May 28,2023 08:12

చిత్ర పరిశ్రమలో అగుపెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రతి ఒక్కరికీ ఒక్కో గతం ఉంటుంది. అలా తెలుగు పరిశ్రమలో నటుడిగా పలు చిత్రాల్లో నటిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్న నటుడు శివబాలాజీకీ ఓ గతానుభవం ఉంది. ప్రస్తుతం సినిమాల్లోనూ, వెబ్‌ సిరీస్‌లతోనూ బిజీగా ఉన్న శివబాలాజీ తాజాగా ఓ యూట్యుబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.. అవేంటో తెలుసుకుందాం..!
నటుడు శివ బాలాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు. కేవలం సినిమాలతోనే కాకుండా బిగ్‌బాస్‌- 1, నీతోనే డ్యాన్స్‌, రేస్‌ వంటి టీవీషోలతో బుల్లితెర ప్రేక్షకులకూ బాగా దగ్గరయ్యారు. తాజాగా 'సింధూరం', 'శాకుంతలం' వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రను పోషించారు. ఈ క్రమంలో శివబాలాజీ ఓ ఛానెల్‌కు స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని ముఖ్య సంఘటనలను అభిమానులతో పంచుకున్నారు. అయితే మనకు నటుడిగానే పరిచయమైన శివబాలాజీ 20 ఏళ్లకే సొంతంగా వ్యాపారాన్ని స్థాపించారు. 22 ఏళ్లకు 'ఇది మా అశోగ్గాడి లవ్‌ స్టోరి' తో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'చందమామ', 'కోకిల', 'శంభో శివ శంభో' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. బిగ్‌బాస్‌ వంటి రియాల్టీ షోకు వెళ్లి విజేతగా తిరిగొచ్చారు.

3
  • సినిమాలపై ఉన్న ఇష్టంతో..

శివ బాలాజీ మాట్లాడుతూ.. 'చెన్నైలో మా నాన్న ఓ కంపెనీ రన్‌ చేసేవారు. నేను సినిమాల్లోకి రావడం ఆయనకు ఏమాత్రం ఇష్టం లేదు. చెన్నైలోనే ఉండి వ్యాపారాలు చూసుకోవాలని కోరారు. నాకు సినిమాలపై ఉన్న ఇష్టంతో హీరో అవుదామని హైదరాబాద్‌కు వచ్చేశా. తొలిసారిగా ''ఇది మా అశోక్‌ గాడి లవ్‌స్టోరీ''లో హీరోగా ఛాన్స్‌ వచ్చింది. రూ.40 వేల వరకూ రెమ్యూనరేషన్‌ వచ్చింది. ఆ వెంటనే చిన్న రూమ్‌ అద్దెకు తీసుకున్నాను. కానీ ఆ తర్వాత అవకాశాలు లేవు. రోజుకు ఒక్క పూట మాత్రమే తినేవాడిని. ఆకలి చంపుకునేందుకు త్వరగా పడుకునేవాణ్ణి. మంచి నీళ్లతోనే రోజులు గడిపే వాడిని. ఒక నెలమాత్రం చాలా కష్టపడ్డా!' అంటూ ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

  • ఏడు కిలోమీటర్లు పరిగెత్తా..

నాకు అవకాశాలు తేలికగా రాలేదు. 'ఎలా చెప్పను' సినిమా నిర్మాతలు కేబీఆర్‌ పార్కుకి వాకింగ్‌కు వచ్చినప్పుడు వాళ్లకు రివర్స్‌లో ఎదురొచ్చి, హారు చెప్పేవాడిని. ఒక్కోసారి చూడకపోతే.. ఏడు కిలోమీటర్లు పరిగెత్తి మళ్లీ ఎదురొచ్చి, పలకరించేవాడిని. దీంతో 'కేబీఆర్‌' పార్కులో ఓ అబ్బాయి తిరుగుతుంటాడు తనని పిలవండి అని కబురు పంపారు. అలా 'ఎలా చెప్పను'తో మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత సుకుమార్‌ గారు 'ఆర్య' ఆడిషన్స్‌కు పిలిచారు. వెంటనే ఓకే చేసేశారు. కానీ ఆ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అని వద్దనుకున్నా.. చేయనని చెప్పాను. తర్వాత వాళ్లందరూ నాకు సర్ది చెప్పారు. దీంతో ఓకే చేశాను. బన్నీ ఆ సినిమా అప్పుడు ఎంత ఆప్యాయంగా ఉన్నాడో ఇప్పుడూ అలానే ఉంటాడు' అని చెప్పుకొచ్చారు.

  • జాతకాలు సెట్‌ అవ్వలేదని వద్దన్నారు..

ఇక పెళ్లి విషయం మాట్లాడుతూ 'మధు ఇండిస్టీకి ఎప్పుడో వచ్చింది. నేను తన తర్వాత చాలా రోజులకు వచ్చాను. మేమిద్దరం కలిసి 'ఇంగ్లీష్‌ కరన్‌' అనే సినిమాలో నటించాం. అది పూర్తయ్యేటప్పుడు ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నామని అర్థమైంది. కానీ ఇద్దరం ఓపెన్‌ అవ్వలేదు. అలా ఫోన్‌లు మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. ఒకరోజు పెళ్లి చేసుకుందామా అని అడిగేశాను. వాళ్ల అమ్మ అంగీకరించలేదు. జాతకాలు సెట్‌ అవ్వలేదని వద్దన్నారు. సంవత్సరం కష్టపడితే ఇంట్లో వాళ్లు ఓకే అన్నారు. నేను వంట బాగా చేస్తాను. ఇప్పుడు ఇంట్లో పిల్లలతో కలిసి నేను కూడా అల్లరి చేస్తా' అని చెప్పారు.

3

పేరు : శివబాలాజీ
పుట్టినతేదీ : అక్టోబర్‌ 14, 1980
పుట్టిన ప్రాంతం : చెన్నరు
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
చదువు : గ్రాడ్యుయేషన్‌, డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌
భార్య : మధుమిత
పిల్లలు : ధన్విన్‌, గగన్‌
తల్లిదండ్రులు : మనోహరన్‌ రామస్వామి,శివకుమారి మనోహరన్‌
హాబీస్‌ : రైటింగ్‌, ట్రావెలింగ్‌,ప్లేయింగ్‌ క్రికెట్‌