ప్రజాశక్తి - వన్‌టౌన్ : ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) విజయవాడ ప్రాంతీయ కార్యాలయంలో సహాయ ప్రాంతీయ సంచాలకులు (అసిస్టెంట్ రీజినల్ డైరెక్టర్)గా పనిచేస్తున్న డాక్టర్ ప్రసాద్ బాబుకు డెప్యూటీ డైరెక్టర్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు ఇగ్నో కేంద్ర కార్యాలయం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. సైకాలజీ రంగంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉత్తమ మనస్తత్వ విశ్లేషకుడు, రచయిత, ఉపన్యాసకుడిగా ప్రసిద్ధి పొందిన ప్రసాద్ బాబు మానవ మనస్తత్వంపై 53 పుస్తకాలు రచించారు. జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని 50కి పైగా పరిశోధన పత్రాలు సమర్పించారు. సైకాలజీ, ఎడ్యుకేషన్ రంగాల్లో ఆయన రాసిన 200కు పైగా వ్యాసాలు జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ప్రసాబ్ బాబు పరిశోధన మార్గదర్శకత్వంలో ఇప్పటికి ఆరుగురు ఎం.ఫిల్, ఒకరు పిహెచ్.డి పట్టాలు అందుకున్నారు. పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు.