
మన చుట్టూ ఉండే అనేకమంది జీవితాలపైనా, మనుషులపైనా సునిశితమైన పరిశీలనా దృష్టి ఎంతో అవసరం. అలాంటి పరిశీలనా దృష్టి కలిగిన వ్యక్తే నాగేంద్ర కాశి అనిపించింది. ఎక్కవగా ఆయన రచనల్లో జీవితం చేసిన గాయాలతో సతమతమవుతూ, సామాన్య జీవితంలో నవ్వుతూ గడిపే బరువైన జీవితాలు కనిపిస్తాయి. అనేక సందర్భాల్లో తోటి మనుషుల జీవితాలపై ఆయనకున్న ఆర్తి ఏపాటిదో ఈ కథల్లో అర్థం చేసుకోవచ్చు. 'సుకుమార్ రైటింగ్స్' టీంలో భాగం కావడం, ఆయన రాసిన పన్నెండు కథల సమాహారాన్ని 'నల్ల వంతెన' సంకలనంగా తీసుకొచ్చిన తీరు తెలుగు సాహిత్యానికి కొత్త ఊపిరిలా అనిపిస్తుంది.
ఇక రచనల్లోకి వెళ్తే.. తొలి వాక్యంతోనే తిన్నగా కథల్లోకి తీసుకెళ్లిన తీరు సింపుల్‌గా చెప్పినట్టే అనిపించినా.. పాఠకుడిని ఎక్కడా తొట్రుపాటు చెందకుండా చాలా పక్కాగా కథలోని క్యారెక్టర్లలో ఇరికించినట్లు అనిపిస్తుంది. కథలోకి వెళ్తున్న కొద్దీ మధ్యలో ఎక్కడా ఎడిట్ చేయడానికి వీల్లేకుండా ఊపిరి సలపనీయకుండా ఉచ్చు బిగించినట్లు అనిపిస్తుంది. కథలోకి పాత్రలు జీవచ్ఛవాల్లా కళ్లు తెరిచి, మనల్ని చూస్తున్నట్లు అనిపిస్తుంది. తోటి మనుషుల నిత్య జీవన విధ్వంస దృశ్యాలు మన మనసుల్లో గూడుకట్టుకుపోతాయి. 'నల్ల వంతెన'లో మొదటి కథ.. కొయిటా అబ్బులు, ఆఖరి కథ.. ఎడారి ఖర్జూరం. ఉభయగోదావరి జిల్లాల్లో పొలం పనుల వల్ల పొట్ట గడవక, ఉపాధి లేక బతుకు భారమై, పరాయి దేశాలకు పనిమనుషులుగా కువైట్ వెళ్లే ఆడవాళ్ల జీవితాలివి. పెద్దగా చదువుకోని సెమీ లిటరేట్స్. గొప్పగా బతకాలి, అందుకోసం డబ్బు సంపాదించాలన్న ఆశతో కువైట్ వెళతారు. అలాంటి ఆడవాళ్ల భర్త, పిల్లలూ, తల్లీ తండ్రీ, బంధువులూ డబ్బు కోసమే వాళ్లని గౌరవిస్తారు. ఆపేక్షలూ, ప్రేమతో అల్లుకుపోవడాలూ వుండవు. కేవలం డబ్బు సంపాదించే యంత్రాల మాదిరి.
కొయిటా అబ్బులు కథలో మన కళ్లకు ఇదే కనిపిస్తుంది. లేచిపోయిందో, చచ్చిపోయిందో అనుకున్న భార్య సౌదామిని చాలా ఏళ్ల తర్వాత ఇంటికి వచ్చిందని భర్త అబ్బులుకి తెలుస్తుంది. ఆ బాధ భరించలేనిది. ఇంటికి వెళ్తున్న అబ్బులుకి 'ఇల్లు ఇంకాస్త దూరమైతే బావుండు' అనుకుంటాడు. అలా అబ్బులు భయాన్నీ, సందిగ్ధాన్నీ ఎంతో సహజంగా బరువెక్కిన హృదయంతో చెప్పగలిగాడు రచయిత కాశి.
ఇక ఎడారి ఖర్జూరం కథలో కువైట్ నుంచి సొంత ఊరికొచ్చిన అమ్మాజీ తిరిగి వెళ్లకూడదని గట్టిగా అనుకుంటుంది. అయితే డబ్బు సంపాదనే ముఖ్యం గనుక మళ్లీ కువైట్ ఫ్లైట్ ఎక్కక తప్పదు. అలా రెండుచోట్లా సౌదామిని కొడుకును, అమ్మాజీ భర్తనీ కోల్పోతారు. కుటుంబసభ్యుల సంతోషం కోసం.. డబ్బు సంపాదన కోసం.. వాళ్లది కాని జీవితాన్ని గడుపుతూ కన్నీటి రాతలుగా మిగిలిపోతారు. ఇలాంటి కథలు మన చుట్టూ ఉన్నప్పటికీ ఆ పరిశీలన మనలో లేకపోవడం వల్లే మనకు వారి బరువైన హృదయాలను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఆ పరిశీలనున్న రచయితని మెచ్చుకోవాలి.
