
అప్రమత్తతతోనే ఆరోగ్యం.. వర్షాకాలం వస్తుందంటే పిల్లలకి, యువతకి ఆనందం. వారి తల్లిదండ్రులకి ఆందోళన. ముసలి వాళ్ళకి, గర్భిణులకు, పాలిచ్చే తల్లులకు భయం. చిరుజల్లులలో తడవాలనే కోరిక కొందరిదైతే, వర్షంలో తడవడం తప్పని పరిస్థితి కొందరిది. మండుటెండలని దాటుకుని వర్షాకాలంలోకి ప్రవేశిస్తున్న పరిస్థితుల్లో మనం ఆరోగ్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే వర్షాన్ని మనమూ, మన పిల్లలూ హాయిగా ఆస్వాదించొచ్చు. మరి అదెలాగో తెలిపేందుకే సీజనల్ వ్యాధుల గురించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ ప్రత్యేక కథనం..
మనకి వర్షాకాలంలో వచ్చే జబ్బులను, అవి వ్యాపించే విధానం బట్టి మూడు రకాలుగా విభజించొచ్చు. ఒకటి దోమలు లేదా ఈగల ద్వారా వ్యాపించేవి. రెండు నీటి ద్వారా వ్యాపించేవి. మూడు ఒకరి నుండి ఒకరికి దగ్గులతో లేదా తుమ్ములతో అంటుకునే అంటువ్యాధులు. కొన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉంటే ఈ మూడు రకాల వ్యాధులు కూడా నివారించదగ్గవే.
దోమల ద్వారా..
మలేరియా, డెంగీ, చికన్ గున్యా వ్యాధులు దోమల ద్వారా వ్యాపిస్తాయి. డెంగీ, చికన్ గున్యా వ్యాధులు ఎయిడెస్ (టైగర్ దోమ) అనే దోమ వల్ల వ్యాపిస్తే, మలేరియా మాత్రం అనోఫెలిస్ అనే దోమ వల్ల వ్యాపిస్తుంది. వర్షాకాలంలో, చలి కాలంలో పట్టణాల్లోని ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యే రోగుల్లో అధిక భాగం డెంగీ వల్లనే. అన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్ల లాగానే డెంగీ వచ్చినపుడు రోగికి జ్వరం, తలనొప్పి, కండరాలు, తీవ్ర కీళ్ల నొప్పులు ఉంటాయి. డెంగీ రోగుల్లో కనబడే ఇంకో విశిష్ట లక్షణం, కంటి వెనుక భాగంలో లాగడం, కళ్ళు అటూ ఇటూ తిప్పినప్పుడు నొప్పొస్తాయి. ఇవి కాకుండా నీరసం, ఆకలి లేకపోవడం, కడుపు నొప్పి, గొంతులో గరగర కూడా ఉండవచ్చు. రోగి శరీరం పైన రాష్ (చిన్న ఎర్రటి మచ్చలు) కనబడతాయి. డెంగీ ఇన్ఫెక్షన్ వల్ల మన రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్లేట్లెట్లు తగ్గిపోతాయి. ఇవి ఒక మిల్లీలీటర్ రక్తంలో యాభై వేల కంటే తక్కువకి పడిపోతే అడ్మిట్ చేసి, రోగి పరిస్థితిని బట్టి ప్లేట్ లెట్ కణాలను ఎక్కించవలసి ఉంటుంది. చికన్ గున్యా వ్యాధిలో కూడా అచ్చం డెంగీ లాంటి లక్షణాలే కనబడతాయి. ఈ వ్యాధి కూడా టైగర్ దోమ ద్వారానే వ్యాపిస్తుంది. ఈ వ్యాధిలో తీవ్రమైన కీళ్ల నొప్పులతో పాటు కీళ్ల వాపు కూడా ఉంటుంది. చేతి వేళ్ళు, కణతలు, మోచేతులు, మోకాళ్ళ వాపు, నొప్పులు ఉంటాయి. వెయ్యి డెంగీ రోగులుంటే అందులో ఒకరు మరణించే అవకాశం ఉంటుంది. చికన్ గున్యా రోగుల్లో మరణాలు అసలు నమోదు కావు. రెండు రోగాల్లో కూడా ఆసుపత్రిలో చేరిక, ఇతర ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు రోగాలను నివారించడానికి టైగర్ దోమలతో కుట్టించుకోకుండా ఉండటం ఒక్కటే మార్గం. ఈ టైగర్ దోమల నల్లటి కాళ్ళపైన పులి లాగ తెల్లటి చారలు ఉంటాయి. ఇవి పట్టణాల్లో, ఇంటి చుట్టూ లేదా ఇంటి లోపల ఉండే చెత్త సామాన్లలో నీళ్లు నిలిచిపోవడం వల్ల పెరుగుతాయి. సగం