
మనదేశంలో ఎంఎస్‌ఎంఈ రంగం దాదాపు11 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉపాధిని కల్పిస్తోంది. దేశ జిడిపి కి 33 శాతం సహకారం అందిస్తోంది. ఎంఎస్‌ఎంఈల ఏర్పాటుకు, వర్కింగ్ క్యాపిటల్‌కు రుణ లభ్యత కీలకమైనది. వడ్డీ రాయితీ, స్టాండ్-అప్ ఇండియా స్కీమ్, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్‌ప్రైజెస్ కోసం క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ వంటి పథకాలను కేంద్రం ప్రకటించింది. రుణ సంస్థల నుండి ఎలాంటి ఆస్తి తాకట్టు లేకుండా రుణాన్ని అందిస్తామని చెప్పింది. కానీ ఆచరణలో ఇవ్వాల్సినంత తోడ్పాటు ప్రభుత్వాల నుంచి అందడం లేదు. ప్రభుత్వాలు మాటలు కాకుండా చేతల్లో చూపించాలి. చిన్న పరిశ్రమలు ఉపాధికి గ్యారంటీ ఇచ్చేవి. కేంద్రం చిన్నపరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా.. కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న దుస్థితి. ఇలాంటి లోపాలు సరిజేసుకుంటే చిన్న పరిశ్రమలు చిగురిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కేరళ ఆచరణలో దాన్నే నిరూపిస్తూ చిన్నపరిశ్రమలకు పట్టం కట్టింది. దేశంలోనే చిన్నపరిశ్రమాభివృద్ధిలో ఆ రాష్ట్రం అప్రతిహతంగా దూసుకువెళుతోంది. నేడు 'జాతీయ చిన్నపరిశ్రమల దినోత్సవం' సందర్భంగా వీటన్నింటిపైనా ప్రత్యేక కథనం..
దేశంలో చిన్నపరిశ్రమలకు కేంద్ర ప్రోత్సాహకాల్లో నిరాశ ఎదురవుతోంది. దీనితో భారీగా ఎంఎస్‌ఎంఇల రిజిస్ట్రేషన్లు రద్దవుతున్నాయి. కార్పొరేట్లు కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పరారవుతున్నా కేంద్రంలో చలనం లేదు. 'మేడిన్ ఇండియా, మేకిన్ ఇండియా' అంటూ గొప్పగా పేర్లు మారుస్తూ ప్రభుత్వం దాటేస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు మాత్రం కేంద్రం చేయూత ఇవ్వటం లేదు. కరోనాకు ముందు, తర్వాత చిన్నపరిశ్రమలు మరింతగా చితికిపోయాయి. ఎంతో మేధోశక్తి ఉండీ సంస్థలను నడుపుకోలేక మూతవేయాల్సిన దుస్థితి. కేంద్రం ప్రోత్సాహకాల విషయంలో మభ్యపెడుతోంది. ఆ మేరకు యువ పారిశ్రామిక వేత్తల్ని నిరాశపరుస్తోంది.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. చిన్న పరిశ్రమలను పెద్ద మనస్సుతో చూస్తున్నామని.. భారీగా ప్రోత్సాహకాలు ఇస్తున్నామని.. బడ్జెట్‌లో కేంద్రం చెబుతున్న మాటలు నీటి మూటలే. ఒకవైపు వెంటాడుతోన్న ఆర్థిక మందగమనం భయాందోళనలు కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ప్రోత్సాహకాలు నిరాశజనకంగా ఉండటంతో వేలాది సంస్థలు మూతపడుతున్నాయి. దేశంలో దాదాపు 11 కోట్ల మందికి పైగా కార్మికులు ఎంఎస్‌ఎంఇలపై ప్రత్యక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. జీడీపీలో ఈ రంగం దాదాపు 33 శాతం మద్దతును అందిస్తోంది. దేశంలోని మొత్తం శ్రామికశక్తిలో 23 శాతానికిపైగా ఉపాధిని కల్పిస్తోంది. ఇంత ప్రాధాన్యత కలిగిన ఎంఎస్‌ఎంఈలకు చేయూత ఇవ్వకుండా కేంద్రం కార్పొరేట్లకు దాసోహం అంటోంది. ఇవన్నీ పలు గణంకాలే స్పష్టం చేస్తున్నాయి.
