Aug 20,2023 12:25

అమ్మా! చెబితే వినిపించుకోవేంటి..? నీ మొండితనం నీదేనా? ఈ పాడుబడిన ఇంట్లో ఒక్కదానివే ఎన్నాళ్లని పడి ఏడుస్తానంటావు? కానీ కొడుకు ఓ ఇల్లు కట్టుకొని, బాగుపడతానంటే మాత్రం ఒప్పుకోవే?' విసుగ్గా అడుగుతున్నాడు శ్రీధర్‌.
'పాడుపడిన ఇల్లా? ఎంత మాటన్నావు శ్రీధర్‌! నువ్వూ, చెల్లీ పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. మీరు ఇక్కడే కళ్ళు తెరిచారు. ఈ నాలుగు గోడల మధ్యనే తప్పటడుగులు వేశారు. తప్పేదో ఒప్పేదో నేర్చుకొని, బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టారు. మీ ఏడుపులు, కేరింతలు, అల్లర్లు, అలకలు, పేచీలు.. మా బుజ్జగింపులు.. ఇలా ఎన్నో జ్ఞాపకాలను తనలో దాచుకుంది ఈ ఇల్లు. ఇది మీకు రెండోసారి జన్మనిచ్చిన తల్లి లాంటిదిరా..! నీ చెల్లేమో పెళ్లి చేసుకొని, జన్మనిచ్చిన తల్లిదండ్రులను, దేశాన్ని వదిలేసి మొగుడితో అమెరికా వెళ్ళిపోయింది. నువ్వేమో పుట్టి పెరిగిన ఇంటినే కూల్చటానికి సిద్ధమయ్యావు. ఏం పిల్లలురా మీరు?' ఆవేదనగా అంది లలితమ్మ.
'ప్రాణం లేని గోడలు, చలనం లేని వస్తువులను సెంటిమెంటుతో చూస్తే మనం ఎదగలేమమ్మా ! ఈ రోజుల్లో మనకంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు కూడా ఎంతో విలాసవంతమైన ఇళ్ళు కట్టుకొని, హాయిగా జీవిస్తున్నారు. మనం ఇంకా పాత జ్ఞాపకాలను తలచుకుంటూ బావిలో కప్పల్లా ఉంటే ఎలా?'
'విలాసం అనేది మన ఆలోచనలో ఉంటుందిరా! నివసించే ఇంటిలో ఉండదు శ్రీధర్‌. నువ్వు ఎంతో చదువుకున్నవాడివి.. ఇలాంటి విషయాల గురించి అమ్మ చేత చెప్పించుకునే వయసు కాదు నీది. అయినా గొంగళి పురుగుకి వేరే రంగు అంటదు కదా..! నాకు మాత్రం నా జీవితాన్ని పండించిన ఈ ఇల్లు స్వర్గసీమలాంటిదే.'
'అత్తయ్యా! మా ప్రపోజల్‌ మీకెందుకు నచ్చటంలేదో నాకర్థం కావట్లేదు. దీనివల్ల మీకు లాభమే తప్ప, నష్టం లేదు. అన్ని అధునాతన సౌకర్యాలు కలిగిన ఒక మంచి ఇల్లు కట్టుకొని, అందులో మనమందరం కలిసుంటే ఎంత బావుంటుందో ఒక్కసారి ఆలోచించండి..! ఇక్కడ మీరొక్కరే వండుకొని, తింటూ బి.పి, షుగర్లతో బిక్కుబిక్కుమంటూ గడిపే దుస్థితి తప్పుతుంది. అందరం ఒక్కచోటే ఉంటే మీరు తుమ్మినా, దగ్గినా డాక్టరు దగ్గరికి తీసుకెళ్ళటానికి మేము అందుబాటులో ఉండటమే కాకుండా.. కొడుకు, కోడలు, మనవడు మనవరాండ్లతో మీరు సంతోషంగా గడపొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళవుతున్నారు. మేమైనా ఇంకెన్నాళ్ళు అద్దె ఇళ్ళల్లో ఉంటాం చెప్పండి?' మంచి మాటలతో అత్తగారిని ఒప్పించాలని చూసింది కుసుమ.
