
ప్రజాశక్తి - హెల్త్ యూనివర్సిటీ : వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా అను ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్ వారు ఓ మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పక్షవాతంగా పిలువబడే బ్రెయిన్ స్ట్రోక్ బారినపడినవారికి తక్షణ వైద్య సేవలందించేందుకు గానూ... ప్రత్యేక హెల్ప్‌లైన్ 9542108108 నెంబరుతో పాటు, స్ట్రోక్ కేర్ ఆన్ వీల్స్ పేరుతో పక్షవాత చికిత్సా వాహనాన్ని ఆవిష్కరించారు. ఈ స్ట్రోక్ హెల్ప్‌లైన్ సేవలను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది ఆదివారం ప్రారంభించారు. ఎనికేపాడులోని అను ఇనిస్టిట్యూట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మల్లాది విష్ణు మాట్లాడుతూ, స్ట్రోక్ కారణంగా అనేక మంది శాశ్వత అంగవైకల్యానికి గురై, వారి కుటుంబాలు ఛిద్రమవుతున్నాయని తెలిపారు.. స్ట్రోక్ బారినపడినవారికి సత్వర చికిత్స అందించడం కోసం హెల్ప్ లైన్ సేవలను అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలకు తోడు, అను గ్రూప్ వంటి ప్రతిష్టాత్మక వైద్య సంస్థలు చేపడుతున్న హెల్ప్ లైన్ వంటి కార్యక్రమాలు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని త్వరలోనే నెరవేరేలా చేస్తాయని అన్నారు. అను ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్ట్రోక్ హెల్ప్ లైన్ 9542108108 సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ జి.రమేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్లు డాక్టర్ విశ్వేశ్వరరావు, డాక్టర్ దుర్గానాగరాజు, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రవికుమార్, న్యూరో సర్జన్ డాక్టర్ తీగల రమేష్, న్యూరాలజిస్ట్ డాక్టర్ సౌమ్య మేదరమెట్ల, న్యూరో సర్జన్ డాక్టర్ సాయికష్ణ, ఇంటర్వెన్షనల్ న్యూరాలజిస్ట్ డాక్టర్ సయ్యద్ జాఫర్ పాల్గొన్నారు.