ప్రజాశక్తి - హిందూపురం : విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తు విద్యార్థి, యువజన సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం హిందూపురం పట్టణంతో పాటు నియోజక వర్గ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కలిసి ఉదయం నుంచి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలకు వెళ్లి బంద్‌కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.
కొత్తచెరువు. : విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కుట్ర పన్నుతున్నదని దీనిని పరిరక్షించుకుందామని ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయక కార్యదర్శి పవన్, ఎఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు అరుణ్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా బుధవారం కొత్తచెరువు, బుక్కపట్నం మండలాల్లోనే అన్ని ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు అంజి, గోవర్ధన్, భరత్ అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
లేపాక్షి : రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్ లో భాగంగా లేపాక్షి మండలంలోని మండల పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో స్టూడెంట్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
మడకశిర రూరల్ : కడప ఉక్కు పరిశ్రమ సాధనకు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ మడకశిరలో విజయవంతం అయింది. బంద్‌లో భాగంగా పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ నాయకులు జూనియర్ కళాశాల విద్యార్థులను బయటకు పంపి కళాశాలను బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, సందర్భంగా పిడిఎస్యు జిల్లా కార్యదర్శి ఉమేష్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థిసంఘాల నాయకులు పాల్గొన్నారు.
కదిరి టౌన్ : విద్యా సంస్థల బంద్ కదిరిలో విజయవంతం అయింది. వారం రోజులుగా విద్యార్థులలో చైతన్యం కల్పించడం వల్ల 60శాతం స్వచ్చంధంగా విద్యార్థులు కళాశాలలకు హాజరు కాలేదన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నియోజకవర్గ కార్యదర్శి విజరు, ఎఐఎస్ఎఫ్ వల్లం రాజేంద్రప్రసాద్, నళ్లజోడు పవన్, ఎస్ఎఫ్ఐ ప్రవీణ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
చిలమత్తూరు : విద్యార్థి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బుధవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ చిలమత్తూరులో విజయవంతమైంది. ప్రయివేటు విద్యాసంస్థలు స్వచ్చందంగా పాఠశాలలకు సెలవు ప్రకటించాయి. ఇక ప్రభుత్వ పాఠశాలలను ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్ నాయకులు బాబావలి, చంద్రశేఖర్ రెడ్డి తదితరులు బంద్ చేయించారు.