ప్రజాశక్తి-కాకినాడ రూరల్ కాకినాడ శిల్పారామంలోని శిల్పకళా వేదికపై శ్రీవాగ్దేవి నృత్య నికేతన్ ఆధ్వర్యంలో బాలోత్సవ్-2023 కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించినట్ట సంస్థ కార్యదర్శి టి.తేజేశ్వరరావు తెలిపారు. శిల్పారామంలోని శిల్పకళా వేదికపై బాలోత్సవ్-2023 కూచిపూడి నృత్య ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మానికిరెడ్డి హెల్త్ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మానికిరెడ్డి సత్యనారాయణ, శిల్పారామం ఎఒ టి.సూర్య ప్రకాష్ పాల్గొన్నారు. మానికిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ సంప్రదాయ కళలు జాతికి పట్టుగొమ్మలు అని శారీరక, మానసిక బుద్ధి వికాసానికి కళలు దోహదపడతాయన్నారు. ఈ ఉత్సవంలో శ్రీ విఘ్నరాజం భజే, అదివో అల్లదివో, సూర్యవందనం, శ్రీలలితా హారతి, మహిషాసురమర్దిని వంటి అంశాలు ప్రేక్షకులను అలరించాయి. బాలోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీవాగ్దేవి నత్య నికేతన్ నాట్యాచారిణి కళ్యాణి తేజేశ్వరరావును టి.సూర్యప్రకాష్ అభినందించారు. ఈ సందర్భంగా సెక్రటరీ తేజేశ్వరరావు మాట్లాడుతూ తమ చిన్నారుల ప్రదర్శనకు అవకాశం కల్పించిన శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డి.శ్యాంసుందర్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రదర్శనలో బాల భవిష్క, లతిక, శ్రీకృతి, నందన, పల్లవి, రుచి, నిస్సి ప్రియ, జశ్విత, యోచన పాల్గొన్నారు.