
ప్రజాశక్తి- మునగపాక రూరల్
స్థానిక రాహుల్ గాంధీ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. వివిధ సమస్యలపై 178 అర్జీలు వచ్చాయి. వాటిని కలెక్టర్ రవి పట్టన్‌శెట్టి, ఇతర అధికారులు స్వీకరించారు. తిరస్కరణకు గురైన వాటికి సమాధానంలో కారణాలను వివరంగా తెలియజేయాలన్నారు. 178 దరఖాస్తుల్లో ఎక్కువగా భూ సమస్యలు, రేషన్ కార్డుల దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం (స్పందన)కు వచ్చే అర్జీలకు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని, వేగంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి, అసిస్టెంట్ కలెక్టర్ బి.స్మరణ రాజ్, ఆర్డిఓ ఏ.చిన్నికృష్ణ, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
మండల సమస్యలపై రైతు సంఘం, సిఐటియు నేతల వినతి
మండలంలోని సమస్యలపై కౌలు రైతు సంఘం నాయకులు ఆళ్ల మహేశ్వరరావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ, రైతు సంఘం నాయకులు పెంటకోట సత్యనారాయణ తదితరులు జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి పట్టాన్ శెట్టికి వినతి పత్రం అందజేశారు. ప్రమాదాలకు నిలయంగా మారిన అనకాపల్లి- అచ్యుతాపురం రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. అనకాపల్లి వయా పరవాడ తంతడి రోడ్డు విస్తరించి నిర్మాణ పనులు జరపాలని, గవర్ల అనకాపల్లిలో నిర్మించిన బ్రిడ్జిని ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. మునగపాక మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు భవనాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాలకు పక్క భవనాలు నిర్మించాలని, ఉపాధి హామీ కూలీలకు 200 రోజులు పని దినాలు కల్పించాలని, రోజుకు రూ.600 వేతనం చెల్లించాలని కలెక్టర్‌ను కోరారు.