
- దసరా పారిశుధ్య పనిలో దోపిడీకి గురైన కార్మికులు
- కాంట్రాక్టర్ వెనుక వైసిపి నేతల హస్తం?
- అక్రమాలపై విచారణకు కార్మిక సంఘాల డిమాండ్
ప్రజాశక్తి-విజయవాడ: శ్రమ ఒకరిది...ఫలితం మరొకరికి అన్న చందంగా తయారైంది దసరా నవరాత్రి ఉత్సవాల్లో పారిశుధ్య నిర్వహణ పరిస్థితి. కార్మికులకు దక్కాల్సిన రూ.వెయ్యిలో కాంట్రాక్టర్ రూ.500 మిగుల్చుకున్నట్లు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కార్మికులతో పని చేయించిన మేస్త్రీలను అడ్డం పెట్టుకొని, సదరు కాంట్రాక్టర్ భారీ మొత్తంలో మిగుల్చుకున్నట్లు తెలిసింది. అధికార వైసిపి నేతలు, విఎంసిలోని పాలకవర్గం అండతో సదరు కాంట్రాక్టర్ భారీగానే మిగుల్చుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్దంగా రెండు షిప్ట్‌లు కార్మికులతో పని చేయించి, అతి తక్కువ కూలి మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి గ్రామాలకు అత్యంత గోప్యంగా పంపించినట్లు తెలిసింది. ముందస్తుగా కార్మికులతో కుదుర్చుకున్న ఒప్పందానికి విరుద్దంగా కనీసంగా భోజన సదుపాయం కల్పించకుండా, మంచినీరు, మరుగుదొడ్డి, నిద్రించడానికి అనువైన స్థలం చూపించకుండా సదరు కాంట్రాక్టర్ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినట్లు బాధిత కార్మికులు వాపోతున్నారు.
ఈ నెల 24వ తేదీతో ముగిసిన దసరా ఉత్సవాలకు పారిశుధ్య పని కోసం వెయ్యి మంది కార్మికులను వినియోగించాలని, దానికయ్యే రూ.36 లక్షలు విఎంసి చెల్లింపులు చేస్తుందని ముందస్తుగా దుర్గగుడి అధికారులు విఎంసి అధికారులతో కుదుర్చుకున్న ఒప్పందం. ఈ నిధులను తరువాత దేవాలయం విఎంసికి చెల్లింపులు చేసే విధంగా అధికారులు నిర్ణయించారు. కానీ సదరు కాంట్రాక్టర్ కార్మికులను తీవ్ర మోసం చేసినట్లు తెలిసింది. కనీసం మంచినీటి సదుపాయం కూడా కల్పించలేదు. మరుగుదొడ్డి సదుపాయంతో పాటు స్నానం చేసే పరిస్థితి విఎంసి కార్యాలయం పరిధిలో అవకాశం కల్పించకపోవడంతో పురుషులతో పాటు మహిళలు కూడా బయటకు వెళ్లి అత్యంత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. సత్రాల్లో అరకొర భోజనం చేసి రోజంతా పారిశుధ్య పని చేయాల్సి వచ్చిందని పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసంగా కంటినిండా నిద్రపోవడానికి కూడా విఎంసి నూతన బిల్డింగ్‌లో సరైన సదుపాయం లేదని, దోమల బెడదతో పలు రోగాల బారిన పడాల్సి వచ్చిందని వాపోయారు. కృష్ణానది గుంతల్లో పారుదల లేని నీటిలోనే స్నానం చేసినట్లు తెలిపారు. కార్మికులకు అందాల్సిన నగదును మధ్యదళారులు, పలువురు అధికార వైసిపి నేతలు, ప్రజాప్రతిధులు కలిసి పంచుకున్నట్లు పలువురు కార్మికులు విమర్శిస్తున్నారు. సక్రమంగా ఒక షిప్ట్ ప్రకారం రూ. 500 చెల్లించాలని, అదనపు పని చేయించినా అదనపు కూలి చెల్లించాలని, కానీ ఇవేవి ఇక్కడ ఈ సారి వర్తించలేదని వాపోతున్నారు. పారిశుధ్య నిర్వహణలో కార్మికులకు అందాల్సిన నగదు పంపిణీలో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే మరిన్ని వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.