
ప్రజాశక్తి-వన్‌టౌన్: ఇంద్రకీలాద్రిపై ఎటుచూసినా భవానీలే దర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసి నేటితో మూడు రోజులైంది. ఈ నేపధ్యంలో దుర్గమ్మను దర్శించుకునేందుకు గురువారం కూడా భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో పద్మావతి ఘాట్, దుర్గాఘాట్, భవానీ, పున్నమి ఘాట్‌లు భవానీలతో కిటకిటలాడుతున్నాయి. కుమ్మరిపాలెం వైపు నుండి హెడ్ వాటర్స్ వర్క్స్ వద్ద ఏర్పాటు చేసిన క్యూ లైను ద్వారా, అలాగే పద్మావతి ఘాట్ వైపు ఉన్న భవానీలు వినాయకుని గుడి వద్ద ఉన్న క్యూలైన్ల ద్వారా ఇంద్రకీలాద్రి చేరుకుని దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. వీరి కోసం దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. భవానీల తాకిడితో వన్‌టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ నుంచి బ్రాహ్మణ వీధి, ప్రధాన రహదారి అంతా సందడిగా మారింది.