విరిగిన బాటిళ్లు, బక్కెట్లు, కొబ్బరికాయ టెంకలు, కుండలు, ఇళ్లల్లో పెంచే నీటి మొక్కల కుండీలు, వేసవిలో వాడి వదిలేసినా కూలర్లలోని నీళ్ళు - ఇలాంటి వాటిల్లో అవి గుడ్లు పెడతాయి. ఈ దోమలు ఉదయం పూటే ఎక్కువగా కుడతాయి. వీటికి సంతానోత్పత్తి జరగాలంటే ఒక్క వ్యక్తి రక్తం పీల్చుకుంటే సరిపోదు.. చాలా మంది వ్యక్తుల రక్తం కావాలి. ఎవరికైనా డెంగీ వచ్చిందంటే ఆ రోగి ఇంటి చుట్టుపక్క వారిలో లేదంటే పనిచేసే చోట ఎవరికో డెంగీ ఉందని అర్థం. డెంగీ మరింత వ్యాప్తి చెందకుండా ఉండాలంటే డెంగీ రోగులను కూడా దోమలు కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టూ ఒకసారి పరీక్ష చేసి, ఏ వస్తువుల్లోనైనా నీళ్లు నిల్వ ఉంటే వాటిని ఖాళీ చేసి, బోర్లించి పెట్టాలి. ఇంట్లో ఉండే నీటి మొక్కలు, నీళ్ల ట్యాంకులను కనీసం వారానికి ఒకసారి పరీక్షగా చూసి, మార్చేయాలి. చిన్న పిల్లలకు, పసి పాపాయిలకు లేత రంగులో ఉన్న పొడవు చేతుల చొక్కాలు, ప్యాంట్లు వేయాలి. గర్భిణీ స్త్రీలు, వద్ధులు కూడా దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పైన తెలిపిన జ్వరం లాంటి లక్షణాలు ఏవైనా కనబడితే వెంటనే దగ్గర్లో ఉన్న వైద్యుడికి చూపించుకోవాలి.
డెంగీ, చికనుగున్యా ఎక్కువగా పట్టణ ప్రజలలో, ఆర్థికంగా ఉన్న వాళ్లలో కనబడితే, మలేరియా మాత్రం పల్లెల్లో, పేద ప్రజలలో ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే మలేరియాని వ్యాపింపజేసే దోమలు అనాఫిలిస్ దోమలు. ఇవి పంటపొలాల్లో నీళ్ళు నిలువ ఉన్న చోట, డ్యామ్‌లలో, రిజర్వాయర్‌లలో ఎక్కువగా పెరుగుతాయి. ఈ దోమలు సాయంత్రం నుండి మొదలు పెట్టి, రాత్రి వేళ వరకు కుడతాయి. వర్షా కాలంలో నీళ్ళు నిలవ ఉండటం వల్ల ఎక్కువగా పెరుగుతాయి. ఈ కాలంలో తగ్గిన ఉష్ణోగ్రత, పెరిగిన తేమ శాతం కూడా దోమలు ఎక్కువ కాలం బ్రతకడానికి దోహదం చేస్తాయి. పట్టణ ప్రాంతాల్లో ఓవర్ హెడ్ ట్యాంకుల్లో ఉండే నీటిలో ఈ లార్వాలు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతీ మూడో రోజు లేదా రెండో రోజు అధికంగా పెరిగే జ్వరం మలేరియా యొక్క ప్రత్యేక లక్షణం. చలి, వణుకుతో మొదలయ్యి.. కాసేపటికి జ్వరం రావడం, జ్వరం తగ్గేటపుడు బాగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటాయి. డెంగీ, చికన్ గున్యాలు వైరస్‌ల వల్ల వ్యాప్తి చెందితే, మలేరియా మాత్రం ప్లాస్మొడియం అనే ప్రోటోజోవా (బ్యాక్టీరియా కంటే కొంచెం పెద్ద జీవి) వల్ల వస్తుంది. దీనికి చికిత్స ఉంది. మలేరియాను కలగజేసే జీవులను చంపడానికి రకరకాల మందులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. వీటిని ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. మలేరియాలో ఫాల్సిఫాం అనే రకం మాత్రం చాలా తీవ్రమైన వ్యాధి కలగజేస్తుంది. దీనివల్ల గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లల మరణాలు కూడా సంభవించే అవకాశం ఉంది. అందుకే వీళ్ళని దోమల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి నుండి రక్షించుకోవడానికి పడుకునేటపుడు మంచం చుట్టూ దోమ తెరలు కట్టుకోవాలి.

