమైన వాటిని చూపించాలని, సమాజానికి సేవ చేయడమే ధ్యేయంగా నా ప్రయత్నాలు ఉన్నాయని నిరూపిస్తున్నాను' అంటున్న రామాయణన్ విద్యార్ధుల్లో నలుగురు అంతర్జాతీయ క్రీడాకారులు, బంగారు పతకాలు సాధించిన 8 మంది జాతీయ క్రీడాకారులు ఉన్నారు.
ప్రభుత్వరంగ ఉద్యోగిగా ఉంటూ క్రీడాకారులను తయారు చేయాలని ఎందుకు లక్ష్యం పెట్టుకున్నారు అనడిగితే- 'స్కూల్లో ఉన్నప్పటి నుండే నాకు క్రీడల పట్ల ఆసక్తి ఎక్కువ. 1976లో ప్రభుత్వ క్రీడాప్రాంగణంలో చేరి శిక్షణ తీసుకున్నాను. పలు రాష్ట్ర, జాతీయ, స్థాయి జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, 400 మీటర్ల హర్డిల్స్ పోటీల్లో పాల్గొని పతకాలు సాధించాను. అయితే 1986 నాటికి ఉద్యోగంలో స్థిరపడ్డాను. ఉద్యోగానికి క్రీడలకు సమన్యాయం చేయలేక, తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కువ కాలం క్రీడారంగంలో కొనసాగలేకపోయాను. అయితే నాకున్న పరిజ్ఞానంతో మరింత మంది క్రీడాకారులను తయారు చేయాలనుకుని లక్ష్యం పెట్టుకున్నాను. ఆ దిశగానే 1989 నుండి ఉచితంగా శిక్షణ ఇవ్వడం ప్రారంభించాను' అంటున్నారు.
ఆటపై ఆసక్తితో పాటు శారీరక దృఢత్వంపై పట్టు ఉన్నవారినే నారాయణన్ శిక్షణకు తీసుకుంటారు. రోజుకు 6 గంటలు శిక్షణ ఇస్తారు. 35 ఏళ్లుగా ఇదే విధానం. ఆయన రిటైర్డ్ అయినప్పటి నుండి పారా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. 'దీనికోసం నేను మరికొన్ని గంటలు అదనంగా పనిచేయాల్సి వస్తోంది. కలలు సాకారం చేసుకోవాలనుకుని నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ పెట్టడం నా విధి' అంటున్నారు.
అయితే.. ఇప్పటివరకు శిక్షణ ఇచ్చింది వేరు. ఇప్పుడు పారా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం వేరు. ఆర్థిక ఇబ్బందులు, వైకల్యం వారిని ఉచిత శిక్షణ వరకు తీసుకువచ్చినా క్రీడల్లో పాల్గొనే అవకాశం అందరికీ ఉండదు. అందుకే నారాయణన్ తన దగ్గరకి వచ్చిన పారా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చి ఊరుకోకుండా పలు పోటీలకు వెళ్లేందుకు ఆర్థిక సాయం కూడా చేస్తున్నారు.
'రెండేళ్ల క్రితం నుండి నారాయణన్ సార్ దగ్గర శిక్షణకు వస్తున్నాను. శిక్షణతో సరిపెట్టకుండా, మా ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్కాలర్షిప్లు వచ్చే వీలు కూడా కల్పిస్తున్నారు. అలా నా జిమ్ ఖర్చుల కోసం ఏడాదికి రూ.30 వేల స్కాలర్షిప్ అందుతోంది' అంటూ నారాయణన్ పట్ల తనకున్న అభిమానాన్ని పంచుకుంది పారా క్రీడాకారిణి కీర్తిక. మా బృందంలో ముథురాజ్ అనే క్రీడాకారుడు ఉన్నాడు. రోజూ గ్రౌండ్‌కి వచ్చేందుకు అతనికి బైక్ లేదు. సార్ అతనికి బైక్ ఇప్పించారు' అంటూ తన తోటి క్రీడాకారుడి పట్ల నారాయణన్ ఔదార్యాన్ని కూడా చెప్పింది.
'రిటైర్డ్ అయిన తరువాత పూర్తికాలం శిక్షణ ఇవ్వాలని ముందుగానే అనుకున్నాను. అయితే పారా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టాక, వారి అంకిత భావం చూసి, నాలో మరింత ఉత్సాహం పెరిగింది. పారా క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఎంతో అంకిత భావంతో తామెంటో నిరూపించుకోవాలనుకునే పారా క్రీడాకారులకు శిక్షణ ఇవ్వడం కోసం శిక్షకులు ముందుకురావాలి' అని ఆయన ఆశిస్తున్నారు.