లలితమ్మ చిన్నగా ఒక వెటకారపు నవ్వు నవ్వి 'స్వార్థానికి అందమైన దుస్తులు వేసి, అలంకరించి చూపిస్తున్నట్లు ఉన్నాయమ్మ నీ మాటలు. పెళ్ళైన ఆరు నెలలకే వేరు కాపురం పెట్టించిన నువ్వు.. ఉమ్మడి కుటుంబంలోని కమ్మదనం గురించి మాట్లాడితే నమ్మేదాన్ని కాదు నేను. నీ అంత కాకపోయినా నేనూ చదువుకున్నదాన్నేనమ్మా' అంది.
అత్తగారిని లాగి ఓ చెంప దెబ్బ కొట్టాలన్నంత కోపం వచ్చింది కుసుమకి. కానీ అవసరం తమది కాబట్టి, అనవసరమైన ఇగో చూపడానికి ఇది సమయం కాదని భావించి, మౌనంగా ఉండిపోయింది.
మళ్ళీ లలితమ్మే అంది 'మిమ్మల్ని అద్దె ఇళ్ళు పట్టుకొని తిరగమని ఎవరన్నారు? మీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేకే వెళ్ళిపోయారు. మీ మామగారు మంచాన పడ్డప్పుడైనా వచ్చి, కనీసం నాలుగు రోజులు ఇక్కడ ఉండలేదు. ఆయన పోయినప్పటి నుండీ ఈ ఇంట్లో ఒక్కదాన్నే పడి ఉంటున్నాను. ''ఒంటరిగా ఎలా ఉంటావు, వచ్చి నువ్వూ మాతో పాటే వుందువుగానీ రా..!'' అని నువ్వు, నీ భర్త, నీ పిల్లలు ఏనాడైనా అన్నారా? పోనీ మీరైనా నెలకో, రెండు

నెలలకో ఒక్కసారైనా వచ్చి నాతో రెండ్రోజులు గడిపి వెళ్ళొచ్చు! కానీ అదీ చెయ్యలేరు. కనీసం అప్పుడప్పుడు ఫోన్‌ చేసి, నాతో కాస్సేపు మాట్లాడటానికి కూడా మీకు తీరికుండదు. ఇప్పుడొచ్చి కలిసుండటంలో ఉన్న ఆనందం గురించి.. కల్లబొల్లి మాటలు చెప్తున్నారు' ఆమె గొంతు వణికింది.
ఇంతకు ముందు అత్తగారిని చెంపదెబ్బ కొట్టాలనిపించిన కుసుమకే ఈసారి ఆమె మాటలు చెప్పుదెబ్బల్లా తగిలాయి. తన్నుకొస్తున్న కుసుమ ఊక్రోషాన్ని వాస్తవం దిగమింగింది.. అవసరం అడ్డుకుంది.
కొడుకు, కోడలి మౌనమే సంజాయిషీ అయ్యింది. కొద్దిసేపటి నిశ్శబ్దం తర్వాత మళ్ళీ లలితమ్మే మాట్లాడింది. 'మీకు నేను ఆఖరిసారిగా చెప్తున్నాను.. నేను బతికుండగా ఈ ఇల్లు కూల్చటానికి వీల్లేదు. నేను పోయాక ఇల్లు కూల్చి, ఇంద్రభవనమే కట్టుకుంటారో.. స్థలమే అమ్ముకుంటారో మీ ఇష్టం. అప్పటివరకూ ఆగలేకపోతే మీకు నచ్చిన చోట స్థలం కొనుక్కొని, అక్కడ కట్టుకోండి ఇల్లు.'
'ఇల్లు కట్టుకోవడానికే బ్యాంకు నుండి లోన్‌ తీసుకుంటున్నాను. మళ్ళీ కొత్తగా స్థలం కొనాలంటే నాకు సాధ్యమవుతుందా అమ్మా?'
