
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : మహారాణిపేటలో ఉన్న విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ స్థలంలో అధునాతన గ్రంథాలయ భవన నిర్మాణం వెంటనే చేపట్టాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పౌర గ్రంథాలయాల సేవా సమితి ఆధ్వర్యాన మంగళవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ఐఎఎస్ అధికారి ఇఎఎస్.శర్మ, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్.శర్మ, పౌర గ్రంథాలయాల సేవా సమితి అధ్యక్షులు బిఎల్.నారాయణ మాట్లాడుతూ, 1968లోజిల్లా గ్రంథాలయ సంస్థకు మహారాణిపేటలో ఎకరం విస్తీర్ణం గల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆ స్థలంలో జిల్లా గ్రంథాలయం 2010 వరకు నడిచిందని తెలిపారు. 2010లో ఆ భవనాన్ని కూచివేశారని, రూ.100 కోట్ల విలువైన ఆ స్థలాన్ని పలుకుబడి కలిగిన ఒక ప్రముఖుడికి డెవలప్‌మెంట్ అగ్రిమెంట్ పేరుతో కట్టబెట్టారని తెలిపారు. ప్రజా సంఘాలు వ్యతిరేకించి పోరాడటం ద్వారా ఆ ఒప్పందాన్ని 2014లో రద్దు చేశారని చెప్పారు. కానీ నేటికీ ఆ స్థలంలో మళ్లీ గ్రంథాలయ భవన నిర్మాణం చేయలేదన్నారు. ఆ స్థలాన్ని సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ ఆక్రమించిందని, వారిని ఖాళీ చేయించి, అధునాతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ వద్ద రూ.200 కోట్లకు పైగా నిధులు ఉన్నాయని, అయినప్పటికీ గ్రంథాలయ భవనం నిర్మాణం చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడి, రాష్ట్ర ప్రభుత్వం సిఆర్‌పిఎఫ్‌ను అక్కడి నుంచి తొలగించలేకపోతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై ఫౌర గ్రంథాలయాల సేవాసమితి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేసిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం, ఆ స్థలం తమ ఆధీనంలో ఉందని, సిఆర్‌పిఎఫ్ బెటాలియన్ అందులో లేదని, గ్రంథాలయ భవనానికి అవసరమైన నిధులు ఉన్నాయని, భవనాన్ని నిర్మిస్తామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొందని వివరించారు. అఫిడవిట్‌లో పేర్కొన్న మేరకు, నేటి వరకు ప్రభుత్వం జిల్లా గ్రంథాలయ భవనాన్ని నిర్మించలేదన్నారు. ఇదే అంశంపై సమాచార హక్కు ప్రకారం, సమాచారం కోరగా, గ్రంథాల సంస్థ స్థలంలో అధునాతన గ్రంథాలయ భవనాన్ని త్వరలో నిర్మిస్తామని, ఇందుకు రూ.2 కోట్లు ఖర్చు చేయనున్నట్లు కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చిందన్నారు. ఇంత జరిగినా, నేటికీ ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం కానీ, అందులో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించడం కానీ చేయలేదని తెలిపారు. ఇప్పటికైనా స్థలాన్ని స్వాధీనం చేసుకొని అన్ని సౌకర్యాలతో ఆధునిక భవనాన్ని నిర్మించాలని, లేకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఫ్లోర్‌లీడర్ డాక్టర్ బి.గంగారావు, మాజీ కార్పొరేటర్ బొట్టా ఈశ్వరమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షులు బి.పద్మ, పౌర గ్రంథాలయ సేవా సమితి కార్యదర్శి కె.త్రిమూర్తులు, నరవ ప్రకాశరావు, వి.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.