ఉద్యమ్ పోర్టల్.. ఉపసంహరణలు..
ఎంఎస్‌ఎంఇల రిజిస్ట్రేషన్, ఆర్థిక మద్దతును అందించడానికి వీలుగా కేంద్రం 2020 జులైలో 'ఉద్యమ్ పోర్టల్'ను ప్రారంభించింది. ఇది ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ), వస్తు సేవల పన్ను నెట్‌వర్క్ (జీఎస్టీఎన్) తోనూ అనుసంధానమై ఉంటుంది. ఉద్యమ్ పోర్టల్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు దేశంలో దాదాపు 73,576 ఎంఎస్‌ఎంఈలు తమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకున్నాయి. ఈ విషయాన్ని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ) శాఖ సహాయమంత్రి భాను ప్రతాప్‌సింగ్ వర్మ స్వయంగా రాజ్యసభకు లిఖితపూర్వంగా తెలిపిన విషయం. మంత్రి పేర్కొన్న వివరాల మేరకు.. మొత్తం 1,57,89,528 ఎంఎస్‌ఎంఇలు పోర్టల్‌లో నమోదయ్యాయి. ఇందులో దాదాపు 1,52,18,776 యూనిట్లు సూక్ష్మ, 4,60,858 చిన్న, 41,078 మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో రిజిస్టర్ అయిన ఆయా సంస్థలు కోట్లాది మంది శ్రమజీవులకి ఉపాధిని కల్పిస్తున్నాయి. ఎక్కువగా తయారీ, సేవా రంగాల్లోని ఈ సంస్థలు ఉన్నాయి. ఇవి మూలధన లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.
ఉద్యమ్ పోర్టల్ నుంచి రిజిస్ట్రేషన్ల ఉపసంహరణలు ఆందోళన కలిగించే అంశం. ఇది స్వయంగా భారత ఎంఎస్‌ఎంఈ ఫోరమ్ ప్రెసిడెంట్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్పొరేట్స్ చిన్న సంస్థలను తొక్కేస్తూ ప్రమాదపుటంచులకు నెట్టేస్తున్నాయని ఆయన అన్నారు. ప్రభుత్వ పాలసీలు పెద్ద కంపెనీలకే అనుకూలంగా ఉన్నాయి. యూనిట్లు, యాజమాన్యంలో మార్పుకు తోడు ప్రభుత్వం నుంచి పెద్ద ప్రయోజనాలు లేవు. దీంతో అనేక సంస్థలు తమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకుంటున్నాయి. ఈ మేరకు ప్రైమస్ పార్ట్‌నర్స్ కో ఫౌండర్ కనిష్క్ మహేశ్వరి చెప్పారు. సమస్యలను గుర్తించి, ఈ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నిర్దిష్ట జోక్యం చాలా అవసరమని ఆమె అంటున్నారు.

వివిధ రాష్ట్రాల్లో రద్దుల పరంపర..
ఎంఎస్‌ఎంఇలు అధికంగా రద్దు, ఉపసంహరించుకున్న వాటిలో మహారాష్ట్ర టాప్‌లో ఉంది. ఆ రాష్ట్రం నుంచి 17,574, తమిళనాడు 6,570, ఉత్తరప్రదేశ్ 6,265, గుజరాత్ 6,115, రాజస్థాన్ 5,260 చొప్పున లైసెన్స్‌లు రద్దయ్యాయి. ఎంఎస్‌ఎంఇలు పెద్ద సంస్థల డిమాండ్లను తీర్చడానికి నిరాకరిస్తే.. వాటితో కలిసి పనిచేయమని బెదిరిస్తున్నాయి. 2022-23 బడ్జెట్‌లో మోడీ సర్కార్ ఎంఎస్‌ఎంఈ రంగానికి దాదాపు రూ.22,140 కోట్ల కేటాయింపులు చేసింది. గత ఏడాదితో పోల్చితే 42 శాతం అదనం అయినప్పటికీ.. వాటిని వ్యయం చేయడంలో, మద్దతును అందించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ఏడాది కష్టతరమైన సంవత్సరమని కేంద్రమే పేర్కొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 10,655 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి. గడిచిన నాలుగేళ్లలో ఇది అత్యధికం. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమే ఈ డేటా వెల్లడించింది. 2021-22లో ఈ సంఖ్య 6,222 పరిశ్రమలు మూతపడగా, 2020-21లో 175 పరిశ్రమలు, 2019-20లో 400 పరిశ్రమలు మూతపడినట్లు తెలిపింది.
