ఈ ఉరుకుల పరుగుల నగరాలకు దూరంగా అభివృద్ధి అంతగా లేని ఒక ఊరు.. జగన్నాథపురం. జనావాసాల మధ్య ఆత్మీయానుబంధాలు అప్పుడప్పుడే కనుమరుగవుతూ, నూతన పోకడలకు అలవాటుపడుతున్నారు ఆ ఊరి జనాలు. అలాంటి ఊరిలో ఉన్న ప్రాథమిక పాఠశాలకు తెలుగు టీచరుగా బదిలీ మీద వచ్చారు రఘురామయ్య తన కుటుంబసభ్యులతో. ఆయన భార్య పేరు రమాదేవి. వీరింట్లో చిచ్చర పిడుగులాంటి బుడతడు రాము. తను అల్లరివాడే కానీ, అంత లేత వయసులో కూడా ఇంట్లోని పెద్దలు నేర్పిన క్రమశిక్షణ వల్ల లౌక్యం, పరోపకార బుద్ధి ఏర్పడ్డాయి. బడికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అల్లరి చేసేవాడు రాము.
అదే ఊరిలో లాసయ్య అనే ఒక వృద్ధుడు ఉండేవాడు. అతను రిక్షా లాగుతూ జీవనం సాగించేవాడు. రాము బడికి వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడల్లా లాసయ్యను సరదాగా ఆట పటిస్తూ, ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా లాసయ్యకు, రాముకు ఒక బంధం ఏర్పడింది. ఒకరోజు ఎక్కువ సరుకులు ఉండడంతో తన రిక్షా లాగలేకపోతున్న లాసయ్యను చూసిన రాము చిన్నవాడైనప్పటికినీ తన శక్తిని అంతా కూడగట్టుకుని రిక్షా తోయడంలో లాసయ్యకు తన సహాయాన్ని అందించాడు. ఆ సరుకులతో రిక్షాను లాగిన లాసయ్యకు విపరీతమైన జ్వరం రావడంతో మంచం పట్టాడు. దానితో అతను రిక్షాను వేయలేని పరిస్థితిలో రాము అతని ఇంటికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితిని చూసి ఏమి చేయాలో అర్థం కాలేదు. వెంటనే ఇంటికి వెళ్ళి తను చూసిన విషయాన్ని అమ్మకు చెప్పాడు. ఈ విషయం విన్న రమాదేవి గారు వెంటనే స్పందించి, వేడివేడిగా చపాతీలు చేసి, పాలు కూడా రాముతో లాసయ్యకు పంపించారు. లాసయ్య ఇంటి నుంచి వచ్చిన రామును రమాదేవి ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని 'చూడు నాయనా! దేవుడు ఎక్కడో లేడు. మనం మన చుట్టుపక్కల ఉండేవారికి, ఆపదలో ఉన్నవారికి, ఆర్తితో ఉన్నవారికి అందించే సహాయంలోనే దేవుడు ఉన్నాడు. అందుకే 'మానవ సేవే మాధవ సేవ' అంటే నువ్వు మనుషులకు సేవ చేస్తే, దేవునికి సేవ చేసినట్లే అనేది పెద్దల మాట' అని రాముకి చెప్పారు.
ఇది విన్న రాము మళ్ళీ లాసయ్య ఇంటికి వెళ్ళి, అతని యోగక్షేమాలు కనుక్కొంటూ, లాసయ్య ఆరోగ్యం కుదుటపడే వరకూ తన చిట్టి చిట్టి చేతులతో ఎంతో సహాయాన్ని చేశాడు.
లాసయ్య వయసు పైబడడటంతో ఇక రిక్షా తొక్కలేడన్న విషయాన్ని అర్థంచేసుకున్న రాము వాళ్ల ఇంటి ముందు ఒక డబ్బా పెట్టి.. 'మీకు తోచిన సహాయం చేసి, లాసయ్యని ఆదుకోగలరు' అని బోర్డు పెట్టాడు.
అది గమనించిన ఆ ఊరి ప్రజలు ఒక్కొక్కరు అటుగా వెళ్లేటప్పుడో, వచ్చేటప్పుడో తమకు తోచిన సహాయాన్ని ఆ హుండీలో వేస్తుండేవారు. ఈ విధంగా వచ్చిన వాటిల్లో కొంత పండ్లు, ఆహారం, డబ్బులు ఉండేవి. వాటితో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండేవాడు లాసయ్య. ఇలా రోజులు గడస్తుండగా రామబంటు కాలేజీ స్థాయికి చేరుకున్నాడు. వేసవి సెలవులకు ఊరు వచ్చిన రాము లాసయ్య తన జీవితాన్ని ఆనందంగా గడపడాన్ని చూసి, ఎంతో ఆనందపడ్డాడు. మళ్ళీ కాలేజీ తెరవడంతో తిరిగి వెళ్తూ లాసయ్యకు జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. ఒకరికి సహాయం చేయడంలో ఎంతో తృప్తి ఉంటుందన్న సత్యాన్ని రాము అర్థం చేసుకొని, కాలేజీకి వెళ్లిపోయాడు.
హేమహాసిని
గురజాడ పబ్లిక్‌స్కూల్,
విజయనగరం.