
ప్రజాశక్తి - మందస:జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన కొల్లి సత్యనారాయణ (సత్యం మాస్టారు) చిరస్మరణీయులు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా మందసలో సత్యం మాస్టారు సంతాప సభను బుధవారం నిర్వహించారు. ముందుగా సత్యం మాస్టారు చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యం మాస్టారు ఆశయ సాధన కోసం కృషి చేయడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో జన్మించిన ఆయన వ్యవసాయ శాఖ ఉద్యోగిగా శ్రీకాకుళం జిల్లాలోని మందసకు వచ్చారని తెలిపారు. తర్వాత పలాస మండలం బడ్డపాడు స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా చేరారని చెప్పారు. ఆ సమయంలోనే ఉద్దానం ప్రాంతంలో సాగుతున్న శ్రీకాకుళం గిరిజనోద్యమం వైపు అడుగులు వేశారని తెలిపారు. ఉద్యోగం కోల్పోవడంతో పాటు 1968 నుంచి 1974 వరకు జైలులో నిర్బంధించబడ్డారని చెప్పారు. ఎమర్జెన్సీ కాలంలో 19 నెలలు మళ్లీ ఆయనను జైలులో ఉంచారన్నారు. జైలు నుంచి వచ్చిన తర్వాత సిపిఎంలో చేరారని, మందస ప్రాంతంలో పార్టీ, ట్రేడ్ యూనియన్ నిర్మాణానికి తనవంతు కృషి చేశారని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యునిగా, కార్యదర్శివర్గ సభ్యునిగా సోంపేటలో తనకున్న పరిచయాలతో మందస, బారువ, బూరగాం, మామిడిపల్లి ప్రాంతాల్లో జనాలను కూడగట్టి పార్టీ నిర్మాణానికి కృషి చేశారని వివరించారు. ఆయన నిరంతర అధ్యయనశీలి అని, విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని కొనియాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నో పోరాటాలకు సత్యం మాస్టారు నేతృత్వం వహించారని గుర్తుచేశారు. మార్పు ట్రస్టు అధ్యక్షులు మట్ట ఖగేశ్వరరావు, సర్పంచ్ సిహెచ్.లక్ష్మణరావు, సిపిఎం నాయకులు ఎన్.షణ్ముఖరావు, ఆర్.దిలీప్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్ టి.అజరు కుమార్, హమాలీలు, రైస్‌మిల్లు కార్మికులు, ప్రజలు, పార్టీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.