మన దేశంలోని ఎంఎస్‌ఎంఈలపై ఆర్థికవేత్తలు కొంతకాలంగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు, జిఎస్‌టిలతో పాటు కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌తో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కుదేలయ్యాయి. ఆ తర్వాత సర్కార్ల ప్రకటించిన ప్యాకేజీలు కార్పొరేట్లు తన్నుకుపోవడం.. చిన్న పరిశ్రమలకు సరైన ప్రోత్సాహకాలు లేకపోవడం మరింతగా ఈ రంగం కునారిల్లిపోవడానికి దారితీసింది.

పేర్లు గొప్ప.. ఆచరణ దిబ్బ..
'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' అంటూ కేంద్రం చెప్తున్న పేర్లు చెప్పడానికి, వినడానికి చాలా గొప్పగా ఉన్నాయి. కానీ మనదేశంలో చిన్నపరిశ్రమలని ప్రోత్సహించడంలో ఇవి ఏమేరకు తోడ్పడ్డాయి అంటే.. ఆచరణే అందుకు గీటురాయి. చిన్నపరిశ్రమలు అవసరమంటూనే.. కార్పొరేట్లకు పెద్దఎత్తున రాయితీలు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఈ నిర్ణయమే ప్రతికూల ఫలితాలు ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అనేక పరిశ్రమలు మూతపడిపోవడమే అందుకు నిలువెత్తు నిదర్శనం.

ఉత్పత్తుల మార్కెటింగ్ కీలకం..
మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో మార్కెటింగ్ కష్టతరమైనప్పటికీ, క్లిష్టమైనది. చిన్న తరహా పరిశ్రమలు చాలా ముఖ్యమైనవి. వాటి వృద్ధి దేశ ఆర్థికవ్యవస్థ యొక్క సమతుల్య విస్తరణతో ముడిపడి ఉంటుంది. చిన్న, మధ్యస్థ, పెద్దస్థాయి వ్యాపారాల విజయం.. వారు తమ ఉత్పత్తులను అత్యంత పోటీ మార్కెట్‌లలో ఎంత బాగా విక్రయిస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది. అధికస్థాయి ఆదాయం, వినియోగం, ఉపాధి, ఇవన్నీ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతాయి. మార్కెటింగ్‌కు పారిశ్రామిక వేత్తలు, ప్రత్యేకించి చిన్నస్థాయి రంగంలో ఉన్నవారు మాత్రమే కాకుండా, ప్లానర్లు, ఆర్థికవేత్తల నుండీ ఎక్కువ శ్రద్ధ అవసరం. ఒక సర్వేలో 76% చిన్న తరహా యూనిట్లకు మార్కెటింగ్ సమస్యలు ఉన్నాయని తేలింది. మార్కెటింగ్ మిక్స్‌కు సంబంధించిన అన్ని సవాళ్లూ ఈ విభాగంలో విశ్లేషించాల్సి ఉంది. సాధారణంగా మార్కెట్ శక్తులు సమర్థత, ఉత్పాదకత, పోటీతత్వం ద్వారా మార్గనిర్దేశం చేయబడతాయి. ప్రస్తుత సరళీకరణ, ప్రపంచీకరణ కాలంలో ఇది ప్రత్యేకంగా వర్తిస్తుంది. గ్లోబల్ సందర్భంలో మార్కెటింగ్ విధులను సంతృప్తికరంగా, విజయవంతంగా నిర్వహించడం చిన్న పరిశ్రమల అభివృద్ధికి కీలకమైన సవాలు.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం తరచూ దేశాలకు ఆర్థిక వృద్ధి ఇంజిన్‌గా ప్రశంసించబడింది. ఎందుకంటే ఇది తక్కువ మూలధన వ్యయంతో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను అందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అదే సమయంలో గ్రామీణ, వెనుకబడిన వర్గాలనూ మెరుగుపరుస్తుంది. పారిశ్రామికీకరణ ద్వారా జాతీయ ఆదాయం, సంపద యొక్క మరింత సమానమైన పంపిణీ ఫలితంగా ఎంఎస్‌ఎంఇలు పెద్ద పరిశ్రమలకు మద్దతునిచ్చే సహాయక యూనిట్లుగా పనిచేస్తాయి. పేదరికాన్ని తగ్గించడంలో, ఎగుమతులను పెంచడంలో, మొత్తం సామాజిక-ఆర్థికాభివృద్ధికి దోహదం చేయడంలో భారీ సామర్థ్యాన్ని ఇవి కలిగి ఉన్నాయి.

