బాంబులు
పడుతూనే ఉంటాయి
ఉన్మాదానికి అంతం ఎక్కడీ
పగలో రాత్రో తెలియదు
మట్టి పొరల్లో కదా జీవనం
ఆకలిగొన్నప్పుడే
ఉపరితలంపై పరుగులు
ఆకలికి పసి ఆరాటమే
ప్రాణభయం తెలియదుగా.
చూస్తుండగానే మళ్ళీ బాంబు!
శకలాలుగా మానవ దేహాలు
గుండెలవిసే ఆర్తనాదం
నేలను బాదుకునే ఆక్రందనం
జాతిని, మతాన్ని
తుడిచిపెట్టాలన్నది వాడి దుగ్ధ
అంగీ లాగూలే జాతిమతాలని
వాడికెవడు చెప్పాలి?
కసిగా రగిలే
స్వాభిమాన ఊపిరే
మట్టిపొరల వేడి.
వాడికేం మిగిలింది
శ్రాద్ధం - పిండాకూడు
బాంబు చోటే వాడిది
పుడమంతా పచ్చదనం
మట్టిలోనా మట్టిపైనా
క్షణక్షణం పరుచుకునే
జీవం
మరుభూమిపైనా మొలిచే
పచ్చటి చిగురు.
- కె. శాంతారావు,
సెల్ : 9959745723