నీటి ద్వారా వ్యాపించేవి..
కలుషితమైన నీళ్ళు తాగడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. వర్షా కాలంలో మంచి నీళ్ళు కలుషితమయ్యే అవకాశం చాలా ఎక్కువ. డ్రైనేజీ పైపుల లీకేజీ వల్ల మంచి నీటిపైపులలోకి మురికి నీరు ప్రవేశిస్తాయి. అందుకే ఫిల్టర్ నీళ్ళు, కనీసం 15 నిమిషాల పాటు మరిగించి, చల్లార్చిన నీటినే తాగాలి. కలరా, టైఫాయిడ్, విరేచనాలు, అమీబియాసిస్, హెపటైటిస్ ఎ వ్యాధులు అసురక్షితమైన నీళ్ళు తాగడం వల్లే వస్తాయి. కలరా వ్యాధిలో నీళ్ళ విరేచనాలు అవుతాయి. రోజుకి పదిహేను పైనే నీళ్ళ విరేచనాలు, అవి గంజిలాగా అవుతుంటే కలారానేమో అని అనుమానం కలగాలి. కలుషితమైన నీరు తాగిన వారందరూ ఒకేసారి దీని బారిన పడే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ప్రాంతంలో కలరా వచ్చిందంటే అక్కడి సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. వెంటనే ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకోవాలి.
చాలా మంది తమ జీవిత కాలంలో ఒక్కసారైనా టైఫాయిడ్ జ్వరం బారిన పడి ఉంటారు. ఇది ముఖ్యంగా కలుషితమైన మంచినీటి ద్వారా, కలుషితమైన ఆహారం ద్వారా వ్యాపిస్తుందనే అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. టైఫాయిడ్ జ్వరం బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఇది వచ్చినవారు సరైన చికిత్స తీసుకోకపోతే తమ జీవితకాలం పాటు టైఫాయిడ్ బ్యాక్టీరియాను తమ మలం, మూత్రంలో విసర్జిస్తూ ఉండే అవకాశం ఉంటుంది. మల మూత్ర విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోకపోవడం వల్ల ఈ క్రిములు చేతులకి అంటుకొని ఉంటాయి. అవే చేతులతో ఆహార పదార్థాలను ముట్టుకోవడం, వంట చేయడం వంటివి చేస్తే టైఫాయిడ్ క్రిములు వేరే వాళ్ళ జీర్ణాశయంలోకి చొరబడతాయి. ఎవరికైతే తమ శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారికి టైఫాయిడ్ జ్వరం వల్ల జీర్ణాశయంలో రక్తస్రావం అవ్వడం వంటివి జరుగుతాయి. కొన్ని సందర్భాల్లో లివర్, మూత్రపిండాలు కూడా దెబ్బ తింటాయి. సరైన చికిత్స ఇవ్వకపోతే టైఫాయిడ్ వల్ల మరణాలూ సంభవిస్తాయి. టైఫాయిడ్ జ్వరం నిచ్చెనమెట్లలాగ రోజు రోజుకీ పెరుగుతూ ఉంటుంది. నీరసం, తలనొప్పి, పొట్ట ఉబ్బరం, మల బద్ధకం ఉండొచ్చు. వ్యాధి మొదటి దశలో కొందరికి ఆకుపచ్చ రంగులో నీళ్ల విరేచనం అవుతుంది. చికిత్స అయిపోయాక మూడు నెలలకి ఒకసారి, పన్నెండు నెలల తర్వాత ఒకసారి మల పరీక్ష చేయించుకోవాలి. అందులో టైఫాయిడ్ బాక్టీరియా ఉన్నాయో లేవో పరిశీలిస్తారు. టైఫాయిడ్ జ్వరం ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో టైఫాయిడ్ వాక్సిన్ ఇవ్వొచ్చు. హోటళ్లలో పనిచేసే వాళ్ళు, చిరుతిళ్ళు బండిపై అమ్మేవాళ్ళు, పానీపూరి అమ్మేవాళ్ళు వాక్సిన్ వేయించుకుంటే ఈ వ్యాధిని నివారించొచ్చు.