దేశానికే రోల్ మోడల్.. కేరళ
కేరళలో ఎనిమిది నెలల్లోనే లక్ష ఎంఎస్‌ఎంఇలు దిశగా అప్రతిహతంగా ముందుకు వెళుతోంది. ఈ మేరకు కేరళ పారిశ్రామిక విధానాన్ని కేంద్రం సైతం ప్రశంసించింది. దేశంలోనే అత్యుత్తమ విధానంగా కేరళ గుర్తింపు పొందింది. ఈ విధానంతో కేరళలో కొత్తగా 2,56,140 మందికి ఉద్యోగాలు లభించాయి. కేరళ పరిశ్రమల శాఖ ఒక్క ఏడాదిలోనే లక్ష సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ) లను స్థాపించి, కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు పొందింది. రాష్ట్ర ప్రధానకార్యదర్శుల జాతీయ సదస్సులో కేంద్రం కేరళలోని పరిశ్రమల శాఖ వ్యవస్థాపక సంవత్సర పథకాన్ని దేశంలోనే అత్యుత్తమ విధానంగా ప్రధాని మోడీనే స్వయంగా పేర్కొన్నారు. ఈ ఏడాది, మార్చి 30న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇయర్‌ను ప్రారంభించారు. లక్ష ఎంఎస్‌ఎంఇలను ఏడాదిలో ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, నవంబర్ నాటికే అంటే ఎనిమిది నెలల్లోనే ఆ లక్ష్యాన్ని పూర్తిచేసి, దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచారు.
ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు నవంబర్‌లోనే పూర్తయ్యింది. ఇది మనదేశంలో కొత్త చరిత్రని కేరళ పరిశ్రమల శాఖ మంత్రి పి.రాజీవ్ పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, కొత్తగా మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా ఏడాది పూర్తికాకుండానే 1,01,353 సంస్థలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేరళలో రూ.6,282 కోట్ల పెట్టుబడులు వచ్చాయని రాజీవ్ చెప్పారు. దీనివల్ల 2,20,500 మందికి ఉపాధి లభించింది. ప్రాజెక్ట్ ప్రారంభించిన 235 రోజుల తర్వాత ఈ ఘనత సాధించినట్లు కేంద్రం గుర్తించి, నివేదికలో ప్రత్యేకంగా పేర్కొంది. లక్ష్యం పూర్తయిన రోజు నాటికి ఉన్న సమాచారం ప్రకారం వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అత్యధికంగా 40,622 మంది ఉపాధి పొందారు. 16,129 ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించడం ద్వారా రూ.963.68 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తరువాత గార్మెంట్స్, టెక్స్‌టైల్స్ రంగంలో 22,312 ఉద్యోగాలు వచ్చాయి. ఈ రంగంలో 10,743 ఎంటర్‌ప్రైజెస్, రూ.474 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ రంగంలో 7,454 ఉద్యోగాలు, 4,014 ఎంటర్‌ప్రైజెస్, రూ. 241 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సేవా రంగంలో 7,048 ఎంటర్‌ప్రైజెస్ రిజిస్టర్ అయ్యాయి. ఈ రంగంలో రూ.428 కోట్ల పెట్టుబడులు, 16,156 ఉద్యోగాలు లభించాయి. వ్యాపార రంగంలో అత్యధిక ఉద్యోగాలు వచ్చాయి. 54,108 ఉద్యోగాలు కల్పించడానికి 29,428 ఎంటర్‌ప్రైజెస్, రూ.1,652 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తంగా కొత్తగా రూపొందించిన పారిశ్రామిక విధానం అంచనా ప్రకారం ఇప్పటివరకు రూ. 7,261.54 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. 1,18,509 సంస్థల ఏర్పాటు ద్వారా 2,56,140 ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. స్థానిక ప్రభుత్వ స్థాయిలో లక్ష ఎంటర్‌ప్రైజెస్ ప్రారంభించడానికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి అన్ని స్థానిక సంస్థలలో 1,153 మంది వృత్తిపరంగా అర్హత కలిగినవారిని నియమించారు.

