* పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి
ప్రజాశక్తి- ఆమదాలవలస: ప్రజా సమస్యల పరిష్కారమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు బొడ్డేపల్లి సత్యవతి అన్నారు. సోమవారం ఆమె స్వగృహంలో జిల్లా డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు అధ్యక్షతన నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు, కమిటీల నియామకంపై సమావేశాన్ని నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజక వర్గంలో ప్రజల సమస్యలను కాంగ్రెస్పార్టీ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి తగినచర్యలు తీసుకుంటామన్నారు. శాసనసభ ఎన్నికల నాటికీ వివిధ పార్టీలు చక్కెర కర్మాగారం అంశాన్ని ప్రస్తావించి ఎన్నికల తర్వాత విస్మరిస్తున్నారన్నారు. కొందరు నేతలు చక్కెర కర్మాగార స్థలాన్ని రియల్ ఎస్టేట్ చేసేందుకు పావులు కదుపుతున్నారన్నారు. డిసిసి అధ్యక్షులు పేడాడ పరమేశ్వరరావు మాట్లా డుతూ జిల్లాలో ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని నేటి పాలక, ప్రతిపక్షాలు విస్మరించి దోచుకోవాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస మండల అధ్యక్షునిగా బొడ్డేపల్లి గోవింద గోపాల్, సరుబుజ్జిలి మండల అధ్యక్షునిగా బొడ్డేపల్లి కోదండరావు, బూర్జ మండల అధ్యక్షుడుగా పప్పల వెంకటరమణ, పొందూరు మండల అధ్యక్షుడిగా పైడి రమణారావులను ఏకగ్రీవ తీర్మానంతో ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల అన్నాజీరావు, బసవ షణ్ముఖరావు, కె.ఈశ్వరి, తెంబూరు మధు, లఖినేని సాయిరాం, బొత్స రమణ, దాలయ్య సనపల వాసుదేవరావు, పప్పల అప్పారావు, అప్పారావు, రామారావు, రాజారావు పాల్గొన్నారు.