
- యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి-నందిగామ: ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొచ్చిన జిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పాత పెన్షన్ విధానమును అమలు చేయాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. శుక్రవారం నందిగామ మండల యుటిఎఫ్ శాఖ నూతన కౌన్సిల్ సమావేశం కంచర్ల సుబ్బారావు భవన్‌లో జరిగింది. మండల అధ్యక్షుడు గోనుగుంట్ల యలమందయ్య అధ్యక్షత వహించారు. ఈ సమావేశం నందు ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యలను చర్చించి ఈ క్రింది తీర్మానాలను ఆమోదించారు. ఈ సందర్భంగా నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎస్‌పి మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసే విధానాలను విడనాడాలన్నారు. ఉపాధ్యాయులు ప్రజలతో మమేకమై ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించుకోవాలని కోరారు. ప్రభుత్వం విద్యారంగానికి నష్టం కలిగించే అంశాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఉద్యోగులకు రావలసిన పిఆర్సి బకాయిలను, పిఎఫ్ రుణాలు, పార్ట్ పేమెంట్లు, ఏపీజేఎల్‌ఐ మెచ్యూరిటీస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా యూటీఎఫ్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కుక్కడపు శ్రీనివాసరావు వ్యవహరించారు. మండల గౌరవాధ్యక్షులుగా ములుగు శ్రీనివాసరావు, అధ్యక్షులుగా బెనర్జీ, సహాధ్యక్షులుగా ఎస్‌కె సుభాని, సహాధ్యక్షురాలుగా జి.గిరి సుజా, ప్రధాన కార్యదర్శిగా చిన్నం నరసింహారావు, కోశాధికారిగా గడ్డం లక్ష్మీనారాయణ, కార్యదర్శులుగా ఎస్‌కే నాగుల మీరా, జి.ఎలమందయ్య, టి వెంకటేశ్వరరావు, వేల్పుల భూషణం, పి.వి.సుహాసిని ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ హరినాధ రెడ్డి , జిల్లా కోశాధికారి మహేశ్వర వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.