నాకు తెలిసి ఇలాంటి కథలెన్నో.. పిల్లల బాగోగుల కోసం.. కుటుంబ అవసరాల కోసం.. ఇలా వేరే దేశాల్లో పనికి వెళ్లిన మహిళలు ఎందరో.. అలాంటివారి జీవితాలు చెప్పుకోడానికీ, చూడ్డానికీ ఎంతో గొప్పగా ఉన్నప్పటికీ.. వాళ్లు పడుతున్న బాధలు, వేదనలు ఎవరికీ మచ్చుకైనా కనిపించవు. తల్లిదండ్రులకు, కన్నవారికి, కట్టుకున్నవారికీ.. ఇలా అందరికీ దూరమై ప్రేమాభిమానాలకు దూరంగా యాంత్రిక జీవనం గడుపుతుంటారు. అలాంటి కథలు మనం చూశాం.. విన్నాం.. 'నల్ల వంతెన' కథలు చదివే క్రమంలో అలా.. మనకు తెలిసిన కొన్ని పాత్రలు మన కళ్ల ముందుకు వస్తాయి.
కోనసీమ, ముమ్మిడివరం పరిసర ప్రాంతాల్లోని పల్లెల్లో వందల ఎకరాల్లో కొబ్బరితోటలు, పచ్చని వరి పైరు, కూరగాయల పాదులు, ఎటు చూసినా చెరువులు, కాలువలు, సిరులు పండే పంట భూములు.. ఆ పక్కనే దుర్భరమైన పేదరికాన్ని అనుభవిస్తూ చితికిపోతున్న వ్యవసాయ కూలీల బతుకుల్ని.. మరపురాని కథలుగా మలచి, డాక్యుమెంట్లుగా మనముందు పరిచాడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం వాస్తవ్యుడైన రచయిత కాశి.
నీల, శిరీష, సత్యవేణి, శ్రీదేవి, భానుమతి.. పేరు ఏదైతేనేం, వేదన ఒక్కటే. ఎదిరించలేని, ఏమీచేయలేని సమిధలు కావడం మినహా ఏ దారీలేని నిస్సహాయులు. ఆడవాళ్లలో మీకు బాగా నచ్చే గుణం ఏమిటి? అని ఒక ఇంటర్వ్యూలో అడిగినపుడు, 'వాళ్ల నిస్సహాయత' అని చెప్తారు కారల్ మార్క్స్. అలాగే 'నల్ల వంతెన' కథల్లో స్త్రీల నిస్సహాయతని గుండె పగిలేలా కళ్ల ముందుంచాడు రచయిత కాశి. ఒకపక్క పొలం పనులు చేసుకునేవాళ్ల రోజువారీ బతుకుల్లోని దైన్యం, మరోపక్క చిన్న ఆశ కూడా నెరవేరని ఆడపిల్లల గుండెల్లో గూడుకట్టిన నిరాశ.. వెరసి మనకి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. ఆకాశమంతటి మానవజీవన విషాదాన్ని ఆరేడు పేజీల్లో ఇమిడ్చి చెప్పిన తీరుకి మనం మౌనంలో ఘనీభవించిపోతాం!
'ముచ్చెట్టు' కథలో పందుల్ని పెంచుకునే, ఈతబుట్టలు అల్లుకునే ఎంకన్న ఓ కుర్రాడితో, 'కానీ, మీరు వేరు, మేం వేరు కదరా, మాకంటే మీరు ఓ మెట్టు పైన' అంటాడు.
మరో కథలో 'ఈ దిక్కుమాలిన జీవితం దేనికీ ఎదురు తిరగడం నేర్పలేదు. మట్టి గురించి తప్ప, మనుషుల గురించి నేర్పలేదు' అనుకుంటాడో వ్యవసాయ కూలీ!
మరో కథలో 'మీ చేలల్లో, తోటల్లో పనిచేసేదానికి.... కావాలి. అప్పుడు నీకు కులం గుర్తు రాలేదా అని అడిగారు మావాళ్లు' అంటాడు, అంతే.. ఎక్కడా కులాల పేర్లు రాయకుండా, ఎక్కువ తక్కువ అనే మాటల్తోనే కథల్ని ఎంతో నేర్పుగా నడిపించారు రచయిత.. మొత్తానికి ఈ పుస్తకం చదివిన ప్రతి ఒక్కరికీ పన్నెండు కథలు చదివినట్లు కాక.. పన్నెండు మంది జీవితాలను మన కళ్ల ముందు చూసినట్లు అనిపిస్తుంది.
- ఉదయ తేజశ్విని
నల్ల వంతెన
రచన : నాగేంద్ర కాశి
పేజీలు : 165
వెల : 200