Nov 08,2023 00:26

మాట్లాడుతున్న లా వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు

ప్రజాశక్తి-సబ్బవరం : స్థానిక దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వ విద్యాలయంలో వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డి.సూర్య ప్రకాశరావు ఆదేశాలతో వర్సిటీ 'సెంటర్‌ ఫర్‌ ఉమన్‌ అండ్‌ చైల్డ్‌ లా' ఆధ్వర్యాన మేగాద్రిగెడ్డ అంబేద్కర్‌ గురుకులం స్కూల్‌, జూనియర్‌ కాలేజీ విద్యార్థినులకు బాలల హక్కులు, చట్టాలు, మహిళా చట్టాలపై మంగళవారం అవగాహన కల్పించారు. 'తెలుసుకోండి లా' అనే శీర్షికన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు అనేక రకాలైన హింసలకు గురి అవుతున్నారని, చట్టాల పట్ల సరైన అవగాహన లేక రక్షణ పొందలేకపోతున్నారని తెలిపారు. బాల్య వివాహాలు వలన జరిగే అనర్థాలను తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం బాల్య వివాహ నిరోధక చట్టం 2006 రూపొందించి చిన్నారుల భవిష్యత్తు కాపాడే దిశగా అమలు చేస్తుందని తెలిపారు. దేశం ప్రధానంగా ఎదుర్కొంటున్న వరకట్నం సమస్య అని, 1961లో రూపొందించిన వరకట్న నిషేధ చట్టాన్ని ఉపయోగించి మహిళలు తమను తాము రక్షించు కావాలని సూచించారు. చట్టాలు సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ఫ్యాకల్టీ చైర్‌పర్సన్‌ ప్రొఫెసర్‌ ఎస్‌.విజయ లక్ష్మి, ఫ్యాకల్టీ మెంబర్‌ డాక్టర్‌ ఎన్‌.భాగ్యలక్ష్మి, విద్యార్థి విభాగం సభ్యులు, గురుకులం ప్రిన్సిపాల్‌ పాల్గొన్నారు.