Nov 14,2023 08:24

పొలిట్‌బ్యూరో సంతాపం
సిఐటియు, ఎఐకెఎస్‌,వ్యవాసయ కార్మిక సంఘాల నివాళి
కొల్‌కతా: సిపిఎం సీనియర్‌ నేత , సుదీర్ఘకాలంపాటు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన సీనియర్‌ పార్లమెంటేరియన్‌ వాసుదేవ్‌ ఆచార్య (81) సోమవారం హైదరాబాద్‌లోని తన కుమారుడి నివాసంలో కన్నుమూశారు. దీర్ఘకాలంగా వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతూ చాలా కాలంగా చికిత్స పొందుతున్నారు. ఆయన భౌతిక కాయాన్ని మంగళవారం హైదరాబాద్‌ నుంచి కొల్‌కతాకు తీసుకువస్తారు. కేంద్ర కమిటీ మాజీ సభ్యులు, సిపిఐ(ఎం)కంట్రోల్‌ కమీషన్‌ ఛైర్మన్‌గా, సిఐటియు నేతగా వివిధ బాధ్యతలను నిర్వర్తించిన ఆచార్య జులై 11, 1942న అప్పటి కూచ్‌బీహార్‌లో భాగమైన పురూలియా జిల్లాలోని అద్రా సమీపంలోని బిరోలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కొంతకాలం క్రితమే చనిపోయారు.. పశ్చిమ బెంగాల్‌లోని బంకురా నుంచి1984 నుంచి 2009 వరకు వరుసగా 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.14 ఏళ్ల పాటు పార్టీ లోక్‌సభ నాయకుడిగా పనిచేశారు. పబ్లిక్‌ అండర్‌టేకింగ్‌ అస్యూరెన్స్‌ కమిటీ, రైల్వే స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా చాలా ఏళ్లపాటు పనిచేశారు. లోక్‌సభలో ప్రజల సమస్యలను లేవనెత్తడంలో ముందుండే ఆచార్య ప్రముఖ కమ్యూనిస్టు పార్లమెంటేరియన్‌లలో ఒకరిగా గుర్తింపు పొందారు.. . విద్యార్ధి జీవితం నుండే రాజకీయాల్లోకి వచ్చిన ఆచార్య స్కూలు టీచర్‌ ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తిస్థాయి పార్టీ కార్యకర్తగా 1967లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 1985లో పార్టీ బెంగాల్‌ రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యారు. 1998లో కోల్‌కతాలో జరిగిన పార్టీ 16వ ఆలిండియా మహాసభలో కేంద్ర కమిటీకి ఎన్నికయ్యారు. 2018లో కేంద్ర కంట్రోల్‌ కమిషన్‌కు చైర్మన్‌గా ఎన్నికయ్యారు.. సిఐటియు జాతీయ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. రైల్వే, బగ్గు కార్మికుల నేతగా ఆయన విశేష కృషి చేశారు. తొలుత ఉపాధ్యాయ సంఘానికి కూడా నాయకత్వం వహించారు.

  • సిపిఎం పొలిట్‌బ్యూరో సంతాపం

వాసుదేవ్‌ ఆచార్య మృతికి పార్టీ పొలిట్‌బ్యూరో తీవ్ర సంతాపం తెలియజేసింది. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసింది. విశిష్ట పార్లమెంటేరియన్‌గా ఆయన ఎల్లప్పుడూ ప్రజా సమస్యలనే ప్రస్తావించేవారని పేర్కొంది. 1980 నుంచి 2009 వరకు లోక్‌సభకు తొమ్మిది సార్లు ఎన్నికయ్యారని తెలిపింది. కార్మికోద్యమంలో చురుకుగా పాల్గన్న వాసుదేవ్‌ ఆచార్య ప్రధానంగా రైల్వే, బగ్గు కార్మికుల నేతగా వున్నారు. కార్మిక వర్గ సిద్ధాంతాల పట్ల ధృఢమైన విశ్వాసాన్ని కలిగివుంటూ దోపిడీ వ్యవస్థ మార్పు కోసం జరిగే పోరాటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారని పేర్కొంది. దశాబ్దాల పాటు సిఐటియు ఉపాధ్యక్షుల్లో ఒకరిగా కూడా వున్నారు. ఆరేళ్ల నుండి సిఐటియు జాతీయ కార్యదర్శివర్గ శాశ్వత ఆహ్వానితుడుగా కూడా వున్నారు. వివిధ రుగ్మతలతో ఆయన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ జాతీయ స్థాయిలో, రంగాలవారీగా కార్మికులు జరిపే అన్ని కీలక పోరాటాల్లోనూ ఆయన పాల్గనేవారని పేర్కొంది.

