కడప : రాష్ట్ర ప్రభుత్వం హక్కుదారులకు స్వేచ్ఛయుత సంపూర్ణ భూహక్కును కల్పించడంతో పాటు కొత్తగా వేలాది ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయడం అభినందనీయమని జెసి జి. గణేష్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో బహిరంగ సభ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళితులకు శ్మశాన వాటికలతో పాటు ఇతర పేదలకు భూముల కేటాయింపు పత్రాల్ని పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా జేసీ గణేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్ హాజరయ్యారు. ముఖ్యమంత్రి కార్యక్రమం ముగిసిన అనంతరం జెసి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించి కొత్తగా 1,818 మంది పేదలకు 2683.65 ఎకరాల అసైన్డ్ భూముల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. 138 గ్రామల పరిధిలో దళితుల శ్మశాన వాటికలకు 95.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. జగనన్న దళిత సంపూర్ణ భూ హక్కు పథకం ద్వారా ల్యాండ్ పర్చేజ్ స్కీం కింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 1910.54 ఎకరాల భూములపై 1,738 మందికి సర్వ హక్కులు కల్పిస్తూ వారి రుణాలు కూడా మాఫీ చేసిందన్నారు. దేశంలోనే తొలిసారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో వైఎస్‌ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. వందేళ్ల తర్వాత జగనన్న భూ హక్కు పథకం ద్వారా చేపట్టిన భూముల రీ సర్వే ద్వారా జిల్లాలో రెవెన్యూ గ్రామాలకు గాను ఇప్పటి వరకు రెండు విడతల్లో అన్ని డివిజన్ల పరిధిలో 49,701 మందికి సంబంధించి రీసర్వే పూర్తి చేశారన్నారు. అన్ని భూ వివాదాల జిల్లాలో 99.98 శాతం పరిష్కారం చేసి గ్రామాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు. 20 ఏళ్లు పైబడ్డ అసైన్డ్ భూములను, గ్రామ సర్వీసు ఇనామ్ భూములను, ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన భూములను సెక్షన్ 22-ఏ నుంచి తొలగించి ఈ భూములను సర్వ హక్కులతో క్రయ విక్రయాలకు, రుణాలు పొందడానికి, తనఖా పెట్టుకోవడానికి, బహుమతిగా ఇవ్వడానికి, వారసత్వపు ఆస్తిగా అందించడానికి, సొంత ఆస్తిగా అనుభవించేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎస్‌సి కార్పొరేషన్ ఇడి డాక్టర్ హెచ్ వెంకట సుబ్బయ్య, ల్యాండ్స్ సర్వే అధికారులు, రెవెన్యూ అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు.