- మనిషి మాటను బట్టి, రచయిత రచనా శైలిని బట్టి వారి పద్ధతి, నైజం అర్థమవుతుంది. సమాజంలో ఉండే మరకలు, మాసికలు, చిరుగులు, చింకిపాతలు పాలకులకు కనిపించకపోయినా రచయిత ఒక్కరే వాటిని స్పష్టంగా చూడగలరు. చూసిన అవకరాలను అద్దంలో ప్రతిబింబంలా చూపించి సరిదిద్దుకోమని హెచ్చరించనూగలరు. మానసిక చాంపల్యం చాపకింద నీరులా పాకిపోతోందని, సరిదిద్దుకోకపోతే అదే భస్మాసుర హస్తమవుతుందనే నీతిని నేతి అరిసెలంత తియ్యగానూ చెప్పగలరు. అలాంటి శక్తి, యుక్తులతో కూడిన ముక్తాయింపే ఇచ్చారు ఆదివారం కథలు పుస్తక రచయిత ఎన్. చంద్రశేఖర్ 'ఆదివారం కథలు' అనే కథా సంపుటిలో.
సిరా చుక్కల సంస్కారయుత రచనకు తన (చందు) నడక, నడత.. వృత్తి, ప్రవృత్తి కలగలిపి తొలి కథలో ప్రవేశించారు రచయిత. మనిషికి ఉన్నదానితో తృప్తి పడాలని.. అర్థం లేని ఆశలకు పోకూడదని.. డబ్బే అన్నిటికీ మూలం కాదనీ.. సంపాదించిన దానిని అవసరాలకు ఖర్చు పెట్టడానికి బాధపడకూడదని.. పక్కవాడి ఉన్నతిని చూసి అసూయ పడకూడదని.. అలాంటివన్నీ పాటించగలిగిన మనిషి అందరికంటే ఉన్నతుడని చెప్పడంలో ఆయన ఔన్నత్యం ద్యోతకమవుతుంది.
అంతేకాదు మనం చేసిన సహాయాన్ని మరిచిపోవాలని.. ప్రతిఫలం ఆశించకూడదని, ఎవరి ద్వారా అయినా సహాయం పొందితే మాత్రం గుర్తుంచుకోవాలని.. వీలైతే ప్రతి సహాయం చేయాలని హృద్యంగా చెప్పే 'చందూ' కథ పాఠకునికి ఒక బహుమతిగా భావింపవచ్చు.
తన కింది ఉద్యోగి ఎదిగిపోతున్నాడు అని కించిత్తు అసూయకు లోనైన పై ఆఫీసరు విజయ కృష్ణ.. అతనికతనే 'చేతులెత్తి నమస్కారం చేయాలన్పిస్తుంది' అనిపించేలా ప్రవర్తించిన సుందరం పాత్ర.. పాత్రలకు ఉన్నతి, సుకుమారత్వం, సహాయంచేసే లక్షణాలే ఆభరణాలు అనిపించాయి సుందరం కథలో. స్నేహానికి ఫేస్వాల్యూ కంటే మనసు వాల్యూనే ఎక్కువని.. మనిషికి సుఖాల్లో కంటే కష్టాల్లోనే స్నేహంతో కూడిన సహాయం అవసరమని.. ఎదుటి మనిషి క్షేమాన్ని కాంక్షించే మనసు 'సుందరం' కథలోని హీరో పాత్రది.
డబ్బు సంపాదన సంతోషాన్ని, ధైర్యాన్ని ఇవ్వగలదేమో కానీ తృప్తినివ్వలేదు. ఎదుటి మనిషికి ఆనందాన్నివ్వడం.. కష్టాల్లో తోడుండటంలో ఉండే తృప్తి ఎంతో ఆనందాన్నిస్తుంది అని ఒక పాత్ర ద్వారా చెబుతారు రచయిత. అనుబంధంలోని తియ్యదనం.. అనురాగంలోని హాయి.. ఐకమత్యంలోని ధైర్యాన్ని 'పెద్దన్నయ్య' కథలోని పాత్రల ద్వారా పలికించిన ఘనత ఈ రచయిత సామాజిక బాధ్యతను కళ్ళకు కడుతుంది.
పదివేలు అప్పుగా తీసుకున్న రామయ్య అది తీర్చాలని తపన పడుతుంటే.. పాతికేళ్లు పెంచి పెద్దచేసిన పిల్లలు మాత్రం తండ్రి బాధ్యతను విస్మరించి, ఒంటరిగా తల్లిని వదిలి వారి స్వార్థం వారు చూసుకున్నారు 'పిత్రార్జితం' అనే కథలో. రచయిత చెప్పిన తీరు ప్రస్తుతం ఉన్నత కుటుంబాలుగా చెలామణి అవుతూ.. బయటికి తెలిస్తే బాగుండదని భావిస్తూ.. అనేక ఇబ్బందులకు గురి అవుతున్న కొందరి పరిస్థితికి అద్దం పడుతోంది. 'గుడ్నెస్ ఈజ్ ద ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ విచ్ నెవర్ ఫెయిల్స్ టు ఎర్న్ డివిడెండ్స్' అని చెబుతూనే పెంచారు ఆ తండ్రి. కానీ పరిస్థితుల ఊబిలో కూరుకుపోయిన పిల్లలు మానత్వపు విలువల్ని మరిచారు. అయినా ఆ పిల్లలకు కనువిప్పు కలిగించి కథను సుఖాంతం చేయడంలో రచయిత మనుషుల్లో ఆశాజనక మార్పును కోరుకుంటున్న వైనం కనబడుతోంది.
అనవసరమైన ఆలోచనలు తీరని నష్టాన్ని కలిగిస్తాయి. కళ్ళకు కామం కమ్ముకుంటే మంచితనం.. అమాయకత్వం కూడా వక్రంగానే కనిపిస్తాయని 'దృష్టి' అనే కథలో రచయిత సామాజిక దృష్టి కోణాన్ని చూడవచ్చు. 'ఆడపిల్లకు ఆశలు మాత్రమే కాదు ఆశయాలూ ఉండాల'ని చెప్పటానికి ఆడపిల్ల భవిష్యత్తుపై రచయితకున్న కన్సర్న్ అభినందనీయం. అలాగే స్వాతిముత్యం, నీరాజనం, తల్లిదీవెన, బాలు, శుభసంకల్పం, ఆశయాల పల్లకిలో కథలలోనూ ఎంతో సామాజిక బాధ్యత కనిపిస్తుంది.
మరి ఇలాంటి కథలు చదివి మనమూ మనవంతు బాధ్యతను సమాజానికి అందిద్దాం. మంచి మనసులను ఆహ్వానిద్దాం.
ఆదివారం కథలు
రచయిత : సి. ఎన్. చంద్రశేఖర్
పేజీలు : 138
వెల : 180 రూ.
ప్రతులకు : అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాల్లో
ఫోన్ నెం : 94900 50214
- టాన్య, 70958 58888