Oct 27,2023 22:40

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఎస్‌జిఎఫ్‌ఐ) ఆదేశాల మేరకు స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ కష్ణాజిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రూరల్‌ మండలం నున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అండర్‌ - 19 బాలుర, బాలికల సైక్లింగ్‌, రెజ్లింగ్‌ జిల్లా జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. సైక్లింగ్‌ సెలెక్షన్స్‌ను వికాస్‌ విద్యాసంస్థల వద్ద వికాస్‌ గ్రూపు ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి శ్రీనివాస్‌ ప్రారంభించారు. వికాస్‌ కాలేజీ గేటు నుంచి ఇండ్లాస్‌ శాంతివన్‌ వరకు సైక్లింగ్‌ పోటీలను నిర్వహించారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాల బాలికలను జిల్లా జట్లకు ఎంపిక చేశారు. అండర్‌ -19 బాలుర, బాలికల జట్లు వచ్చే నెల 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు బాపట్లలో జరగనున్న ఎస్‌జిఎఫ్‌ఐ అంతర్‌ జిల్లాల పోటీలలో పాల్గొననుంది. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ, ఇటీవల క్రీడలకు ఆదరణ విపరీతంగా పెరిగిందన్నారు. క్రీడలలో రాణించిన వారికి ఉన్నత విద్యా ప్రవేశాలతో పాటు ఉద్యోగావకాశాలు లభిస్తుండటంతో తల్లిదండ్రులు కూడా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దీనికితోడు జాతీయస్థాయిలో రాణించిన వారికి ప్రభుత్వం లక్షలాది రూపాయల నగదు ప్రోత్సాహాలను అందజేస్తుందని తెలిపారు. సైక్లింగ్‌ పోటీల నిర్వహణకు వికాస్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, వికాస్‌ గ్రూపు ఆఫ్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆఫీసర్లు శేఖర్‌ రెడ్డి ఫణి సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కష్ణాజిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె సుగుణరావు, అండర్‌ -19 సైక్లింగ్‌ ఎంపికల పరిశీలకురాలు శ్యామల, వ్యాయామ అధ్యాపకులు ఎంవి సత్యప్రసాద్‌, టి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
రెజ్లింగ్‌ పోటీలకు విశేష స్పందన
ఎస్‌జిఎఫ్‌ఐ ఆంధ్రప్రదేశ్‌ అంతర్‌ జిల్లాల అండర్‌-19 బాలుర, బాలికల విభాగాల రెజ్లింగ్‌ జిల్లా జట్ల ఎంపికలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది. జిల్లాలోని పలు పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులు రెజ్లింగ్‌ సెలెక్షన్స్‌కు హాజరయ్యారు. ఈ ఎంపికలను నున్న జడ్పీ హైస్కూల్‌ ఆడిటోరియంలో అండర్‌-19 విభాగం పరిశీలకురాలు శ్యామల ప్రారంభించారు. ఈ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జిల్లా జట్లకు ఎంపిక చేశారు. వచ్చే నెల 11, 12, 13 తేదీలలో నున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోనే అంతర్‌ జిల్లాల రెజ్లింగ్‌ పోటీలు జరగనున్నాయి.