
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి మీనా సమీక్షలో కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్లు రాజాబాబు, డిల్లీరావు
ప్రజాశక్తి-మచిలీపట్నంరూరల్, విజయవాడ : వచ్చే సాధారణ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లాల కలెక్టర్ పి.రాజాబాబు, ఎస్.డిల్లీ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనా శుక్రవారం అమరావతి సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వివిధ జిల్లాల్లో 2014, 2019 సాధారణ ఎన్నికల నిర్వహణ గురించిన సమాచారంతో పాటు 2024 సాధారణ ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్ల గురించి సమీక్షించారు. మచిలీపట్నం కలెక్టరేట్ నుండి కలెక్టర్ రాజాబాబు, ఎస్‌పి జాషువా మాట్లాడుతూ కృష్ణా జిల్లాలో ఒక పార్లమెంటు నియోజకవర్గం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయన్నారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లాలో మాన్ పవర్ సంబంధించి సెక్టార్ అధికారులు 159, మైక్రో అబ్జర్వర్లు 1940, ప్రిసైడింగ్ అధికారులు 1940, పోలింగ్ ఆఫీసర్స్ 7757, బి ఎల్ ఓ లు 1763 మంది అవసరం కాగా, దాని ప్రకారం ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ నిర్వహణకు శిక్షణ కేంద్రంతో పాటు స్ట్రాంగ్ రూము, కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విజయవాడ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డిల్లీరావు, సిపి క్రాంతి రాణా టాటా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి నియోజక వర్గాల వారీగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, కేసుల ప్రస్తుత పరిస్థితి తదితరాలను వివరించారు. 2023 డిసెంబర్ మొదటి వారానికి ప్రొవిజనల్ ఎన్నికల నిర్వహణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం, డబ్బు రవాణా తదితరాల అడ్డుకట్టకు తీసుకునే చర్యలు, చెక్‌పోస్టులకు సంబంధించిన అంశాలను కూడా వివరించారు. ఎన్నికల సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఓటు నమోదు ప్రత్యేక శిబిరాలు
ఈ నెల 4, 5 తేదీలతో పాటు డిసెంబర్ 3, 4 తేదీల్లో కొత్తగా ఓటు హక్కు పొందడం, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు సరిచేయడం వంటి వాటి కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఈ శిబిరాలు జరిగే తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ స్టేషన్లలో బీఎల్‌వోలు అర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటు నమోదుతో పాటు అక్టోబర్ 27న ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు సరిచేయడం, చనిపోయిన వారిని ఓటును జాబితా నుంచి తొలగించడం, ఓటరు కార్డులో తప్పుల సవరణ తదితర సేవల కోసం శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. జనవరి 5వ తేదీన తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్ డిల్లీరావు వివరించారు.