'అదంతా నాకు తెలియదు. నా నిర్ణయం మాత్రం ఇదే! ఇక దీని గురించి వాదోపవాదాలు వద్దు' అని చెప్పి, వంటింట్లోకి నడిచింది లలితమ్మ, ఒకరకంగా వాళ్ళను వెళ్ళిపొమ్మన్నట్లుగా.
ఇక ఆమెతో మాట్లాడి లాభంలేదనుకున్న శ్రీధర్‌, కుసుమ దెబ్బతిన్న ముఖాలతో బయటకు నడిచి, కారెక్కారు.
తన మొండితనంతో కొడుకు ఆశలకు అడ్డుకట్ట వేస్తున్నందుకు లలితమ్మ కాస్త గిల్టీగా ఫీలయ్యింది. 'నా మితిమీరిన అభద్రతా భావంతో.. వాడి ఆశల మీద నేను నీళ్ళు చల్లుతున్నానా? వాళ్ళను నేను మరీ శత్రువుల్లా చూస్తున్నానా?' అని తనని తాను పదే పదే ప్రశ్నించుకుంది.
ఆమె భర్త మొదటి నుండీ కొడుకు మీద కంటే కూతురి మీదే వల్లమాలిన ప్రేమ, ఆప్యాయత కనబర్చారు. కానీ లలితమ్మ మాత్రం బయటకు కనిపించకపోయినా, తన ఇద్దరు పిల్లలకు భౌతికంగా సమాన ఆప్యాయతల్ని పంచింది. అయినా లోలోపల ఏ మూలో శ్రీధర్‌ పట్ల మమకారం కాస్తంత ఎక్కువే తల్లివేరులా పాతుకొనిపోయింది. సమానమైన రెండు చేతుల్లో కుడిచెయ్యి అందించే భరోసా మాదిరిగా 'కొడుకు' అనే భద్రతాభావమే బహుశా ఇందుకు కారణం కావచ్చు. కానీ పెళ్లయ్యాక శ్రీధర్‌ స్వభావంలో వచ్చిన మార్పు లలితమ్మను ఆలోచనలో పడేసింది. ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలహీనపర్చే 'స్వార్థం' అనే వైరస్‌ ఒక్కరిలో ఉంటే చాలు! ఇక ఆ కుటుంబంలోని అనురాగాల మధ్య అంతరం 'సోషల్‌ డిస్టెన్స్‌'లా మొదలయ్యి, వేర్పాటువాదం వరకూ వెళుతుంది. లలితమ్మ కుటుంబంలోకి ఈ వైరస్‌ కుసుమ రూపంలో ప్రవేశించింది. అనారోగ్యం పాలై, భర్త మంచాన పడ్డ రోజుల్లో ఆమెకు పూర్తిగా తత్వం బోధపడింది. అప్పటినుండీ కొడుకు విషయంలో ఒక విధమైన నిరసన వైఖరి అవలంబిస్తూ వస్తోంది. ఒక సందర్భంలో భర్త తనతో చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. 'లలితా.. మనిద్దరితో మొదలైన మన సంసారం చివరకు మన ఇద్దరిలో ఎవరో ఒకరితో ముగుస్తుంది. మధ్యలో పిల్లలు పుట్టి, పెరిగి.. పెద్దవాళ్ళై ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి మిగిలిన మనిద్దరిలోంచి ఎవరో ఒకరం ముందుగా తనువు చాలించాక.. ఒంటరైన ఆ ఒక్కరం కొన్నాళ్ళు జ్ఞాపకాలతో కాపురం చేసి.. మరికొన్నాళ్ళు అలాగే కష్టాలు అనుభవించి, తుదకు శ్వాస ఆగటంతో ఆట ముగుస్తుంది!'
ఆనాడు ఆ మాటలు విని 'ఈయనేంటి వేదాంతం మాట్లాడుతున్నారు?' అనుకుంది. కానీ ఈ రోజు భర్త చెప్పిన మాటల్లో నూటికి నూరుపాళ్ళు నిజం ఉందనిపించింది ఆమెకు. ఈ ప్రపంచంలో తుది శ్వాస వరకు తోడుండే మనిషి దొరికిన వ్యక్తి ఉంటాడా..?!