ముందస్తు ప్రణాళికతోనే..
ఎంఎస్‌ఎంఇ, నాన్-ఎంఎస్‌ఎంఈలకు చేయూతనిచ్చేలా కేరళ పారిశ్రామిక విధానం కొత్త ముసాయిదా పేర్కొంది. కేబినెట్ పరిశీలన చేసిన తర్వాత కొత్త పారిశ్రామిక విధానాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసింది. ఆమేరకు భారీ ప్రోత్సాహకాలకు వాగ్దానం, పెట్టుబడులను ఆకర్షించటం, ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుకుని అమలు చేసింది. పారిశ్రామిక రంగంలో మరిన్ని కొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన కేరళ సర్కారు ఆ విధంగానే అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. భారీ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఇ), నాన్ ఎంఎస్‌ఎంఈలకు భారీ ప్రోత్సాహకాలకు హామీనిచ్చేలా ఏర్పాటు చేసుకున్న లక్ష్యాలు ఆచరణలో పెట్టింది. పెట్టుబడులను ఆకర్షించటం, ఉపాధి కల్పనను ప్రోత్సహించటం, వ్యవస్థాపకతను పెంపొందించటం లక్ష్యంగా అనేక ప్రోత్సాహకాలను ఆ విధానంలో పొందుపర్చినవి అమలు చేసింది. పెట్టుబడి రాయితీ, వంద శాతం విద్యుత్, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, ఖర్చుల రీయింబర్స్‌మెంట్ వంటి ప్రధాన ప్రోత్సాహకాలూ ఇందులో చాలా ప్రణాళికా బద్ధంగా ప్రతిపాదించి, ఆచరణలోకి తెచ్చింది. నాలుగేళ్ల తర్వాత వస్తున్న కొత్త విధానం రాష్ట్రంలోని సాంప్రదాయ రంగాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హైటెక్ వ్యవసాయం, విలువ జోడించిన రబ్బరు ఉత్పత్తులు, వైద్య పరికరాలు, బయోటెక్నాలజీ, గ్రాఫేన్, ఎలక్ట్రిక్ వాహనాలు, రోబోటిక్స్ వంటి వాటిపై దృష్టి సారించేలా చేసింది.

ప్రధాన ప్రోత్సాహకాలు ఇవే..
ఎంఎస్‌ఎంఇలకు ఐదేళ్ల పాటు వంద శాతం విద్యుత్ సుంకం మినహాయింపు ఉంటుంది. పారిశ్రామిక పార్కుల్లో తయారీ యూనిట్ల ఏర్పాటుకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో వందశాతం మాఫీ ఉంటుంది. రాష్ట్రంలో ఎక్కడైనా మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు కోసం మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు మినహాయింపులు ఉంటాయి. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించిన తేదీ నుంచి మూడేళ్ల కాలానికి ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచి ప్రాధాన్యతా రంగ యూనిట్ల ద్వారా స్థిర మూలధన పెట్టుబడి కోసం తీసుకున్న టర్మ్‌లోన్‌పై ప్రభుత్వం రెండు శాతం వడ్డీ రాయితీని కూడా అందిస్తుంది. పాలసీ పీరియడ్‌లో ఏడాదికి పదివేల మందికి ప్రత్యక్షంగా, 30 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో..
