ప్రజాశక్తి -సీలేరు
సంఘ విద్రోహశక్తులకు, గంజాయి సాగు, రవాణాకు గిరిజనులు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పి తుహిన్ సిన్హా హితవుపలికారు. గిరిజన గ్రామాల అభివృద్ధిపై పోలీసు వ్యవస్థ దష్టి సారించించినట్లు చెప్పారు. జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ పరిధి మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కొమ్ములు వాడ, బంద వీధి, కొత్త పాకల, గొర్రె లోవ తదితర గ్రామాల్లో సోమవారం ఎస్ఐ విస్తృతంగా పర్యటించారు. గొర్రెలోవలో అమృత జలధార మంచినీటి ట్యాంకు, మంచినీటి కొళాయిలు ప్రారంభించారు. గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సంఘ విద్రోహశక్తులతో చేతులు కలిపాన, గంజాయి సాగు చేసినా తమకు సమాచారం వెంటనే చేరవేయాలని కోరారు. యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడానికి పోలీసులు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. గంజాయి పంటలకు ప్రత్యామ్నాయంగా జీడి మామిడి, రాజ్మా, మినుము తదితర పంటలు పండించే విధంగా విత్తనాలు సరఫరా చేసినట్లు గుర్తు చేశారు. ఇటీవల చింతపల్లి అడిషనల్ ఎస్పి శివ ప్రతాప్ కిషోర్ ఆధ్వర్యంలో సదరన్ క్యాంపు నిర్వహించి జీకే వీధి, చింతపల్లి మండలాల పరిధిలో సుమారు 1000 మందికి వికలాంగ పింఛన్లు, బస్సు పాసులు వచ్చే విధంగా పోలీసులు చొరవ చూపినట్లు తెలిపారు. ఇప్పటికీ గొర్రెలోవలో కొంతమంది వికలాంగులు ఉన్నారని, వారికి కూడా సదరం సర్టిఫికెట్లు వచ్చే విధంగా కషి చేస్తామన్నారు. యువతకి ఇప్పటికే నర్సింగ్, టాటా ఎలక్ట్రికల్ ఉద్యోగాలు పోలీస్ల ద్వారా ఇప్పించడం జరిగిందని గుర్తు చేశారు. ముందు ముందు గ్రామాలు ఇంకా అభివృద్ధి చెందాలంటే యువత మావోయిస్టులకు ఆకర్షణలు కాకూడదని హితవుపలికారు. అనంతరం గిరిజన యువ క్రీడాకారులతో కలిసి ఎస్పి, చింతపల్లి అడిషనల్ ఎస్పీ వాలీబాల్ ఆడారు. క్రీడాకారులకు ఉచితంగా వాలీబాల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం మావోయిస్టు నేత జగన్ కుటుంబ సభ్యులకు ఎస్పీ రూ.5000 ఆర్థిక సహాయం అందజేశారు. జగన్ బంధువులు స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజనులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించారు.
సిఐ, ఎస్ఐలకు ప్రశంస
మారుమూల గిరిజన గ్రామాల్లో సమస్యలపై నిరంతరం అన్వేషిస్తూ విధి నిర్వహణ చక్కగా నిర్వర్తిస్తున్నారని జీకే వీధి సీఐ అశోక్ కుమార్, ఎస్ఐ అప్పలసూరి, సీలేరు ఎస్సై రామకష్ణలను ఎస్పీ, అడిషనల్ ఎస్పీ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ సుందరం, దుప్పులవాడ సర్పంచ్ కె.కుమారి, సిపిఐ మండల నాయకులు సుంకర విష్ణుమూర్తి, గిరిజనులు, యువ క్రీడాకారులు పాల్గొన్నారు.