లలితమ్మ ఎన్నిసార్లు పునరాలోచన చేసినా పాత ఇంటిని పడగొట్టి, కొత్త ఇల్లు కట్టుకోవటానికి అనుమతించటం మంచిది కాదనిపించింది. అది నలభై యేళ్ళ క్రితం భర్త కట్టిన ఇల్లు. ఆయన పోయిన తర్వాత కొడుకు నిరాదరణకు గురై, అదే ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న ఆమెకు.. భర్త తోడుగా ఉన్న ఫీలింగ్‌తో బతుకుతోంది. ఒకవేళ కొడుకు కట్టుకున్న ఇంటిలో వాళ్ళతో పాటు ఉంటే అక్కడ తను ఒక కాందిశీకురాలిగా.. ఇంటిపనిలో కోడలికి సహాయం చేసే పనిమనిషిలా బతకాల్సి వస్తుందన్నది ఆమె భయం. ఇప్పుడుంటున్న ఇంట్లో ఆమె ఒంటరే అయినా తనే యజమానురాలు, తనే పనిమనిషి కూడా. ఇద్దరూ ఉన్నన్ని రోజులు కుటుంబంలో ఒకరి ఆత్మాభిమానానికి మరొకరు రక్షకులుగా ఉంటారు. కానీ ఒకరు ముందుగా వెళ్లిపోతే ఇక ఉన్నవారు ఆత్మగౌరవాన్ని చంపుకునే అవసరం అడుగడుగునా కలుగుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో. ఇవన్నీ తెలిసిన లలితమ్మ ఇప్పుడు తాను 'మెట్టు దిగితే జారి బురద నీళ్ళలో పడిపోవటం ఖాయం' అనే నిజాన్ని పసిగట్టింది కాబట్టే పట్టుదలగా ఉంటోంది.
మరుసటి రోజు పొద్దున్నే శ్రీధర్‌ లలితమ్మకు ఫోన్‌ చేసి 'అమ్మా! నీ నిర్ణయం నువ్వు చెప్పేశావు. ఇక నా నిర్ణయం విను. నాన్న ఉన్నప్పుడు ఇల్లు నాకు రాసిచ్చారన్న విషయం నీకు తెలుసు. అప్పుడు అది మీ ఇద్దరి ఇష్టపూర్వకంగా జరిగింది. సో..! ఇప్పుడు ఇంటికి పూర్తి హక్కుదారుని నేనే. ఇంటిని పడగొట్టి, ఆ స్థలంలో కొత్త ఇల్లు కట్టుకోవడానికి లేదా స్థలం అమ్ముకోవటానికి నాకు నీ అనుమతి కానీ, ఇంకెవ్వరి అనుమతి కానీ అవసరం లేదు. కాబట్టి నీకు మరోసారి మంచిగా చెబుతున్నాను..! కాదు, కూడదు అనకుండా నువ్వు ఇంటిని పడగొట్టడానికి నాకు సహకరించు. అలా చేస్తే కొత్త ఇల్లు పూర్తయ్యేవరకు నువ్వు మాతో పాటే ఉండి, ఆ తర్వాత మాతో కలసి గృహప్రవేశం చెయ్యొచ్చు. లేదంటే నీకు ఆ అవకాశం కూడా ఉండదు. అప్పుడు నువ్వు శాశ్వతంగా ఏ వృద్ధాశ్రమమో చూసుకోవలసి ఉంటుంది. అంతేకాదు నెలనెలా నీ పోషణకు అయ్యే ఖర్చు ఇకముందు నేను భరించను. బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో!' అని చెప్పి ఆమె మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా ఫోన్‌ కట్‌ చేశాడు.
