
హరిత ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు. మొక్కలు శరవేగంగా ఖండాంతరాలు దాటుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల మనం అనేక విదేశీ మొక్కలను చూస్తున్నాం. ఫౌంటెన్‌ను తలపించేవి, సన్నని దారాల్లాంటి ఆకులను కలిగినవి, పోనీటెయిల్‌లా కనిపించేవి ఇలా అనేక వింత రకాల మొక్కలు మనం చూడవచ్చు. ఇలా అబ్బురపరిచే కొన్ని అద్భుత మొక్కలను ఈ వారం తెలుసుకుందాం..
- విక్టోరియా క్రుజియానా..
భోజనం చేసే ప్లేట్ ఆకారంలో పెద్దపెద్ద ఆకులు, కలువల్లాంటి పెద్ద పెద్ద పూలతో అలరించే నీటిమొక్క విక్టోరియా క్రుజియానా. దక్షిణ అమెరికాకు చెందిన ఇది నింపియేసి కుటుంబానికి చెందినది. నీటిమడుగుల్లో దుంపలుగా పెరుగుతుంది. 100 నుంచి 150 సెంటీమీటర్లు ఉన్న గుండ్రని పళ్ళాల్లాంటి ఆకులు, వాటికి ముళ్లలాంటి రక్షక తంత్రాలు ఉండి, నీటిలో తేలడానికి ఉపయోగపడతాయి. పది కేజీల వరకూ బరువును మోయగలగటం ఈ ఆకుల ప్రత్యేకత. దీని పువ్వులు కలువ పువ్వుల కంటే పెద్దగా ఉండి, ఇవి కూడా రాత్రిపూట వికసించి, పగలు ముడుచుకుంటాయి. తెల్లటి పూవు, మధ్యలో ముదురు ఎరుపు రంగు కలబోతతో ఉంటాయి. వీటిని జైంట్ వాటర్‌లిల్లీ అని కూడా పిలుస్తారు.
- బ్యూకార్నియా రికర్వాటా..

ఆకులు గట్టిగా, పొడవుగా వెనుకవైపుకు తిరిగి ఉంటాయి. దీని నిర్మాణాన్ని బట్టి పోనీటెయిల్ పామ్ అని కూడా పిలుస్తారు. ఇది ఆస్పరాగేసి కుటుంబానికి చెందినది. తూర్పు మెక్సికోకు చెందినది. ప్రపంచవ్యాప్తంగా అలంకరణకు పెంచుకుంటారు. మొక్క చూడ్డానికి ప్లాస్టిక్ వస్తువులా కనిపిస్తుంది. వారానికి ఒకసారి నీటిని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది పూర్తి అవుట్డోర్ మొక్క.
- బుర్లే-మార్క్సీ..

ప్రత్యేకమైన ఆకారాన్ని కలిగి, రెడీమేడ్ ప్లాస్టిక్ ఆకుల్లా కనిపిస్తాయి. కుండీల్లో బాగా పెరుగుతుంది. అమెజాన్ అడవుల్లో కనిపించే మొక్క ఇది. అరికేసియా కుటుంబానికి చెందినది. అలంకరణ కోసం ఎక్కువగా పెంచుకుంటారు. పిలోడెండ్రాన్ మొక్కల్లో వంద రకాలున్నాయి.
- వెరిగేటా..

ఫిలో డెండ్రాన్ల్లో మరో అద్భుతమైన రకం ఫిల్లోడెండ్రాన్ వెరిగేటా. ఆకుపచ్చ, పసుపు రంగుల కలబోతతో ఉంటాయి ఆకులు. ఇది ఇండోర్ మొక్క. కొబ్బరి పొట్టు మిశ్రమంలో మొక్క బాగా పెరుగుతుంది. నెలకోసారి మొక్కకు నీటిని స్ప్రే చేస్తే సరిపోతుంది. ఇది బ్రెజిల్‌కి చెందిన మొక్క.
- సైకస్ రెవెల్యూట..

సన్నని దారాల్లాంటి ఆకులు వెనుకవైపు వంగి ఉండి, అందమైన రకం సైకస్ రెవెల్యూట. మొక్క ఆకులు ఫౌంటెన్‌ను పోలి ఉండడం వల్ల దీన్ని సైకస్ పాంటీనా అని కూడా అంటారు. తక్కువ నీటి సహాయంతోనే పెరుగుతుంది. ఆకులు రెండు, మూడేళ్ల వరకు పెరుగుతూనే ఉంటాయి. ఇది పూర్తి అవుట్ డోర్ మొక్క.
- క్లెయిస్టో కాక్టస్ వింటరీ..

ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ ప్లాంట్‌గా ప్రసిద్ధి పొందిన కాక్టస్ మొక్క ఇది. ఇది మెదడు ఆకారాన్ని పోలి ఉంటుంది. కొన్ని సంవత్సరాలకు మొక్క మధ్యలో నుంచి ఒక దూట పెరిగి, పువ్వు పూస్తుంది. బుడిపెల్లాంటి ముళ్ళతో పనస పండు పైభాగాన్ని తలపిస్తుంది. కుండీల్లోనూ పెరుగుతుంది.
- అలో పాలీఫిల్లా..

రంపపు బ్లేడు లాంటి ఆకులతో, మొదలు నుంచి పొట్లం చుట్టినట్లుగా ఆకారం కలిగిన మొక్క అలో పాలీఫిల్లా. నిజానికి ఇది కలబంద రకానికి చెందినది. ఆకులు, చుట్టూ ఉండే ముళ్ళు కూడా ఈ మొక్కకు అందమే. నీటి అవసరం తక్కువ. ఇసుక నేలలు, రాతి నేలలు, ఎర్ర మట్టి నేలలు అన్నీ అనుకూలమే. కొబ్బరి పొట్టు మిశ్రమంలోనూ పెరుగుతాయి.స్పైరల్ కలబంద, క్రూనాల్విన్ అనే పేర్లతో వీటిని పిలుస్తారు. ఆఫ్ఘనిస్తాన్ దీని పుట్టుక స్థలం. మూడేళ్లు పెరిగిన తర్వాత మధ్యలో నుంచి దూట బయలుదేరి, దానికి పువ్వులు పూస్తాయి. ఇది సక్లేంటి జాతికి చెందినది.
చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506