- అందరికీ ఒకేసారి కాదు
- అప్పుడు కొంత మందికి ఇప్పుడు కొంత మందికి
- బటన్ నొక్కుడు లాంఛనమే
- కేంద్ర వాటా ఎప్పుడో తెలీదు
- కౌలు రైతులు సందిగ్ధం
- ఇదీ కరువులో అన్నదాతలకు సాయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : రైతన్నలకు వ్యవసాయ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఇస్తామన్న రైతు భరోసా రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులందరికీ ఒకే రోజున బ్యాంకుల్లో జమ కాలేదు. ముఖ్యమంత్రి బటన్ నొక్కాక రోజుకు కొంత మందికి మాత్రమే పడుతున్నాయి. ఈ ఏడాది రెండవ విడత భరోసా సాయం విడుదల చేసేందుకు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మంగళవారంనాడు సిఎం బటన్ నొక్కి మీ బ్యాంక్ ఖాతాల్లో సొమ్ము పడింది చూసుకోమన్నారు. రైతన్నలు ఆశగా బ్యాంకులకు వెళ్లగా చాలా చోట్ల రైతులకు డబ్బు పడలేదని అధికారుల నుంచి జవాబు రావడంతో నిరాశతో ఇళ్లకు వెనుదిరిగిన ఉదంతాలు ఈ రెండు రోజుల్లో పలు జిల్లాల్లో చోటు చేసుకున్నాయి. గతంలో కూడా సిఎం బటన్ నొక్కాక వారం పది రోజుల వరకు లక్షల మంది రైతులకు భరోసా సొమ్ము జమ కాలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఒకేసారి ఏకమొత్తంలో పెట్టుబడి రైతుల చేతుల్లో పెడతామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, కేంద్ర పథకం పిఎం కిసాన్‌తో కలిపి అమలు చేయడం వలన ఒకేసారి కాకుండా సంవత్సరంలో మూడు విడతల్లో కొంత కొంత సొమ్ము వేస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా లబ్ధిదారులందరికీ ఒకేసారి కాకుండా కొందరికి ఒక రోజు మరికొందరికి మరో రోజు చొప్పున దశలు దశలుగా పడుతుండటంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కరువు నెలకొంది. లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాలేదు. వేసిన పంటలు ఎండిపోయాయి. దిగుబడుల్లో భారీ క్షీణత కనిపిస్తోంది. దుర్భిక్షం వలన పెట్టుబడులు, దిగుబడులు నష్టపోయిన రైతులు ప్రభుత్వం ఇచ్చే స్వల్ప 'భరోసా' కోసం ఎదురు చూస్తున్నారు. రబీ పంటలేసుకోడానికి కొంతైనా ఆసరా అవుతుందని ఆశపడుతుండగా, రైతులందరికీ భరోసా పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రోజుకు కొంత
వరసగా ఐదవ ఏడాది... ఈ ఏడాదిలో రెండవ కిస్తు భరోసా 53.53 లక్షల మంది రైతులకు రూ.4 వేల చొప్పున రూ.3,923 కోట్లు విడుదల చేశామని సర్కారు తెలిపింది. సిఎం బటన్ నొక్కినప్పటికీ రెండు రోజుల్లో అంత మందికీ సొమ్ము పడలేదు. అధికారులనడిగితే ఆధార్, ఫోన్ లింకులు, ఇత్యాది సాంకేతిక కారణాల వలన పడి ఉండకపోవచ్చని సర్ది చెబుతున్నారు. కానీ వాస్తవం వేరేలా ఉంది. ఖజానాలో నిధుల లభ్యతకనుగుణంగా ఏ పూటకాపూట బిల్లుల విడుదలకు సెంటర్ మేనేజ్‌మెంట్ ఫైనాన్షియల్ సిస్టం (సిఎంఎఫ్‌ఎస్) పని చేస్తోంది. సిఎం బటన్ నొక్కినా అక్కడ అనుమతిస్తేనే అప్పటికి నిధులు విడుదలవుతాయి. బటన్ నొక్కినప్పటికీ అన్ని నిధులూ ఒకే సారి కాకుండా అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం విడుదలవుతుండటంతో లబ్ధిదారులందరికీ ఒకేసారి కాకుండా దశలు దశలుగా కొన్ని రోజుల్లో జమవుతున్నాయి.
ప్రస్తుతానికి రెండు వేలే...
సొంత భూమి సాగు చేసుకునే రైతులకు భరోసా రెండవ కిస్తు రూ.4 వేలు ఇవ్వాల్సి ఉంటే, వాటిలో రెండు వేలు కేంద్రం, రెండు వేలు రాష్ట్రం ఇవ్వాలి. కేంద్ర పిఎం కిసాన్ కిస్తు రూ.2 వేలపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. అక్టోబర్‌లోఅన్నారు. ఇప్పుడు దీపావళికికానీ, లేదంటే మిగతా 5లో ఈ నెలాఖరుకు పడతాయని అంచనా వేస్తున్నారు. ఏతావాతా ప్రస్తుతానికి రైతులకు రాష్ట్రం ఇచ్చే రెండు వేలే దిక్కు. అవి కూడా రోజుకు కొంత మందికే పడుతున్నాయి.
కౌల్దార్లపై స్పష్టత లేదు
కౌలు రైతులందరికీ పూర్తి స్థాయిలో భరోసా అని ప్రభుత్వం పేర్కొనగా, కేంద్రం కౌలు రైతులకు అసలు సాయం ఇవ్వట్లేదు. దాంతో రాష్ట్ర సర్కారే రూ.13,500 సాయాన్నీ ఇస్తోంది. సొంత భూమి సాగు చేసుకునే యజమానులకు మల్లే వారికీ ఏడాదిలో మూడు కిస్తుల్లో వేస్తోంది. అయితే యజమానులతో పాటు ఇవ్వట్లేదు. ఈ సంవత్సరం జూన్ 1న ఈ ఏడాది తొలి కిస్తు యజమానులకు ఇవ్వగా మూడు మాసాలు ఆలస్యంగా సెప్టెంబర్ 1న చాలా స్వల్ప సంఖ్యలో కౌలు రైతులకు మొదటి కిస్తు జమ చేశారు. ఇప్పుడు కౌలు రైతులకు కూడా వేసారా లేదా అన్న విషయంపై ఎక్కడా స్పష్టత లేదు. కౌలు రైతులకు, అటవీ హక్కుల చట్టం కింద నమోదైన వారికి, దేవాదాయ భూములు సాగు చేసుకునే వారికి రాష్ట్రం రూ.4 వేలు చొప్పున వేయాలి. వారికి కూడా కొన్ని దశల్లో అప్పుడు కొంత మందికి అప్పుడు కొంత మందికి వేస్తారని తెలుస్తోంది.