Nov 21,2023 00:00

కరాటేలో మెరిసిన 'వెన్నెల'

కరాటేలో మెరిసిన 'వెన్నెల'
- ఆల్‌ ఇండియా చాంపియన్‌ షిప్‌ పోటీల్లో విశేష ప్రతిభ
- ఫైట్‌లో స్వర్ణం, కటాలో వెండి పతకాలు కైవశం
ప్రజాశక్తి- తిరుపతి బ్యూరో:
ఆల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో తిరుపతి గ్రామీణ మండలంకు చెందిన చిన్నారి వెన్నెల తన ప్రతిభతో మెరిసింది. కరాటేలో నిర్వహించిన ఫైట్‌ పోటీల్లో స్వర్ణపతకం సాధించగా కటాలో వెండి పతకాన్ని సొంతం చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి గ్రామీణ మండలం కుంట్రపాకం గ్రామానికి చెందిన హరిబాబు, కవితల కుమార్తె వెన్నెల తిరుపతి నగరంలోని రత్నం గ్లోబల్‌ స్కూల్‌లో 8వ తరగతి చదవుతోంది. కరాటేపై ఆసక్తి చూపడంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి తిరుపతిలో కరాటే మాస్టర్‌గా శిక్షణా కేంద్రం నడుపుతున్న సింహాచలం వద్ద శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో ఈనెల 17వ తేదీన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్‌ జిల్లాలో నిర్వహించిన ఆల్‌ ఇండియా ఓపెన్‌ కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలలో వెన్నెలకు అవకాశం కల్పించారు. తన కోచ్‌ సూచనల మేరకు వెన్నెల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని విజేతగా స్వర్ణం, వెండి పతకాలను సాధించుకుంది. దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల నుంచి 1250 మంది పోటీలో పాల్గొనగా అండర్‌-13 బాలికల విభాగంలో వెన్నెల తన ప్రతిభను చాటుకున్నారు. వచ్చే ఏడాది జనవరి మాసంలో బంగ్లాదేశ్‌ వేదికగా జరిగే అంతర్జాతీయ కరాటే పోటీలకు వెన్నెల ఎంపికవడంతో ఆమెకు తన కోచ్‌ సింహాచలం మరింత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. అతి త్వరలో ఏసియా కరాటే పోటీల్లో పాల్గొని, ఆ తర్వాత ఇండియా తరపున ప్రపంచ స్థాయి పోటీల్లో పాల్గొనడమే లక్ష్యంగా కరాటే శిక్షణ తీసుకుంటున్నట్లు వెన్నెల స్పష్టం చేశారు. కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీలలో అత్యంత ప్రతిభను కనబరచి స్వర్ణ, వెండి పతకాలు సొంతం చేసుకున్న చిన్నారి వెన్నెలను సోమవారం తుడా ఛైర్మన్‌ చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కుంట్రపాకం నుంచి జాతీయ స్థాయి కరాటే పోటీలకు హాజరై విజేతగా నిలవడం నిజంగా అభినందనీయమని, భవిష్యత్తులో మరోన్నో విజయాలు సొంతం చేసుకోవాలని ఆకాంక్షించారు.