Nov 02,2023 22:29

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ప్రజల ముంగిటకే సేవలు అందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వర ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సచివాలయాలు అందుబాటులో లేకుండా అలంకార ప్రాయంగా మిగిలిపోతున్నాయని కొంతమంది స్థానికులు వాపోతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని 38వ డివిజన్‌ బ్రాహ్మణ వీధి, మల్లికార్జునపేటలోని 113, 114, 115 సచివాలయాలు గురువారం తెరిచి వుంచారు గానీ, అక్కడ సేవలు అందించే వారూ ఎవరూ కనబడని పరిస్థితిలో ఖాళీగా దర్శనమిస్తున్నాయి. దీంతో గురువారం ఉదయం కొంతమంది స్థానికులు తమ సమస్యలను తెలుసుకోవటం కోసం వెళ్ళగా సచివాలయంలో సమాధానం చెప్పేవారు లేక వెనుదిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చిందని కొంతమంది వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పరిష్కరించుకోవాల్సిన సచివాలయాలు తెరిచి వుండి, ఎవరూ లేకపోవటం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వాలంటరీలు వివిధ పనులకు డివిజన్‌లో తిరుగుతుంటారని, కానీ వివిధ రకాల సేవలు అందించే సెక్రటరీలు కూడా విధుల్లో కనిపించకపోవటంపై స్థానిక ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి సచివాలయం కార్యాలయంలో తగిలించాల్సిన సిఎం ఫొటో కూడా కింద ఉంది. సచివాలయాల సేవలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని ప్రజల కోరుతున్నారు.