ఒకానొకప్పుడు ఒక చెట్టుమీద ఒక పావురం ఉంటుండేది. దానికి, ఒక కోడిపుంజుకు మంచి స్నేహం. ఆ పుంజు దగ్గరలో నున్న పూలతోటలో ఉండేది. అవి ప్రతి సాయంత్రం కలుసుకుని సరదాగా కబుర్లు చెప్పుకునేవి.
ఒకరోజు చాలా ఆకలితో ఉన్న తోడేలు ఒకటి ఆ పూల తోటలోకి వచ్చింది. తినడానికి అక్కడ ఏమైనా దొరుకుతుందేమోనని వెతకసాగింది. ఇంతలో దానికి కోడిపుంజు కన్పించింది. ఈ కోడి చక్కగా బలిసి ఉంది. దీన్ని ఎట్లైనా చంపి తినాలి అనుకొంది. మెల్లగా వెళ్ళి ఆ కోడి పుంజును పట్టుకొని తన సంచిలో వేసుకొని పారిపోసాగింది. కోడి భయంతో సంచిలో నుండి అరుస్తోంది.
చెట్టుపైన కూర్చున్న పావురం జరిగినదంతా చూసింది. వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. తోడేలు కంటే ముందుగా ఎగిరి వెళ్ళి అది పోయే దార్లో చచ్చిన దానిలాగా పడుకొంది. దారిలో పడిఉన్న ఆ పావురాన్ని తోడేలు చూసింది.
'ఆహా! ఏమి అదృష్టం నాది! ఒక కోడి, ఒక పావురం నాకు దొరికాయి. ఇవ్వాళ మంచి విందు భోజనం చేస్తాను. అనుకొంది. నోట్లో ఉన్న సంచిని కింద ఉంచి పావురాన్ని తీద్దామని దాని దగ్గరగా వెళ్ళింది.
సందు దొరికింది అనుకొని కోడి వెంటనే సంచిలో నుండి బయటకి వచ్చి, ఆ సంచిలో ఒక రాయిని పెట్టి తాను వెళ్ళి పక్కనే ఉన్న పొదలో దాక్కుంది.
తోడేలు పావురాన్ని పైకి తీద్దామని వంగింది. ఈలోగా పావురం తుర్రుమని ఎగిరిపోయింది. ఓసి! దొంగ పావురమా! ఎంత మోసం చేశావే! అనుకుంటూ సంచిని భుజాన వేసుకుని ఇంటికి చేరింది.
ఆరోజుకు ఆ కోడితోటే సరిపెట్టుకుందామని సంచి తెరిచింది. అంతే! గుండె గుభేలుమంది. కోడిలేదు గానీ ఒక రాయి ఉంది. 'కోడి రాయిగా ఎట్లా మారిందబ్బా' ఇప్పుడు నేనేం తినాలి అనుకుంటూ ఏడుస్తూ కూర్చుంది.
కోడీ, పావురం ఒకచోట చేరి తోడేలు తెలివి తక్కువ తనానికి నవ్వుకున్నాయి.
నీతి : అత్యాశ అవమానాల పాలు చేస్తుంది.
ఆదర్శ్
6వ తరగతి, విజరు హైస్కూల్,
నిజామాబాద్, తెలంగాణ.