స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల రెజ్లింగ్ అండర్ -19 బాలికల ఓవరాల్ ఛాంపియన్ కృష్ణా బాలుర ఛాంపియన్ నెల్లూరు జట్టు కైవసం

ప్రజాశక్తి హెల్త్ - యూనివర్సిటీ : రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్జిఎఫ్, ఎపి) అంతర్ జిల్లాల అండర్ - 19 బాలికల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను ఆతిధ్య కష్ణా జిల్లా జట్టు కైవసం చేసుకుంది. అలాగే బాలుర చాంపియన్‌షిప్‌ను చిత్తూరు జట్టు కైవసం చేసుకోగా, బాలుర గ్రీకో రోమన్ ఛాంపియన్‌షిప్‌ను నెల్లూరు జట్టు దక్కించుకుంది. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జిఎఫ్ఐ), అంధ్రప్రదేశ్ సహకారంతో కష్ణాజిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలం నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్ - 19 బాల బాలికల రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఆదివారం రాత్రి ముగిసింది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల నుంచి సుమారు 320 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో అన్ని జిల్లాల క్రీడాకారులు గెలుపు కోసం విశేషంగా కషి చేశారు. ఈ టోర్నమెంట్లో అండర్ - 19 బాలికల ఫ్రీ స్టైల్ విభాగంలో కష్ణాజిల్లా జట్టు రెండు బంగారు పతకాలు, ఒక రజత పకతంతో పాటు ఐదు కాంస్య పతకాలను సాధించి 145 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా జట్టు మూడు బంగారు పతకాలు, రెండు కాంస్య పతకాలతో 105 పాయింట్లు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. బాలుర గ్రీకో రోమన్లో నెల్లూరు జిల్లా క్రీడాకారులు రెండు బంగారు, రెండు రజత, మూడు కాంస్య పతకాలతో 135 పాయింట్లను సాధించి ఛాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు. ఆతిథ్య కష్ణాజిల్లా బాలికల జట్టు సాధించిన రెండు బంగారు పతక గ్రహీతలు నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు కావడం విశేషం. ముగింపు కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జిటివి రమణ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు పతకాలను బహుకరించి ఓవరాల్ చాంపియన్‌షిప్ ట్రోఫీలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలోనూ రాణించాలన్నారు. స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల క్రీడా పోటీలకు నున్న ఆతిధ్యం ఇవ్వడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. నున్న హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వజ్రాల భూపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘం ప్రతినిధి నరెడ్ల సత్యనారాయణరెడ్డి, పోటీల పరిశీలకుడు భూషణం, వ్యాయామ అధ్యాపకులు టి.విజయ వర్మ, టి.శ్రీలత, ఎంవిఎస్ ప్రసాద్, జి.రాంబాబు,. కష్ణాజిల్లా జట్టు కోచ్ భార్గవ్ పాల్గొన్నారు.