హెపటైటిస్ ఎ..
వైరస్ వల్ల సోకే అంటువ్యాధి హెపటైటిస్ ఎ. కలుషితమైన నీరు, ఆహరం వల్ల వ్యాపిస్తుంది. దీనికి వాక్సిన్ గానీ మందులు గానీ లేవు. నివారణ ఒక్కటే మార్గం.
అమీబియాసిస్..
హాస్టళ్లలో ఉండే పిల్లలకు, పరిశుభ్రత లేని ప్రదేశాల్లో ఎక్కువగా సోకే అవకాశం ఉంటుంది. ఇంట్లో ఒకళ్ళకి అమీబియాసిస్ ఉంటే ఇతర కుటుంబసభ్యులకు కూడా సోకే అవకాశం చాలా ఎక్కువ. దీనికి కచ్చితమైన చికిత్స అందుబాటులో ఉంది. ఈ వ్యాధి కొంతమందిలో కాలేయానికి, మెదడుకి కూడా సోకుతుంది. అందుకే మలంలో చీము, రక్తం కనబడ్డాయంటే వెంటనే అప్రమత్తం అయ్యి, వైద్యులని సంప్రదించాలి. ఆంటిబయోటిక్ కోర్స్ మొత్తం వాడాల్సి ఉంటుంది.
ఇతర విరేచనాలు..
వర్షా కాలంలో ఐదు సంవత్సరాలలోపు పిల్లలకి, వద్ధులకు విరేచనాలు తొందరగా సోకుతాయి. చాలా వరకు విరేచనాలు వైరస్‌ల వల్లే వ్యాపిస్తాయి. బ్యాక్టీరియా వల్ల వచ్చే విరేచనాలు చాలా తక్కువ. అందుకే తొందరపడి అంటిబయోటిక్‌లు వాడకూడదు. మందుల దుకాణాలకు వెళ్లి అంటిబయాటిక్‌లు అడగకూడదు. ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు దగ్గర పెట్టుకోవాలి. ఒక ప్యాకెట్‌ను లీటర్ వేడి చేసి, చల్లార్చిన నీళ్ళల్లో కలుపుకొని తాగాలి. పెరుగు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. వీటిల్లో మంచి బ్యాక్టీరియాలు ఉండటం వల్ల జీర్ణాశయం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం విరేచనాలకు కారణమైన రోటా వైరస్‌కి వాక్సిన్ అందుబాటులో ఉంది. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నపిల్లలకు నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్‌లో భాగంగా ఉచితంగా ఇస్తారు. పిల్లలందరికీ కచ్చితంగా సరైన సమయంలో టీకాలు వేయించాలి.
యాత్రలు.. సమ్మేళనాలు..
తీర్థ యాత్రలు, పుష్కరాలు, ప్రేయర్లు, జమాత్‌లు, రాజకీయ లేదా ఇతర కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో జనం ఒకదగ్గర గుమిగూడినప్పుడు నీరు కలుషితమై, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. అందుకని అక్కడికి వెళ్లినపుడు ఆహరం, తాగు నీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. మాటి మాటికీ చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. సురక్షితమైన మంచినీరు తాగడం వల్ల, బాగా ఉడికించిన ఆహరం, బాగా కడిగిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల జీర్ణాశయ సంబంధిత అంటువ్యాధులను నివారించొచ్చు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతి రుమాలు అడ్డు పెట్టుకోవాలి.

