Jun 12,2022 14:25

ప్రపంచంలో రెండో అతిపెద్ద నదిగా అమెజాన్‌ పేరొందింది. దక్షిణ అమెరికాలోని దాదాపు తొమ్మిది రాష్ట్రాల గుండా ప్రవహిస్తున్న ఈ నది పొడవు 6400 కి.మీ. దాటి ఉంటుంది. దీనికి సంబంధించిన కొన్ని విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ నది దక్షిణ అమెరికాలో 40 శాతం మేర విస్తరించింది. ఈ నది బొలీవియా, బ్రెజిల్‌, పెరూ, కొలంబియా, ఈక్వెడార్‌, వెనిజులా, ఫ్రెంచ్‌ గయానా, గయానా, సురినామ్‌ దేశాల నుండి వెళుతుంది. అయినప్పటికీ ఈ నదిపై ఒక్క వంతెన కూడా ఎందుకు నిర్మించలేదు? కారణాలేంటి? తెలుసుకుందాం..!ల
సాధారణంగా కాలువలైనా.. నదులైనా.. వాటిపైన మనకు తెలిసి ఒక్క వంతెనైనా ఉంటుంది. ఉదాహరణకు మన దేశంలో ఎన్నో నదులున్నాయి. గోదావరి, కృష్ణ, గంగా, యమునా, కావేరీ, తుంగభద్ర.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా నదులు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇవి ప్రవహిస్తున్నాయి. అయితే ఈ నదులపై ఎక్కడో ఓచోట చిన్న వంతెనో.. బ్రిడ్జో ఉంటుంది. గట్టిగా చెప్పాలంటే ఒక్కటేమిటి.. చాలానే ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతి పొడవైన నదుల్లో ఒకటైన ఓ నదిపై మాత్రం.. అసలు ఒక్క బ్రిడ్జి కూడా లేదు. అది వేల కిలోమీటర్లు ప్రవహిస్తుంది. అనేక దేశాల మీదుగా ప్రవహిస్తుంది. కానీ దానిపై ఒక్కటంటే.. ఒక్క బ్రిడ్జి కూడా లేదు. అదే.. అమెజాన్‌ నది. చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నైలు నది తర్వాత.. ఇదే అతి పెద్దది. దీని పొడవు 6,400 వేల కి.మీ. కంటే ఎక్కువ. బ్రెజిల్‌, బొలీవియా, పెరూ, ఈక్వెడార్‌, కొలంబియా, వెనిజులా, గయానా, ఫ్రెంచ్‌ గయానా, సురినామ్‌ వంటి దేశాల మీదుగా ప్రవహిస్తుంది.
ప్రపంచంలోనే అతి పొడవైన నది నైలు నది కావచ్చు. కానీ మంచినీటి విషయంలో మాత్రం అమెజాన్‌ నదికి మాత్రం ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇందులో అనేక జలచరాలు నివసిస్తున్నాయి. డాల్ఫిన్లు, అనకొండలతో పాటు ఎన్నో రకాల నీటి ప్రాణులకు ఆవాసం. 100కుపై రకాల ఎలక్ట్రిక్‌ చేపలు, 60 రకాల ఫిరాన్హాలు ఆతిథ్యం పొందుతున్నాయి. ఇంకా గుర్తింపుకు నోచుకోని అనేక జాతులు, ఎన్నో వింతలు, విశేషాలకు నెలవుగా ఉన్న అమెజాన్‌ నదిపై మాత్రం ఒక్క బ్రిడ్జి కూడా లేదు. సాధారణంగా చిన్న చిన్న కాల్వలపైనే ఎన్నో బ్రిడ్జిలు మనకు కనిపిస్తుంటాయి. గ్రామాలను, నగరాలను కలుపుతుంటాయి. కానీ వేల కి.మీ. ప్రవహిస్తూ తొమ్మిది దేశాలను కలిపే.. ఈ నదిపై మాత్రం ఒక్క వంతెన కూడా లేకపోవడం వింతగా అనిపిస్తుంది. మరి దీనికి కారణమేంటి?
