
ప్రజాశక్తి - జగ్గయ్యపేట: దళితులైన డప్పు కళాకారులు పోరాడి సాధించుకున్న ప్రభుత్వ గుర్తింపు కార్డులను గతంలో లాగానే జిల్లా సమాచార పౌరసంబంధాల అధికారి (భాషా సాంస్కతిక శాఖ) ద్వారానే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కుటుంబరావు డిమాండ్ చేశారు. మండలంలోని చిల్లకల్లు మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం మండల అభివద్ధి అధికారి రమేష్ బాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబరావు మాట్లాడుతూ భారత సమాజంలో అత్యంత పురాతన కళగా వున్న డప్పు కళ దళితుల వత్తి కళగా వున్న కారణంగా దళితులే కాదు, దళిత కళ కూడా అంటరానిదై ప్రభుత్వ గుర్తింపు లేకుండా కొనసాగిందన్నారు. 2006 నుండి ఆంద్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోరాట ఫలితంగా 2013లో డప్పు కళాకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను సాధించుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో డప్పు కళాకారులకు మద్దతుగా సిపిఎం మండల పట్టణ కార్యదర్శి సోమోజు నాగమణి, జె.వెంకటరావు, డప్పు కళాకారుల సంఘం నాయకులు జి.ఆదాం, పాల్గొన్నారు.