
ప్రజాశక్తి-ఎడ్యుకేషన్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మేళవింపుతో రూపొందించిన స్మార్ట్ డిజిటల్ బోధనతో ఐటిఐ విద్యార్థులకు మరింత మెరుగైన శిక్షణ నైపుణ్యాలు సొంతమవుతాయని రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్ బి.నవ్య అన్నారు. స్థానిక ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో వీగార్డ్ ఇండిస్టీస్ లిమిటెడ్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద రూ.7.24 లక్షల ఖర్చుతో ఏర్పాటు చేసిన స్మార్ట్ తరగతి గదిని రాష్ట్ర ఉపాధి కల్పన శిక్షణ డైరెక్టర్ నవ్య కనెక్ట్ టు ఆంధ్ర సీఈవో కోట్ల శివశంకరరావు వీగార్డ్ ప్రతినిధులతో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ నవ్య మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజానంతో మేళవించిన ఈ డిజిటల్ తరగతి గదిలో విజువల్ ఎఫెక్ట్ ద్వారా అందించే పాఠ్యాంశాలు విద్యార్థులు కాన్సెప్టులపై పట్టు సాధించేందుకు, ప్రాక్టికల్ పరిజ్ఞానాన్ని సముపార్జించుకునేందుకు ఎంతో దోహదం చేస్తుందని వివరించారు. శివశంకరరావు మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ఐటీఐల్లో స్మార్ట్ తరగతి గదుల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. మొత్తం 83 ఐటీఐల్లోనూ స్మార్ట్‌గా విద్యార్థులు నైపుణ్యాలు సంపాదించేందుకు ప్రణాళికలను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీగార్డ్ ఇండిస్టీస్ లిమిటెడ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.కె.రాజేష్, మార్కెటింగ్ సీనియర్ అధికారి డి.రాజ్‌శేఖర్, ఎంప్లారుమెంట్ అండ్ ట్రైనింగ్ అడిషనల్ డైరెక్టర్ జి.మునివెంకట నారాయణ, జేడీ జి.బాలసుబ్రహ్మణ్యం, ఐటీఐ ప్రిన్సిపల్ ఎం.కనకారావు తదితరులు పాల్గొన్నారు.