లలితమ్మకు గుండె పగిలినట్లనిపించింది. 'నేను కన్న కొడుకేనా వీడు.. ఎంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాడు. ఎంతో గారాబంగా పెంచి.. పెద్ద చేస్తే, చివరకు వీడు అమ్మతో వ్యవహరించే పద్ధతి ఇదా..?' అనుకుంది. కన్నీళ్ళు జలజలా రాలిపడ్డాయి. అలా ఎంతసేపు ఏడ్చిందో ఆమెకే తెలీదు. కానీ ఉనికి లేని కన్నీళ్ళు.. సముద్రం మీద కురిసిన కుంభవృష్టి రెండూ ఒక్కటే కదా..! ఓదార్పు లేని ఒంటరితనమే ఒక నరకం.
దుఃఖం నుండి తేరుకున్న తర్వాత ఆమెలో కంగారు మొదలైంది. 'నేనిప్పుడు ఏంచెయ్యాలి? వాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు. ఒంటరి ముసలిదాన్ని. ఉన్నఫళంగా నన్ను రోడ్డు మీదకు గెంటేస్తే.. ఎక్కడికని వెళ్ళాలి? ఆయన బతికుంటే తనే ఏదో ఒకటి చేసేవారు. ఏనాటికైనా కన్న కొడుక్కే కదా చెందవలసిందే అనే పిచ్చి ప్రేమతో ఆనాడు ఇల్లు వాడికి రాసిచ్చాము. కానీ కడుపున పుట్టినవాడే వెన్నుపోటు పొడుస్తాడని ఊహించలేకపోయాం' అనుకుంది. బాగా ఆలోచించాక ఆమెకు తమ్ముడు ధనుంజయం గుర్తొచ్చాడు. ఆయన అదే ఊరిలో డిప్యూటీ తహశీల్దారుగా పనిచేస్తున్నాడు. వాడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు! అనుకుంటూ ఫోన్‌ తీసుకొని ధనుంజయానికి కాల్‌ చేసింది. విషయమంతా పూసగుచ్చినట్లు చెప్పింది.
అంతా విన్న ధనుంజయం 'అక్కా, నువ్వేమీ కంగారుపడకు. నేనున్నాను! వాడికెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. రేపు నేను ఇంటికొచ్చి, అన్ని విషయాలు మాట్లాడతాను' అని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. తమ్ముడు అభయమివ్వటంతో లలితమ్మ మనసు స్థిమితపడింది.
'మిస్టర్‌ శ్రీధర్‌ ! నీకు నోటీస్‌ పంపించి, నిన్ను ఇక్కడికి ఎందుకు పిలిపించానో తెలుసా? మీ అమ్మగారు నీకు వ్యతిరేకంగా రాతపూర్వక ఫిర్యాదు ఇచ్చారు. ఆమె ఉంటున్న ఇంటిని కూల్చివేస్తాననీ.. అందుకు ఆవిడ అంగీకరించకపోతే బలవంతంగా అనాథ శరణాలయానికి పంపుతాననీ బెదిరిస్తున్నావట నిజమేనా?' అధికారం ఉట్టిపడుతున్న గొంతుతో అన్నారు ఆర్‌.డి.ఓ. ఆయన టేబుల్‌ మీద ఉంచబడిన చిన్న మందంపాటి నీలిరంగు చెక్క పలకపై తెలుపు రంగులో 'రెవెన్యూ డివిజినల్‌ అధికారి అండ్‌ సబ్‌ డివిజినల్‌ మెజిస్ట్రేటు' అని రాసి ఉంది. ఆ టేబుల్‌కి ఇంకో వైపు విజిటర్స్‌ కూర్చోవటానికి వేసి ఉన్న రెండు ప్లాస్టిక్‌ కుర్చీలలో ఒకదాంట్లో లలితమ్మ, మరో కుర్చీలో ఆమె తమ్ముడు ధనుంజయం కూర్చొని ఉంటే, వారి వెనకాల శ్రీధర్‌ నిలబడి ఉన్నాడు.