శ్వాసకోశ వ్యాధులు..
వర్షాకాలం వచ్చిందంటే అందరినీ వేధించే మరికొన్ని సమస్యలు జలుబు, దగ్గు, న్యూమోనియా, ఆస్తమా. వర్షాకాలంలో ఉష్ణోగ్రత తక్కువగా ఉండటం, వాతావరణంలోని తేమ, జనాలు ఒకే దగ్గర గుమిగూడి ఉండటం వల్ల ఈ వ్యాధులన్నీ ఒకరి నుండి ఒకరికి తొందరగా వ్యాపిస్తాయి. శ్వాసకోశ వ్యాధులలో చాలా వరకు వైరస్ వల్ల సోకేవే ఉంటాయి. జబ్బు ఉన్నవాళ్లు తుమ్మడం, దగ్గడం వల్ల ఇతరులకు సోకుతాయి. దగ్గిన, తుమ్మిన ప్రతిసారీ చేతులు శుభ్రంగా సబ్బు, నీటితో కడుక్కోవాలి. వాడేసిన టిష్యూ పేపర్లు ఎవరికీ అంటకుండా జాగ్రత్తగా చెత్తబుట్టలో వేయాలి. చేతి రుమాళ్ళు ఎప్పటికపుడు ఉతుక్కోవాలి. జన సాంద్రత ఎక్కువగా ఉన్న రైల్వేస్టేషన్‌లలో, బస్సు స్టాండ్‌లలో మాస్కు పెట్టుకోవడం ఉత్తమం. ఆస్తమా ఉన్న వాళ్ళు వైద్యులను సంప్రదించి, ముందస్తు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకోవాలి. దగ్గర పెట్టుకోవాల్సిన మందులు, ఇన్హేలర్‌లు, తీసుకోవాల్సిన ఆహరం గురించి కూడా తెలుసుకోవాలి. ఆస్తమా ఒకరి నుండి ఒకరికి సోకదు. పుప్పొడి వల్ల, కొన్ని రకాల వాతావరణ కాలుష్యాల వల్ల, కొన్ని ఆహార పదార్థాల వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుంది. ఆ ట్రిగ్గర్‌లను ఎవరికి వారే గుర్తించి, తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలందరికీ అంటువ్యాధులకి సంబంధించిన టీకాలు సరైన సమయానికి వేయించాలి. ముసలి వాళ్లకి, షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా ఇప్పుడు న్యూమోనియా వాక్సిన్ అందుబాటులో ఉంది. అరవై ఐదేళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ వేయించుకోవచ్చు.

ప్రమాదాలు..
ఇవన్నీ కాకుండా వర్షా కాలంలో ఎదురయ్యే మరొక సమస్య ఆక్సిడెంట్లు / రోడ్డు ప్రమాదాలు. రోడ్లు తడిగా ఉండటం వల్ల వాహనాలు జారి, కింద పడే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి ద్విచక్ర వాహనాలు నడిపేవాళ్లు అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు హెల్మెట్ పెట్టుకునే బయటకి వెళ్ళాలి. రాత్రుళ్ళు తెలియని దారుల్లో ప్రయాణం చేయకపోవడమే నయం. టీనేజ్‌లో ఉండే యువకులు, ఇరవైలలో ఉండే వాళ్ళు ఎక్కువగా ప్రమాదాలకు గురవుతారు. వారికి జీవితం విలువ అర్థ మయ్యేలాగా చెప్పాలి. వారి బాధ్యతా రాహిత్యం వల్ల మరొకరి జీవితం కూడా నష్టపోయే అవకాశం ఉంటుందని వారికి గుర్తు చేయాలి.
పాముల బెడద..
వర్షాకాలంలో పల్లెల్లో ఎదురయ్యే సమస్య పాము కాటు. వర్షాలకు పాములు భూమి నుండి బయటకి వచ్చి మనుషులను, పశువులను కుట్టే అవకాశం ఉంది. పాము కాటుకి మందు ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అందుబాటులో ఉండాలి. ఎవరికైనా పాము కాటేసిన ప్రదేశం నుండి పైకి తాడుతో కట్టి, వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. అక్కడే యాంటి-స్నేక్ వీనం యాంటీబోడీస్ ఇంజక్షన్ తీసుకోవాలి. వెంటనే ఆసుపత్రిలో చేరి, సరైన చికిత్స తీసుకోవాలి. ఇప్పటికీ పల్లెల్లో పాము కాటుకు మంత్రం వేసే వాళ్ళున్నారు.
