కాంచీపురం అనే పల్లెటూరికి వెళ్లే దారిలో ఓ చెరువు గట్టు ఉండేది. ఆ చెరువు గట్టు పైన పక్క పక్కనే ఒక గడ్డి మొక్క ఒక గంధపు చెట్టు మొలిచాయి. మొదట్లో గంధపు మొక్క గడ్డి మొక్క చాలా స్నేహంగా ఉండేది. కొంతకాలానికి గంధపు మొక్క ఏపుగా పెరగసాగింది.. గడ్డి మొక్క అలాగే ఉండిపోయింది. గంధపు మొక్క తన పొడవు, లావును చూసి గర్వం నింపుకుంది. గడ్డి మొక్కను చులకన చేసి మాట్లాడేది. 'నీలాగా ఉండే వాళ్లంటే నాకు చాలా అసహ్యం. నువ్వు నా పక్కన ఉండడం వల్ల నా విలువ తగ్గిపోతుంది' అని పొగరుగా మాట్లాడేది. గాలి వీచినప్పుడు గాలివాటుగా గడ్డి మొక్క కదలడం చూసి మరింత హేళన చేసి నవ్వేది. గడ్డి మొక్క 'మిత్రమా మనకన్నా బలహీనుల దగ్గర మనం బలం ప్రదర్శించకూడదు కొండ అద్దంలో చిన్నదిగా కనిపించినంత మాత్రాన కొండ విలువ తగ్గిపోతుందా చెప్పు?' అంది. 'బలహీనులు చేతగాని వారు ఇలా సర్ది చెప్పుకుంటారని నాలాంటి వాళ్ళకు ఇలాంటి మాటలు వర్తించవని!' పెడసరంగా మాట్లాడింది గంధపు చెట్టు. 'ఇకమీదట ఇలాంటి నీతులు చెబితే సహించేది లేదని నీ స్థాయిలో నీవు ఉండు' అంటూ దురుసుగా మాట్లాడింది. గడ్డి మొక్క ఇక ఏం మాట్లాడలేక మౌనం వహించింది. ఆ మరుసటి రోజు పెద్ద గాలివాన వచ్చింది గంధపు మొక్క నిటారుగా గాలికి అడ్డుగా నిలబడింది.
గడ్డి మొక్క గాలివాటుగా వంగుతూ వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంది. గడ్డి మొక్కను చూసి మూతి తిప్పుకుంది గంధపు మొక్క. ఇంతలో బలమైన గాలి రావడంతో గంధపు చెట్టు విరిగి, గడ్డి మొక్క మీద పడింది. గడ్డి మొక్క మిత్రుని కష్టాన్ని చూసి బాధపడింది. 'బాధ పడకు నేస్తం మళ్లీ చిగురిస్తావు! మునుపటిలా అందంగా ఉంటావు!' అంటూ సముదాయించింది.
ఓదార్చుతున్న గడ్డి మొక్కను చూస్తూ తన గర్వమే తన ఈ పరిస్థితికి కారణమని విలపిస్తున్న గంధపు మొక్కను కాంచీపురం కట్టెల వ్యాపారి కొట్టుకుపోయాడు.
ఆ తర్వాత చిగురించిన గంధపు మొక్క గడ్డి మొక్కతో స్నేహంగా మసులుతోంది.
- సి.హేమలత
[email protected]