మత్స్యకారులకు సబ్సిడీ వాహనాలు పంపిణీ
రూ.29.8లక్షలతో సబ్సిడి: చిత్తూరు ఎంఎల్ఏ
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి మత్స్యకారులకు అండగా నిలబడుతున్నారని చిత్తూరు ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు అన్నారు. మంగళవారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా పిఎంఎంఎస్వై కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి పలుసంక్షేమ కార్యక్రమాలను వర్చువల్‌గా ప్రారంభించారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎంఎల్ఏ ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మత్స్యకారులకు భరోసాగా వారి వాణిజ్య వ్యాపారాలకు అవసరమైన సదుపాయాలను సబ్సిడీతో అందించడం జరుగుతున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మత్స్యకారులకు అండగా నిలబడుతున్నారని తెలిపారు. వివిధ సామాజికవర్గాలకు చెందిన మత్స్యవ్యాపారం చేసుకునే లబ్ధిదారులు మత్స్య సంపదను ఒక చోట నుండి మరో చోటకు సరఫా చేయుటకు వారి వాణిజ్య వ్యాపారాలకు అవసరమైన 4 చక్రాల వాహనాలను, ద్విచక్రాల వాహనాలను సబ్సిడీతో అందించడం జరుగుతున్నదన్నారు. ఆంధ్ర ఫిష్స్టాల్ లను ఏర్పాటు చేసి మత్స్య వ్యాపారం చేసుకునే వారికి ఆర్థిక భరోసా కల్పించడం జరుగుతున్నదన్నారు. జిల్లాలో పిఎంఎంఎస్వై 2020-21, 2021-22 ద్వారా యూనిట్ ధర రూ.20లక్షలు గల ఆక్సిజన్ సిలిండర్లు, డ్రమ్‌లతో కూడిన 4చక్రాల వాహనాలను ముగ్గరు లబ్ధిదారులకు రూ.60లక్షలు విలువ కాగా వీటిని రూ.28లక్షల సబ్సిడీతో, యూనిట్ ధర రూ.75వేలు విలువ గల ఐస్‌బాక్స్‌తో కూడిన ద్విచక్ర వాహనాలను నలుగురు లబ్ధిదారులకు రూ.3లక్షలు విలువ కాగా వీటిని రూ.1.80లక్షలతో సబ్సిడీతో పంపిణీ చేయడమైనది. కార్యక్రమంలో లబ్ధిదారులు జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, మత్స్యకారులు, అధికారులు పాల్గొన్నారు.
చెన్నై నుండీ చేపలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నా..
- రాజారావు, బంగారుపాళెం మండలం
బంగారుపాళెం సొసైటిలో గత 15 ఏళ్లుగా సభ్యుడిగా ఉన్నాను. చెన్నై, వేలూరు నుండి చేపలు తీసుకుని వచ్చి స్థానికంగా అమ్మకాలు జరుపుతుంటా. చేపలు తీసుకురావడానికి గతంలో చాలా ఇబ్బందులు పడేవాళ్లం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 4 చక్రాల ఈచర్ వాహనాన్ని సబ్సిడీతో అందించడం ద్వారా నా కుటుంబం అభివద్ధిలోకి వస్తుందని ఆశిస్తున్నాను.
మత్స్యకారులకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి
- హారిక, పుంగనూరు
గత 10 ఏళ్లుగా చేపల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాను. గతంలో ఏ ప్రభుత్వాలు మత్స్యకారుల మేలు కోసం ఇంతగా ఆలోచించలేదు. చేపల వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం సబ్సిడితో అందించిన ద్విచక్ర వాహనం చాలా ఉపయోగపడుతుంది. దీని ద్వారా మా కుటుంబఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.