
ప్రజాశక్తి-గూడూరు : కలంకారీ కళ భావితరాలకు అందించేం దుకు, ఈ పరిశ్రమను ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ బుధవారం పెడనలో కలంకారి వస్త్రాల తయారీ యూనిట్లను సందర్శించారు. కలంకారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకుని. కలంకారీని ప్రోత్సహించేందుకు తీసుకోవ లసిన చర్యలపై చర్చించారు. తొలుత శ్రీనివాస కోరమండల్ కలంకారి యూనిట్ సందర్శించిన కలెక్టర్ కు యూనిట్ అధినేత డాక్టర్ వైయస్సార్ అచీవ్మెంట్ అవార్డు-2022 గ్రహీత పిచ్చుక శ్రీనివాస్ కలంకారి వస్త్రాల తయారీ, రంగుల అద్దకం గురించి కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఝాన్సీ కలంకారి షోరూం, తయారీ యూనిట్ ను సందర్శించారు. ఈ సంస్థ అధినేత పిచ్చుక కోటేశ్వరరావు కలంకారి వస్త్రాల తయారీ లో దశలు, అవసరమైన రా మెటీరియల్, కార్మికుల నిపుణత గురించి కలెక్టర్కు వివరించారు. కలంకారి అద్దకానికి వినియోగించే బ్లాకుల తయారీ నిపుణుడు జాతీయ అవార్డు గ్రహీత శిల్ప గురు కొండ్రు గంగాధర్ కలెక్టర్ ను కలిసి డిజైన్ బ్లాక్ ల తయారీ గురించి వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కలంకారి కష్ణాజిల్లా ప్రత్యేకతగా నిలుస్తుందని అన్నారు. ఈ పరిశ్రమను భావితరాలకు అందించుటకు, ప్రమోట్ చేయుటకు చర్యలు తీసుకుంటామన్నారు. పరిశ్రమల శాఖ జిఎం ఆర్. వెంకట్రావు, డిడి విజరు కుమార్, హ్యాండ్లూమ్ ఏడి కే. అప్పారావు, తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.