
ప్రజాశక్తి-తిరువూరు: తిరువూరు నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఎం ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేకల నాగేంద్రప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరువూరు పరిధిలో నీళ్లులేక ఎండిపోతున్న వరి పంటలను గురువారం నాయకులు పరిశీలించారు. తిరువూరు పట్టణంలోని రాకేట్, కట్టలేరు సప్లరు ఛానల్స్ పరిధిలో ఉన్న 14 చెరువులు నీరు లేక ఎండిపోయాయని, ఈ 20 ఏళ్లలో లేని కరువును మరలా చూడాల్సిన పరిస్థితి వచ్చిందని నాగేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటను బతికించుకునేందుకు రైతులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతమన్నారు. పంటలు ఎండిపోతుండటంతో ఇప్పటివరకు ఎకరాకు అయిన రూ.25 వేలు నుండి 30 వేల వరకు చేసిన అప్పును ఎలా తీర్చాలో రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వ్యవసాయ అధికారులతో నియోజకవర్గంలో ఎండిపోయిన, ఎండిపోతున్న పంటలను సర్వే చేయించి తిరువూరు నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఎస్వీ భద్రం, ఆకుల రవి, బి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.