ఇప్పటి వరకూ ఆ అవసరం పడలేదు..
స్విస్‌ ఫెడరల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌ ఛైర్‌పర్సన్‌ వాల్టర్‌ కౌఫ్‌మన్‌ 'లైవ్‌ సైన్స్‌'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అమెజాన్‌ నది గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అమెజాన్‌ నదిపై వంతెనును నిర్మించాల్సిన అవసరం పడలేదని ఆయన చెప్పారు. అందుకే దానిపై బ్రిడ్జిలు లేవని పేర్కొన్నారు. సాధారణంగా నది ఇవతలి వైపు నుంచి అవతలి వైపునకు వెళ్లేందుకు వంతెనలు కడుతుంటారు. కానీ అమెజాన్‌ పరీవాహక ప్రాంతాలకు ప్రజలకు ఆ అవసరం ఇప్పటివరకూ పడలేదు.
వాస్తవానికి అమెజాన్‌ నది ఎక్కువగా జనాభా లేని ప్రాంతాల గుండానే ప్రవహిస్తుంది. ఇక జనాలు ఉండే ప్రాంతంలో ఫెర్రీలు, చిన్న చిన్న పడవలు తిరుగుతాయి. వాటి మీదుగా అవతలి ఒడ్డుకు చేరుకుంటాయి. అయితే అమెజాన్‌ బేసిన్‌లో అధిక జన సాంద్రత ఉన్న నగరాలు చాలానే ఉన్నాయి. అవి కూడా బాగా అభివృద్ధి చెందాయి. అయినప్పటికీ అక్కడ నగరాల్లో వంతెనలకు కనెక్ట్‌ చేయడానికి ప్రధాన రహదారులూ ఏమీ లేవు. అయితే ఆయా నగరాల ప్రజలు ఇవతలి నుంచి అవతలికి వెళ్లాలంటే మాత్రం ఫెర్రీలను, పడవలను వినియోగిస్తారు. కాబట్టి ఇక్కడ జల రవాణా సౌకర్యాలు స్థిరంగా ఉన్నాయి.
మరో కారణం.. ఇదే..!
అమెజాన్‌పై బ్రిడ్జిలు లేకపోవడానికి మరో ఆసక్తికరమైన కారణం కూడా ఉంది. వాల్ట్‌ కౌఫ్‌మన్‌ ప్రకారం.. ఈ నది ఒడ్డున మెత్తటి నేల ఉంటుంది. చిత్తడి నేలల కారణంగా అక్కడి ఒడ్డులు మృదువుగా ఉంటాయి. అలాంటి చోట వంతెన నిర్మించడానికి చాలా లోతైన పునాదులు నిర్మించాల్సిన అవసరం ఉంది. దీంతో చాలా ఖర్చవుతుంది.
భారీ స్థాయిలో ఖర్చు పెట్టి అక్కడ బ్రిడ్జిల నిర్మించాల్సిన అవసరం పడలేదు. ఒకవేళ నిర్మించాలనుకున్నా.. భారీ పెట్టుబడితో కూడుకున్న పని. పైగా కాలానుగుణంగా నదీ ప్రవాహాల్లో వ్యత్యాసాలకు ప్రభావితమవుతుంది. పైగా నీటి ప్రవాహాల్లోని లోతుల్లోనూ తేడాలు ఉంటాయి. కాబట్టే ఇలాంటి ప్రదేశాల్లో వంతెనల నిర్మాణం కూడా అత్యంత కష్టతరమైన సవాలుగా చెప్పొచ్చు. ఈ కారణాల వల్లే అమెజాన్‌ నదిపై ఒక్క బ్రిడ్జి కూడా లేదనేది వారి వాదన.. నది వెడల్పు కారణంగా వంతెనల నిర్మాణం సాధ్యం కాలేదు. ఆ నదిని దాటడం కోసం అమెజాన్‌ పరీవాహక ప్రాంత వాసులు ఫెర్రీలను వినియోగిస్తారు. లాంచీ లేదా పడవలను 'ఫెర్రీ' అని పిలుస్తారు.