శాస్త్రీయ విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందింది, అందరి అరచేతుల్లో ఫోనులు వచ్చేశాయి. చదువుకున్న యువకులు, పెద్దవాళ్ళు ఊర్లో చదువుకోని ప్రజలను విజ్ఞానవంతులను చేయాలి. వారు మూఢవిశ్వాసాల బారిన పడి మోసపోకుండా, ప్రాణాలకు నష్టం తెచ్చుకోకుండా చూసే బాధ్యత మనందరిదీ అని గుర్తు పెట్టుకోవాలి.

ఈగలతో వచ్చేవి..
ఇక ఈగల వల్ల కలిగే ముప్పు తక్కువేమీ కాదు. వర్షా కాలం వచ్చిందంటే పల్లెల్లో ముందు పెరిగేవి ఈగలే. అవి మురుగు, తడి చెత్త, మలము, కూరగాయలు, పళ్ళు కుళ్ళిన చోట ఎక్కువగా పెరుగుతాయి. ఈగల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల్లో ముఖ్యమైనవి టైఫాయిడ్, కలరా, అమీబియాసిస్, విరేచనాలు, పోలియో, నులి పురుగులు మొదలైనవి. మనం తినే ఆహారంపైన ఈగలను వాలనివ్వకూడదు. వండిన పదార్థాలపైన మూతలు పెట్టాలి. పళ్ళు, కూరగాయలు నీళ్లతో బాగా కడిగాకనే తినాలి.

మిగిలిన ఆహారం హానికరం..
వర్షాకాలంలో, చలి కాలంలో చాలా మంది చేసే ఇంకో పని మిగిలిపోయిన అన్నాలు, కూరలు తినడం. వాతావరణం చల్లగా ఉండటం వల్ల బ్యాక్టీరియాలు తొందరగా పెరగకపోయినా చాలాసేపు బయట వదిలేసిన ఆహార పదార్థాలు పాడయ్యే అవకాశం ఉంటుంది. వండిన పదార్థాలను రెండు గంటలలోపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. ఆ పదార్థాలు బయటకి తీసాక బాగా వేడి చేసి, ఉడికించి మాత్రమే తినాలి. ఆహారం ఎప్పుడూ గోరువెచ్చగా వేడి చేసి తినకూడదు. గోరు వెచ్చటి ఆహారాల్లో తొందరగా క్రిములు పెరుగుతాయి. బాగా వేడి చేసే అవకాశం లేనపుడు ఎప్పటికపుడు వండుకుని తినడం ఉత్తమం. మైక్రోవేవ్ ఉపయోగించేవారు ఆహారాన్ని మధ్య మధ్యలో కలుపుతూ వేడి చేయాలి. లేదంటే అక్కడక్కడ కొన్ని కోల్డ్ స్పాట్స్ ఉండిపోతాయి.
అపోహలు..
వర్షాకాలంలోని అనారోగ్య విషయాల్లో జనాల్లో రక రకాల అపోహలు పేరుకుపోయి ఉన్నాయి. వర్షంలో తడిస్తే జలుబు చేస్తుందని ఒక అపోహ ఉంది. కానీ వర్షంలో తడిచాక వెంటనే వేడినీళ్లతో తలస్నానం చేసి, జుట్టును బాగా ఆరబెట్టుకుంటే ఏ జలుబూ దరి చేరదు. వర్షాకాలంలో కొన్నిరకాల ఆహారాలు తినకూడదనే అపోహ ఉంది. కానీ అందరూ అన్ని రకాల ఆహారాలు తీసుకోవచ్చు. తియ్యటి పదార్థాలు తిన్నాక / తాగాక బ్రెష్ చేయడం అలవాటు చేసుకుంటే గొంతు నొప్పి/ ఇన్ఫెక్షన్‌లు రావు.
డాక్టర్ దేశం పిఆర్
ఎంబీబీఎస్, ఎండి
ప్రజారోగ్య నిపుణులు
[email protected]