'నిజమే సర్‌ ! ఎందుకంటే ఆ ఇంటిపై పూర్తి హక్కులు నాకున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితమే మా అమ్మనాన్నలు వారి ఇష్టపూర్వకంగా ఆ ఇల్లు నాకు రాసిచ్చారు చూడండి!' అంటూ శ్రీధర్‌ తన చేతిలో ఉన్న డాక్యుమెంట్‌ పేపర్లను వినయంగా ఆర్‌.డి.ఓ గారి చేతికి అందించాడు.
ఆయన వాటిని పరిశీలించకుండానే తన టేబుల్‌ మీద ఓ పక్కన పెట్టేసి, శ్రీధర్‌ వైపు చూస్తూ 'చూడు మిష్టర్‌.. ఆనాడు మీ పేరెంట్స్‌ వాళ్ళ ప్రాపర్టీ నీకు రాసిచ్చారంటే అందుకు మొదటి కారణం నీ మీద వారికున్న ప్రేమ! రెండోది, చివరి దశలో వాళ్ళను నువ్వు కంటికి రెప్పలా చూసుకుంటావన్న నమ్మకం. అంతేకానీ యేరు దాటాక తెప్ప తగలబెట్టినట్లుగా నీ స్వార్ధంతో తమను రోడ్డు మీదకు గెంటించుకోవటానికి కాదు. మీ నాన్నగారైతే పోయారు, కనీసం బతికున్న అమ్మనైనా కంటతడి పెట్టకుండా చూసుకోలేవా? నిన్ను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు నీకు ఎలాగూ లేవు, కనీసం వాళ్ళ ప్రాపర్టీ తీసుకున్నందుకైనా కృతజ్ఞత చూపించలేకపోతున్నావు? ఏం మనిషివయ్యా నువ్వు!' అంటుంటే.. శ్రీధర్‌కి తల కొట్టేసినట్లు అనిపించింది. సంజాయిషీ చెప్పలేక.. తప్పుని అంగీకరించినట్లుగా నీళ్ళు నమిలాడు.
మళ్ళీ ఆర్‌.డి.ఓ నే మాట్లాడుతూ 'నేను చెప్పేది జాగ్రత్తగా విను! ఇల్లు నీ పేరున ఉన్నప్పటికీ మీ అమ్మగారి అనుమతి లేకుండా నువ్వు ఆ ఇంటిని కూల్చడానికి వీల్లేదు. మీ అమ్మానాన్నలు ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అది. ఆవిడకు దాని మీద మమకారం ఉండటంలో అర్థం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఆవిడకు నువ్వు కష్టం కలిగించకూడదు. ''తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం'' గురించి నీకు తెలుసో లేదో..! ఇది ఒక కేంద్ర ప్రభుత్వ చట్టం. దీని ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పోషించకుండా.. వారిని శరీరకంగా, మానసికంగా కష్టపెట్టే కొడుకులు వారి ప్రాపర్టీ పొందిన కూతుళ్ళు కూడా శిక్షార్హులవుతారు. సో..! మీ అమ్మగారి విషయంలో నిన్ను హెచ్చరిస్తున్నాను. ఆవిడ అనుమతి లేకుండా ఇంటిని కూల్చే ప్రయత్నం చెయ్యటం కానీ, బెదిరించటం కానీ ఇకముందు చేస్తే నిన్ను జైలుకి పంపించగలను. అంతేకాదు ఆమెను పోషించే బాధ్యత నుంచి నువ్వు తప్పుకున్నట్లయితే నీ పేర రాయించుకున్న ఆ ఇంటి రిజిస్ట్రేషన్‌ని రద్దు చేయించి, దానిని తిరిగి మీ అమ్మ పేర మార్చేలా చర్యలు తీసుకుంటాను. అర్థమైందా?'
'అర్థమైంది' అన్నట్లుగా తలూపడం తప్ప శ్రీధర్‌ చెయ్యగలిగిందేమీ లేకుండా పోయింది.
ఇప్పుడు లలితమ్మ ఆత్మాభిమానం ఆమె చేతి ఊతకర్రలా.. ఆమె మానసిక వయోభారాన్ని నిలబెట్టింది.

సోమిశెట్టి వేణుగోపాల్‌
9182584724