
ప్రజాశక్తి - నందిగామ : నందిగామ పురపాలక సంఘం అధికారుల ఉదాసీనత వైఖరితో నందిగామ పట్టణంలో నానాటికి దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చేసే అభివృద్ధి మాట ఏమో కానీ ప్రతి పని వివాదాస్పదమవుతుందనే ఆరోపణలు ఎదుర్కొం టున్నారు. ముఖ్యంగా గాంధీ సెంటర్లోని విగ్రహాల తొలగింపు, ఏర్పాటు విషయం హైకోర్టు వరకు వెళ్లి ప్రస్తుతం గాంధీ సెంటర్లో సాయంత్రం పూట కనీసం వీధి దీపాలు కూడా వెలిగించలేని దుస్థితికి కారణమని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ సెంటర్లో కోర్టు వివాదంలో ఉండగానే ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం విద్యుత్ పెట్టలేని పరిస్థితికి పురపాలక సంఘం అధికారులు చేతులెత్తేసినట్లు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటుకు ముందు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి గత నగర పంచాయతీ సమయంలో ఏర్పాటు చేసిన నాలుగు విద్యుత్ లైన్లు ఇనుప స్తంభం పీకి పడవేసిన మున్సిపల్ అధికారులు దానిని ఎక్కడ వేశారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఏ సమయంలో నవనందిగామ నిర్మాణం పేరిట గాంధీ సెంటర్ నుండి రామన్నపేట రోడ్డు, గాంధీ సెంటర్ నుండి చందర్లపాడు రోడ్డు విస్తరణ పనులు సందర్భంగా ముందస్తు ప్రణాళిక లేకుండా చేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పురపాలక సంఘం అధికారులు మంచినీటి లైన్లు, విద్యుత్ శాఖ లైన్లు మార్చకుండానే హడావుడిగా తవ్వకాలు చేపట్టడం వలన నేటికీ కూడా మంచినీటి పైపులైన్లు సక్రమంగా లేకపోవడం వలన పట్టణ పరిధిలోని అనేక వార్డులకు వారం పది రోజులు దాటినా మంచినీరు అందని పరిస్థితి నెలకొంది. నందిగామ లో ప్రజా సమస్యలపై సిపిఎం, ప్రజా సంఘాల ఆద్వర్యంలో ఆందోళనలు కూడా చేయటం జరిగింది. దీనికి తోడు విద్యుత్ లైన్ లు మార్చాలంటూ వారానికో, 10 రోజులకు ఒక మారు విద్యుత్ శాఖ అధికారులు నూతన స్తంభాల పేరిట విద్యుత్ కోత విధిస్తూ పట్టణ ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ప్రస్తుతం వెడల్పు చేసిన రోడ్లకు ఆనుకొని ఇస్తానుసారంగా వ్యాపారులు ఎక్కడపడితే అక్కడ తోపుడుబండ్లు రోజువారి వ్యాపారం నిర్వహిస్తూ నందిగామ నుండి చందర్లపాడు వెళ్లే రోడ్డులో రైతు బజార్ ముందు విపరీతంగా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారు.
ఎక్కడి చెత్త అక్కడే...
నందిగామ పురపాలక సంఘం పరిధిలో ఇంతవరకు శానిటరీ ఇన్స్పెక్టర్ లేకపోవడం గమనార్హం. అనుభవం లేని ఒక వ్యక్తిని శానిటరీ విభాగంలో 20 వార్డులలో పర్యవేక్షణకు వేయటం, అతనికి పర్యవేక్షణ అనుభవ లేకపోవడం వల్ల పట్టణంలో అనేకచోట్ల చెత్త ఎత్తే వారే లేక మురికి కాల్వలు క్లీన్ చేసేవారే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పబ్లిక్ టాయిలెట్లు పేరిట టిడిపి కళ్యాణ మండపం వద్ద, రామన్నపేట రోడ్డులోని ట్రావెల్స్ బంగ్లా రోడ్డు ఆరంభ ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేయటం ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలను కూడా విస్మయానికి గురిచేసింది. రామన్నపేట రోడ్డులోని జిల్లా కోర్టు వద్ద రోడ్డు అడ్డంగా కల్వర్టు నిర్మించి రెండు నెలలు పూర్తి అవుతున్న నేటికీ దాని అప్రోచ్ రోడ్డు పోయకుండా వదిలివేయటం పాలక సంఘం అధికారుల తీరుతెన్నులకు అద్దం పడుతోంది. దాదాపుగా 15 నుంచి 20 గ్రామాల నుంచి ఈ రోడ్డు ద్వారా ప్రతినిత్యం ప్రజలు రైతులు, విద్యార్థినీ, విద్యార్థులు, వలస కూలీలు నందిగామ చేరుకోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రధాన రహదారి మూత పడటంతో చుట్టుపక్కల నుంచి తిరిగి రావలసిన పరిస్థితులలో ప్రమాదాలు జరుగుతున్నాయని అపవాదును పురపాలక సంఘం అధికారులు మూటకట్టుకోవాల్సి వస్తుంది.