ఉపాధి కల్పనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఇ) లు పోషించే పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా కష్టకాలంలో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో ఇవి కూడా ఉన్నాయి. వీటిని ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పగా ప్రకటించాయి. అయితే ఆచరణ అంతంత మాత్రంగానే ఉంది. పైగా సర్కారీ ప్యాకేజీలను అంబానీ, ఆదానీ వంటి బడా కార్పొరేట్లకు అందేలా చేశాయి. దీనితో నామమాత్రపు సాయం కూడా అందకుండా ఎంఎస్‌ఎంఈలు కునారిల్లుతున్నాయి. వీటిని ఆదుకోవడానికి బదులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆ పరిశ్రమలపై గొడ్డలివేటుగా మారింది. ఉన్న స్థలాల్ని కోల్పోవడంతో పాటు, కొత్తగా ప్రభుత్వం ఇవ్వజూపే చోట కొనుక్కోవాల్సి రావడమే దీనికి కారణం. రాష్ట్రంలో ఇప్పటికే భూముల ధరలు ఆకాశానికి తాకుతున్నాయి. కొత్త స్థలాలకు ప్రభుత్వం ఎంత ధర నిర్ణయిస్తుందో ఎవరికీ తెలియదు. అక్కడ కొనుక్కొని, కొత్తగా యూనిట్లు పెట్టే సామర్ధ్యం ఎందరికి ఉంటుంది..? పరిశ్రమకే పెట్టుబడి అవసరం. ఇంకా 30,40 ఏళ్ల నాటి స్థలాలను అప్పజెప్పి, కొత్తవి కొనుగోలు చేయడమంటే అవి వృద్ధి చెందడం మాట ఏమోగానీ, మూతపడటం మాత్రం ఖాయం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే ప్రభుత్వ నిర్ణయం ఎంత వినాశకరమైనదో అర్థమవుతుంది. ఇది రాష్ట్రాభివృద్ధిని ప్రశ్నార్ధకంగా మార్చడంతో పాటు, ఉపాధి కల్పన లక్ష్యాలను నీరుగారుస్తుంది. అభివృద్ధి పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ బలవంతపు ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేయాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి ఆచరణాత్మకమైన ప్రణాళికను రూపొందించాలి.
బ్యాంకు రుణాలను చెల్లించలేక ఎన్‌పీఏలుగా మారిపోయిన యూనిట్లను ఆదుకోవడానికి 'వైఎస్సార్ నవోదయం' పథకాన్ని అమల్లోకి తెచ్చారు. లాక్‌డౌన్‌తో కార్యకలాపాలు లేక, ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ రంగాన్ని రక్షించేందుకు తక్షణం రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీ కింద గత ప్రభుత్వం బకాయిపడ్డ రాయితీలతో పాటు ఈ ఏడాది ఇవ్వాల్సిన రాయితీలు కలిపి రూ.905 కోట్లు విడుదల చేయడం ద్వారా కొంత ఊరట లభించింది. అయితే మరోవైపు స్థలాలు లేకుండా చేయడం కుడి చేత్తో ఇచ్చి, ఎడమ చేత్తో లాక్కోవడంలా ఉంది. పైపెచ్చు ప్రభుత్వాలు ఇచ్చే ప్యాకేజీలు కార్పొరేట్ సంస్థలు గద్దల్లా తన్నుకుపోతున్నాయి.

పర్యవేక్షణకు ప్రత్యేక వ్యవస్థ..
రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఇలను నిరంతరం పర్యవేక్షించే విధంగా ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది ఆ సంస్థల ప్రతినిధుల డిమాండ్.ఎంఎస్‌ఎంఇలకు పరిశ్రమ ఆధార్ ఇవ్వడం ద్వారా పూర్తిస్థాయిలో డేటాబేస్‌ను తయారుచేస్తున్నట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ జె.సుబ్రహ్మణ్యం చెప్తున్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే విధంగా ఏపీఐఐసీ ప్లగ్ అండ్ పే విధానంలో వినియోగించుకునే విధంగా 31 ఎంఎస్‌ఎంఇ పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని ఆయన అంటున్నారు. అయితే వీటితోనే చిన్నపరిశ్రమలు బతికిపోవు. అవి నిత్యం కళకళలాడేలా ఆచరణాత్మక నిర్ణయాలు ఉండాలి. ఆమేరకు అవి వృద్ధి చెంది, రాష్ట్ర ప్రయోజనానికే తోడ్పడతాయి.. అనేకమందికి ఉపాధినీ కల్పిస్తాయి. ఆ వైపుగా ఈ వ్యవస్థ పనిచేయాలి.
