గుక్కెడు నీటి కోసం రోజుల తరబడి తిరిగిన జిరాఫీల గుంపు ఒకేచోట కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయాయి. మానవ తప్పిదాల కారణంగా పెరుగుతోన్న భూతాపం ధాటికి వాతావరణంలో చోటుచేసుకున్న ఈ విపరీత మార్పులు మూగజీవాల ప్రాణాలను బలిగొంటున్నాయి. హృదయాన్ని ద్రవింపజేసే ఈ దారుణ దృశ్యం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వాతావరణ పరిస్థితుల్లో మార్పులు రాకుంటే మనుషులకూ ఇలాంటి దుస్థితే తప్పదనే సంకేతాలిస్తున్నాయి ఆఫ్రికా దేశంలోని పరిస్థితులు.. దీనికి పర్యావరణంలో సంభవించి మార్పులే కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే మానవ తప్పిదానికి మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. అసలు ఆఫ్రికాలో నెలకొన్న పరిస్థితులేంటో తెలుసుకుందాం.
ఆఫ్రికాలోని కెన్యాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు రాజ్యమేలుతున్నాయి. వర్షాలు పడక.. నీళ్లు లేక.. తిండి దొరక్క మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వార్తలు ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారాయి. ఆరు జిరాఫీలు తిండి, తిప్పలు లేకుండా ఒకేచోట పడి, చనిపోయిన హృదయ విదారక చిత్రాలు అందరినీ కదిలించి వేస్తున్నాయి. ఈ విషాద ఘటన వాజిర్‌లోని సాబూలీ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీలో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వివరాలను అక్కడి సిబ్బంది మీడియాతో పంచుకున్నారు.
ఆఫ్రికాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల నేపథ్యంలో వర్షాలు పడక నీటి సమస్య తలెత్తిందని, మూగ జీవాలు నీళ్ల కోసం వెతుకులాట మొదలు పెట్టాయని, అలా వెళ్లిన జిరాఫీలు కన్జర్వెన్సీలోని ఓ రిజర్వాయర్‌లోకి వెళ్లాయని, అందులోని ఓ బురద మడుగులో కూరుకుపోయి, బయటకు రాలేకపోయాయని చెప్పారు. దీంతో తిండి, నీళ్లు లేక అలమటించి అవి ప్రాణాలు వదిలాయని వివరించారు. జిరాఫీల కళేబరాలు అక్కడ తీవ్రమైన కరువు పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.
జిరాఫీల కళేబరాలను.. వాటిని ఇతర ప్రదేశానికి తీసుకెళ్లినట్లు తీసిన చిత్రాలు ప్రపంచాన్ని కదిలించాయి. రిజర్వాయర్‌లోని మిగిలిన నీరు కలుషితం కాకుండా ఉండేందుకు మృతదేహాలను అక్కడి నుంచి తరలించారు. ఈ చిత్రాలు ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. అదే సమయంలో, పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం ఎంత తీవ్రంగా ఉంటుందో ఆలోచించాల్సిన అవసరాన్ని ఈ ఫొటోలు చాటి చెబుతున్నాయి.
క్షీణించిన వర్షపాతం..
సెప్టెంబర్ నుంచి కెన్యా ఉత్తరప్రాంతంలో సాధారణ వర్షపాతం కన్నా 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో అక్కడ కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం, నీళ్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అటు పాడి పశువులకు గ్రాసం కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక వన్యప్రాణుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
ఈ కరువు పరిస్థితులతో పెంపుడు జంతువుల కన్నా వన్యప్రాణులకే ముప్పు ఎక్కువగా పొంచి ఉందని బౌర్ ఆల్జీ జిరాఫీ శాంక్చువరీ ఉద్యోగి ఇబ్రహీం అలీ వివరించారు. సాబూలీ వైల్డ్‌లైఫ్ కన్జర్వేటరీలో పరిస్థితి మారాలని స్థానికులు ప్రార్థనలు కూడా చేస్తున్నారని తెలిపారాయన.
పెంపుడు జంతువులకు అంతో ఇంతో ఇంట్లో వాళ్లైనా గ్రాసం, నీళ్లు ఇస్తారు. కానీ, వన్యప్రాణుల సంరక్షణను చూసేవారు ఎవరుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరువు పరిస్థితులకు తోడు నదీ తీరాల్లో పంటపొలాల వల్ల జిరాఫీలకు నీరు దొరక్కుండా పోతోందని, వాటి దుస్థితికి ఇది మరో కారణమని అలీ వివరించారు. అయితే ప్రభుత్వం, స్థానికుల చొరవతో కొన్ని ప్రాంతాల్లో మూగజీవాలను రక్షించేందుకు ట్యాంకర్ల ద్వారా నీటిని కుంటల్లో నింపుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయినా అవి ఎంత మేరకు రక్షణ కల్పిస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
కరువు అంచున కెన్యా వాసులు..
ఇక్కడి పరిస్థితుల ప్రకారం జంతువులతో పాటు మనుషులూ ప్రమాదానికి అంచున ఉన్నారని తేటతెల్లం అవుతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సగానికిపైగా ప్రభావితం చేసే తీవ్ర కరువు కారణంగా 2.1 మిలియన్ల కెన్యా వాసులు ఆకలి అంచున ఉన్నారని ఆ దేశ కరువు నిర్వహణ పరిపాలన విభాగం తేల్చింది. దీంతోపాటు 2.9 మిలియన్ల మంది మానవతా వాదుల సహాయం కోసం ఎదురుచూస్తున్నారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అంతే ేకాకుండా కెన్యాలో అత్యంత దారుణమైన వర్షపాతం నమో దైందని పేర్కొంది. కాగా 1981 నుంచి ఇంత పేలవమైన వర్షపాతం నమోదుకాలేదని నివేదికలు చెబుతున్నాయి.
ప్రమాదంలో నాలుగు వేల జిరాఫీలు..
ఈ కరవుతో గరిస్సా కౌంటీలోని నాలుగు వేల జిరాఫీలకు ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఓ నివేదిక కూడా విడుదలైంది. ఈ కరువును జాతీయ విపత్తుగా ప్రకటించారు కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యాట్టా. కరువు ప్రభావిత ప్రాంతాలకు సహాయంలో భాగంగా దాని ప్రభావానికి గురైన 25 లక్షల మందికి ఎమర్జెన్సీ రిలీఫ్ క్యాష్ ట్రాన్‌స్ఫర్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రభుత్వం ప్రకటించింది. వారి బ్యాంకు ఖాతాల్లోకి లేదంటే, నేరుగా ఈ నగదు సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది.