ఈ సృష్టిలో జీవులన్నీ ఒకే రకంగా ఉండటం లేదు. ప్రతి జీవి ఇంకో జీవికి పూర్తిగా భిన్నం. మొక్కల నుండి జంతువులను విభజించేది ఆహార ఉత్పత్తి. మొక్కలు వాటి ఆహారాన్ని అవే తయారుచేసుకునే స్వయంపోషకాలు, కానీ జంతువులు వాటి ఆహారం కోసం, శక్తి కోసం ఇతర జీవులపై ఆధారపడి జీవనం సాగించే పరపోషకాలు. అయితే ఇప్పటివరకూ మనకు వృక్ష జీవులు మాత్రమే కిరజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాన్ని తయారుచేసుకుంటాయన్నదే తెలుసు. కానీ కొన్ని జంతువులు క్లెప్తొప్లాస్టీ (k leptoplasty) విధానం ద్వారా వాటికి కావాల్సిన ఆహారాన్ని అవే తయారుచేసుకుంటాయి. అలాంటి మొక్కలూ ఉన్నాయని తెలుస్తోంది.. జంతువులందు ఈ జంతువులు వేరయా...! అని చాటి చెబుతున్న ఈ మొక్కలు కాని జంతువుల మధ్య ఉన్న విభజన గీతను చెరిపేసే విచిత్రమైన జీవులను శాస్త్రవేత్తలు ఇటీవల గుర్తించారు. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం..
జీవ పరిణామ క్రమంలో చెట్లకు జంతువులకు కనెక్టింగ్ లింక్‌గా 'యూగ్లీనా' జీవి నిలుస్తుంది. ఇది పాత కథ. ప్రస్తుతం కొత్త క్లెప్తొప్లాస్టీ జీవులు ఉనికిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
క్లెప్తొప్లాస్టీ విధానం అంటే : సింబయోటిక్ అసోసియేషన్ (సహజీవనం) వల్ల అతిథేయి జీవి (హోస్ట్) నుండి పరాన్నజీవి (పారాసైట్) కిరణజన్య సంయోగక్రియకు ఉపయోగపడే క్లోరోప్లాస్ట్, క్లోరోఫీల్, జన్యు పదార్థాన్ని శోషించబడి, సూర్య రశ్మి సహాయంతో వాటి ఆహారాన్ని తయారుచేసుకునే పద్ధతిని క్లెప్తొప్లాస్టీ అంటారు. ఇక్కడ తెలిపిన జీవులన్నీ ఈ పద్ధతిని అనుసరిస్తాయి.
1) సీ స్లగ్ (అలిసియా క్లోరోటికా) : అనే జీవి యునైటెడ్ స్టేట్స్, కెనడా తూర్పు తీరంలోని నీటిలో నివసించే ఆకుపచ్చ రంగు జీవి. ఆకు ఆకారంలో ఉండే శరీరం దీని ప్రత్యేకత. ఇవి ఆల్గే (వౌచెరియా ఆల్గే) ను తింటుంది. కానీ అది శక్తికి మాత్రమే మూలం కాదు. ఈ స్లగ్ కిరణజన్య సంయోగ అవయవాలు (క్లోరోప్లాస్ట్‌లు), ఆల్గే నుండి కొన్ని జన్యువులను శోషించుకుంటుంది. తద్వార క్లెప్తొప్లాస్టీ విధానంలో ఆహారాన్ని తయారుచేసుకుంటాయి.
2) లీఫ్ స్లగ్ (కోస్టాసియెల్లా కురోషిమే) : అనేవి షెల్-లెస్ మెరైన్ ఒపిస్టోబ్రాంచ్ గ్యాస్ట్రోపాడ్ మొలస్క్‌లు. ఇవి ఐదు మిల్లీమీటర్ల నుండి సెంటీమీటర్ వరకూ పొడవు ఉంటాయి. వాటికి రెండు చీకటి కళ్లు, రెండు ఖడ్గమృగాలు (రైనోఫోట్స్), క్రొమెటోఫోర్స్ ఉంటాయి. ఇవి వాటి తలల పైభాగం నుండి వెలువడతాయి. ఇవి గొర్రెల చెవులు, క్రిమి యాంటెన్నాలా కూడా కనిపిస్తాయి. అందుకే వీటిని 'లీఫ్ షీప్' అని ముద్దుగా పిలుస్తారు. వీటి శరీరాకృతి కూడా ఆకు వంటి నిర్మాణం కలిగి ఉండటం కిరణజన్య సంయోగక్రియకు మాత్రమే అనే సందేహాన్ని కలిగిస్తుంది. ఇవి తినడానికి ఏమీ లేకున్నా ఏకంగా తొమ్మిది నెలలు పాటు బతకగలిగాయని, ఆ సమయంలో క్లోరోప్లాస్ట్‌ల సహాయంతో సొంతంగా ఆహారాన్ని తయారుచేసుకున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు.
3) మచ్చల సాలమండర్ - (ఆంబిస్టోమా మాక్యులాటం) : ఇది తూర్పు యునైటెడ్ స్టేట్స్, కెనడాలో ఎక్కువగా కనిపిస్తుంది. ఇది 15-25 సెం.మీ పొడవు ఉంటుంది.
ప్రముఖ పరిశోధకుడు ర్యాన్ కార్ని వీటి పిండాలను అధ్యయనం చేస్తున్నప్పుడు, వాటి కణాల లోపల నుండి ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగును కనుగొన్నాడు.
4) ఓరియంటల్ హార్నెట్ - (వెస్పా ఓరియంటాలిస్) : ఇవి నైరుతి ఆసియా, ఈశాన్య ఆఫ్రికాలో నివసిస్తాయి. ఒక వయోజన హార్నెట్ శరీరం 25 / 35 మి.మీ పొడవు ఉంటుంది. ఇది దాని ఎక్సోస్కెలిటన్ యొక్క క్యూటికల్ సిల్క్ ద్వారా విద్యుత్‌ను ప్రవహించేలా చేస్తుందని డాక్టర్ జాకబ్ ఇషారు కనుగొన్నారు.
శాంతోపెరిన్ వర్ణద్రవ్యం నిజంగా ఎలక్ట్రిక్‌ను సృష్టించగలదని డా. మరియన్ ప్లాట్‌కిన్ అధ్యయనం నిరూపించింది.
గుట్టు విప్పగలిగితే అన్నీ అద్భుతాలే :
'ఎలిసియా క్లోరోటికా' నత్తలు క్లోరోఫిల్‌ను ఎలా సంగ్రహించగలుగుతున్నాయి? ఆహారాన్ని ఎలా ఉత్పత్తి చేయగలుగుతున్నాయనేది తేల్చితే.. ఎన్నో అద్భుత సాంకేతికతను రూపొందించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సౌరశక్తిని ఉపయోగించి నేరుగా ఆహారం తయరుచేయగల సాంకేతికతను అభివృద్ధి చేయవచ్చని భావిస్తున్నారు. అడవుల నరికివేతతో క్షీణిస్తున్న వృక్ష సంపదను తిరిగి పునరుద్ధరించాలంటే.. వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలని, అందుకు ఈ అధ్యయనాలు దోహదం చేస్తాయి. తద్వార ప్రమాదంలో ఉన్న మన పర్యావరణాన్ని కాపాడవచ్చని పేర్కొంటున్నారు. చంద్రుడు, ఇతర గ్రహాలపైకి వెళ్లే మనుషులకు ఆహార సమస్య ఉండదని అంటున్నారు. మొక్కలు / జంతువుల మధ్య రేఖ అంతగా నిర్వచించబడకపోవచ్చు. రానున్న కొన్ని బిలియన్ల సంవత్సరాలలో పరిణామం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బహుశా ఒకరోజు మానవులు కూడా క్లెప్తొప్లాస్టీపై ఆధారపడి జీవించగలరేమో అనే ఆలోచన కలుగుతోంది. మానవుని మేధస్సును తలదన్నే జీవులు ఉద్భవించడం ఖాయమని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది.
జి. మాణిక్యం,
94921 64107