Nov 02,2023 22:33

ప్రజాశక్తి-జగ్గయ్యపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా విజయవాడలో ఈ నెల 15న జరిగే ప్రజా రక్షణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జగ్గయ్యపేట మండల పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి కోరారు. మండలంలోని షేర్‌ మహమ్మద్‌ పేట గ్రామంలో ఎర్రగడ్డ బజార్‌లో గురువారం ప్రజారక్షణభేరి బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విద్యా విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని, ప్రభుత్వ ఆసుపత్రులు నామమాత్రంగా తయారవడంతో కార్పొరేట్‌ ఆసుపత్రులు దోపిడీకి సామాన్యులు బలైపోతున్నారని అన్నారు. అధికార పక్షంలో ఉన్న వైసిపి, ప్రతిపక్షంలో ఉన్న టిడిపి రెండూ కేంద్రంలో ఉన్న బిజెపి విధానాలను బలపరుస్తూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం కేంద్రానికి అలవాటుగా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కె గురవమ్మ, కె రాధ, మంగ, దంతాల రాజేశ్వరి, నరసమ్మ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.