బ్యాంకాక్ : థాయిలాండ్ జైలులో ఉన్న మాజీ ప్రధాని తక్సిన్ షినవత్రా (47) అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. తక్సిన్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలియాల్సి వుందని అన్నారు. తక్సిన్కు గుండె, ఊపిరితిత్తులు, వెన్నెముక మరియు రక్తపోటుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని, ఆయనను నిశితంగా పరిశీలిస్తున్నామని అసిస్టెంట్ నేషనల్ పోలీస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ప్రచువాబ్ వాంగ్సుక్ మీడియాకు తెలిపారు. జైలులో వైద్యులు, వైద్య పరికరాలు లేకపోవడంతో ఆయనను పోలీస్ ఆస్పత్రికి తరలించామని ఆయన అన్నారు.
ఇటీవల ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్బంధించిన మొదటి రోజే అనారోగ్యం పాలయ్యారని అన్నారు. అధికార దుర్వినియోగం, వ్యక్తిగత ప్రయోజనాల వైరుధ్యాల్లో దోషిగా తేలడంతో తక్సిన్కు సుప్రీంకోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు మంగళవారం వెల్లడించింది.