  • సిఐటియు సంతాపం

ప్రజలు ముఖ్యంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా పోరాడిన వాసుదేవ్‌ ఆచార్య సంఘటిత, అసంఘటిత రంగాల్లోని కార్మికుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారని సిఐటియు పేర్కొంది. సంతాప సూచకంగా సిఐటియు పతాకాన్ని అవనతం చేసింది. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిల భారత బగ్గు కార్మికుల సమాఖ్య అధ్యక్షుడిగా ఆయన అనేక సమరశీల పోరాటాల్లో పాల్గన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికై పార్లమెంట్‌ లోపల, వెలుపలా ఆయన జరిపిన కృషి ఎనలేనిదని సిఐటియు పేర్కొంది. ఏ రాష్ట్రాల వారైనా, ఏ కార్మిక సంఘానికి చెందినవారైనా వాటితో సంబంధం లేకుండా కార్మికులందరికీ ఆయన ఇంటి ద్వారాలు తెరిచే వుండేవి. తమ ఇబ్బందులు, సమస్యల పరిష్కారం కోసం వారు ఆయన్ని కలిసేవారని పేర్కొంది. సమైక్య పోరాటాల ద్వారా కార్మికోద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా అనే తపన పడేవారు. ఆయన మృతితో కార్మికోద్యమం పెద్ద నేతను కోల్పోయిందని, ఈ కారణంగా ఏర్పడిన లోటును భర్తీ చేయడం కష్టమని సిఐటియు పేర్కొంది.

  • సిఐటియు రాష్ట్ర కమిటీ సంతాపం

కార్మిక ఉద్యమ నేత ఆచార్య వాసుదేవ్‌ మృతి పట్ల సిఐటియు ఎపి రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎవి నాగేశ్వరరావు, సిహెచ్‌ నరసింగరావు, నాయకులు వి ఉమామహేశ్వరరావు, నరసింహ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రైల్వే కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, బ్యాంకుల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ కార్మికుల పోరాటానికి అండగా నిలిచారన్నారు. పార్లమెంటులో రైల్వే కార్మికుల సమస్యలపై ఆయన గట్టిగా పోరాడారని అన్నారు..

  • ఎఐకెఎస్‌ సంతాపం

కార్మికులు, కర్షకుల సమైక్యత కోసం తీవ్రంగా శ్రమించిన నేత వాసుదేవ్‌ ఆచార్య అని అఖిల భారత కిసాన్‌ షభ పేర్కొంది. వృద్ధాప్యం మీద పడుతున్నా వెరవకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి పరితపించేవారని కొనియాడింది. ఆయన పనితీరు రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకంగా వుంటుందని పేర్కొంది. ఈ మేరకు ఎఐకెఎస్‌ నేతలు అశోక్‌ ధావలె, విజూ కృష్ణన్‌ ఒక ప్రకటన జారీ చేశారు.

  • వ్యవసాయ కార్మిక సంఘం సంతాపం

వాసుదేవ్‌ ఆచార్య మృతికి అఖిల భారత వ్యవసాయ కార్మికుల సంఘం కేంద్ర వర్కింగ్‌ కమిటీ సంతాపం తెలియజేసింది. ఆరు దశాబ్దాల పాటు కార్మిక రంగ ఉద్యమంతో ఆయన జీవితం పెనవేసుకుపోయిందని, ఆయన మృతి దేశంలో వామపక్ష, కార్మిక రంగ ఉద్యమానికి తీరని లోటని సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విజయరాఘవన్‌, బి.వెంకట్‌ పేర్కొన్నారు.