ఎంఎస్‌ఎంఇలపై కేంద్రం కపట ప్రేమ : సిహెచ్ నర్సింగరావు సిఐటియు రాష్ట్ర ప్రధానకార్యదర్శి

కేంద్ర ప్రభుత్వం 2021 కోవిడ్ కాలంలో రూ.20 లక్షల కోట్లు ఎంఎస్‌ఎంఇల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నామని ఆర్భాటంగా ప్రచారం చేసింది. టీవిలకే అతుక్కుపోయిన ఆ కాలంలో ప్రజలందరూ బిజెపి ప్రభుత్వం మధ్యతరహా పరిశ్రమలకు గొప్పగా సహాయపడుతున్నట్లు భావించారు. కానీ ఆచరణలో ఇది నాటకమని రుజువైంది. దఫదఫాలుగా రుణాలు ఇస్తున్నట్లు ప్రకటించినా, ఆచరణలో కార్పొరేట్లను ఉద్ధరించడానికే ఈ ప్రకటనలు చేశారని అర్థమైంది.
ఎంఎస్‌ఎంఇల నిర్వచనంలో రూ. 250 కోట్ల వరకు టర్నోవర్ వున్న కంపెనీలను చేర్చారు. దీనితో పెద్ద కంపెనీలన్నీ ఇందులో దూరిపోయాయి. కార్పొరేట్లదే పైచేయి అయ్యింది. పేరుకే ఎంఎస్‌ఎంఇలు తప్ప, ఆచరణలో అంతా కార్పొరేట్ల సొంతమైంది. ఎంఎస్‌ఎంఇలు మూడు నెలలు లోన్‌లు చెల్లింపులో బకాయిలు వుంటే, ప్రభుత్వం వీరిని డిఫాల్టర్ లిస్ట్‌లో పెట్టింది. మూడునెలలు బదులు కనీసం సంవత్సరం లోపు లోన్‌లు చెల్లించే గడువు పెంచాలని.. కేంద్రానికి మొరపెట్టుకున్నా ప్రభుత్వం పెడచెవిని పెట్టింది. ఎంఎస్‌ఎంఇలు చేసే వర్క్ ఆర్డర్లకు బిల్లు పేమెంట్ కావాలంటే ఆరు నెలలు లోపు ఏ కంపెనీ కూడా చెల్లించడం లేదు. దీంతో వీరికి లోన్ అర్హత లేకుండా పోయింది. స్థోమత కల్గిన కార్పొరేట్లు మాత్రమే లోన్‌లు పొందారు.
ఉదా: విశాఖ ఆటోనగర్‌లో రూ. 2.5 కోట్లు టర్నోవర్ కలిగిన ఒకే కంపెనీకి లోన్ అర్హత వచ్చింది. కానీ ఆ యజమాని కొన్న ఒక వ్యాన్ కోసం తీసుకున్న లోన్ రెండు వాయిదాలు చెల్లించలేదని ఆ కంపెనీకి బ్యాంకు అనర్హత ప్రకటించింది. విశాఖలోని ఆటోనగర్‌లోనే ఈ పరిస్థితి తలెత్తితే
రాష్ట్రంలో మరే కంపెనీకైనా అర్హత పొందే అవకాశం ఉంటుందా ?
మన దేశంలో ఎంఎస్‌ఎంఇలు నిరంతరం పుడుతూ చనిపోతూ వుంటాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మనదేశంలో 60,800 ఎంఎస్‌ఎంఇలు ఉన్నాయి. 2021-22లో 6,222 ఎంఎస్‌ఎంఇ కంపెనీలు మూతపడ్డాయి. 2022-23లో 10,655 ఎంఎస్‌ఎంఇలు మూతపడ్డాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ విధానాలు ఎంఎస్‌ఎంఇలకి అనుకూలంగా ఉంటే ఇంత పెద్దసంఖ్యలో కంపెనీలు ఎందుకు మూతపడ్డాయి? ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి. ఎంఎస్‌ఎంఇలలో ఉపాధి ఎక్కువ మందికి లభిస్తోందనేది వాస్తవం. కానీ కంపెనీలు తక్కువ కాలంలోనే మూతపడడంతో కార్మికులు కూడా పెద్ద సంఖ్యలో రోడ్డున పడుతున్నదీ అంతే నిజం.
నవ్యసింధు
9866371283