ప్రజాశక్తి-విజయనగరంకోట : తమకు మంజూరైన ద్విచక్ర వాహనాలు పొందేందుకు ఎంతో ఆశతో వచ్చిన మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురైంది. జాబితాలో డ్రైవింగ్ లైసెన్సులేని మహిళలు, పురుషులు ఉండడం, అర్హుల పేర్లు లేకపోవడంతో జెడ్పి చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మత్స్యశాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, పంపిణీని నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో మత్స్యకార దినోత్సవానికి హాజరైన మత్స్యకారుల్లోను, అధికారుల్లోను నిరాశ నెలకొంది.
ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కలెక్టరేట్ ఆవరణలో 32 మంది లబ్ది దారులకు 24 లక్షల విలువైన ద్వి చక్ర వాహనాలను, ఎస్సి వర్గానికి చెందిన ఇద్దరు లబ్దిదారులకు 33,29,798 లక్షల విలువైన రెండు ఫిష్‌సీడ్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను, రూ.20 లక్షల విలువైన ఇన్సులేటెడ్ వాహనాన్ని అందజేసేందుకు లబ్ధిదారులను పిలిచారు. వాటిని పంపిణీ చేసేందుకు మత్స్యశాఖ ఎడి నిర్మలా కుమారి జాబితా అందించారు. దాన్ని పరిశీలించి జెడ్పి చైర్మన్ ఆరుగురు మహిళల పేర్లు ఉన్నాయి. ఒకరిని పిలిచి నువ్వేనమ్మా లబ్ధిదారు అని అడిగారు. నీకు టూ వీలర్స్ లైసెన్స్ ఉందా అని ప్రశ్నించగా, లేదని ఆమె చెప్పింది. దీంతో ఎడిపై చైర్మన్ ఆగ్రహం వ్యకక్తం చేస్తూ లబ్ధిదారుల జాబితా ఇలా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. మహిళా కోటాలో ఆమెకు వచ్చిందని ఎడి చెప్పినా చైర్మన్ ఇది కరెక్టర్ కాదని చెబుతూ అసహనం వ్యక్తం చేశారు. ' ఈ టూ వీలర్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిలుపుదల చేయండి' అంటూ జాయింట్ కలెక్టర్ మయూర అశోక్‌ను ఆదేశించారు. జాబితాపై ఒక కమిటీ వేసి విచారణ చేయాలని సూచించారు. దీంతో ఎంతో ఆశగా వచ్చిన మత్స్యకారుదారులు నిరాశతో వెనుదిరిగారు.
అనంతరం రెండు ఫిష్‌సీడ్ ట్రాన్స్‌పోర్టు వాహనాలను, ఇన్సులేటెడ్ వాహనాన్ని లబ్ధిదారులకు జెడ్పి చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఫిష్ ఆంధ్ర పేరుతో టౌన్ లోను చిన్నచిన్న పట్టణాల్లోనూ ఏర్పాటు చేసి మంచి చేపలను ప్రజలకు అందిస్తున్నామన్నారు. చేపల వేట విరామం సమయంలో మత్స్యకారులకు జీవన భృతి చెల్లిస్తున్నామన్నారు. మత్స్య కార వృత్తి పైనే ఆధార పడి, మత్స్య వ్యాపారాలు చేసే వారికి ప్రభుత్వం అనేక రకాలుగా ఉపకరణాలను అందించడమే కాకుండా వేట నిషేద సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు చొప్పున ప్రభుత్వం భృతి కల్పిస్తుందని అన్నారు. ఈ నెల 20న విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు కాలిపోయిన వారికి 80 శాతం వరకు ప్రభుత్వమే ఇన్సురెన్సు ను భరిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు బర్రి చిన్నప్పన్న, తదితరులు పాల్గొన్నారు.