Jun 25,2023 14:34

'శక్తిలో జీవమున్నది. బలహీనుడు జీవన్మృతుడు. అందుకే శక్తివంతమైన, ఉపయోగకరములైన ఆలోచనలు, అలవాట్లు చిన్నతనం నుంచే అలవర్చుకోవాలి' అంటాడు స్వామి వివేకానంద. జీవితం ఆనందమయం కావాలంటే... ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలి. దేశ భవితకు ఆయువుపట్టుగా, బలమైన శక్తిగా నిలవాల్సిన యువత... ఆల్కహాల్‌, మాదక ద్రవ్యాల మత్తులో తమ శక్తి సామర్థ్యాలను నిర్వీర్యం చేసుకుంటోంది. మాదక ద్రవ్యాల దుర్వినియోగం యువతకు వినాశనకరంగా మారింది. విరిగిన కలలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, ఆనందకరమైన జీవితానికి అవరోధంగా మారాయి. అందుకే ఈ నెల 26వ తేదీన ప్రపంచ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం' సందర్భంగా డ్రగ్స్‌ నివారిస్తూ.. ఆరోగ్యాన్ని కాపాడుకునే ఆలోచన చేయాలి. దీనిపైనే ఈ వారం 'అట్టమీది కథ' ప్రత్యేకం.

  •  ఇటీవల విజయవాడలో డ్రగ్స్‌కు బానిసైన యువకుడి అరాచకం.
  •  మాదకద్రవ్యాలకు బానిసై ఓ యువ ఇంజినీర్‌ మితిమీరిన వినియోగంతో నాడీవ్యవస్థ విఫలమై.. గుండె పోటుకు గురై విగతజీవిగా మారాడు.
  •  విజయవాడలోని కొరియర్‌ సంస్థ ద్వారా కెనడాకు వెళ్లిన ఎపిడ్రిన్‌ అనే మందు పొడిని బెంగళూరులోని కస్టమ్స్‌ అధికారులు సీజ్‌ చేశారు.
  •  2021లో ముంద్రా పోర్ట్‌లో సుమారు మూడు వేల కిలోల ఆఫ్ఘన్‌ హెరాయిన్‌ మరియు 2021లో టుటికోరిన్‌ పోర్ట్‌లో 303 కిలోల కొకైన్‌ను స్వాధీనం.
  •  సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ కలకలం- డ్రగ్స్‌ కేసులో కబాలి సినిమా నిర్మాత అరెస్టు.
  •  గంజాయి మత్తులో దుండగుడి పైశాచికం.. మూడో తరగతి బాలికపై దారుణం!
  •  విజయవాడలో డ్రగ్స్‌ కలకలం.. ఆర్టీసీ బస్సులో డ్రగ్స్‌ పట్టుకున్న పోలీసులు..
1

ఇవన్నీ ఈ మధ్యకాలంలో పత్రికల్లోనూ.. టీవీల్లోనూ.. కలకలం సృష్టించిన హెడ్‌లైన్స్‌. ఇవి కొన్నే... కానీ ఇలాంటి హెడ్‌లైన్స్‌ అన్ని మీడియా మాధ్యమాలలో నిత్యం కనిపిస్తూనే వుంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు సినీ పరిశ్రమలోనూ చాలాకాలంగా డ్రగ్స్‌ దందా నడవడం.. కొందరిని అరెస్టు చేయడము తెలిసిందే. ఇది ఒక్క తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న అతి పెద్ద వ్యాపార మాఫియా. యువతను నిర్వీర్యం చేస్తున్న లక్షల కోట్ల రూపాయల చీకటి వ్యాపారం. చిన్నపాటి నగరాల నుంచి మెట్రో సిటీల వరకు వున్న విద్యాసంస్థలకూ ఈ మత్తు సంస్కృతి విస్తరించింది. ముఖ్యంగా యుక్తవయస్కులు దీనిపట్ల ఆకర్షితులై, ఆ మత్తు నుంచి బయటపడలేక తమ జీవితాలను బలి చేసుకుంటున్నారు.

  • ఒక్కరోజు కాదు.. నిత్య అప్రమత్తత అవసరం..

డ్రగ్స్‌ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రతి సంవత్సరం జూన్‌ 26వ తేదీన 'అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ మాదకద్రవ్యాల యొక్క ప్రమాదాల గురించి అవగాహన కల్పించడానికి అంతర్జాతీయ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, ఈ సమస్యను పరిష్కరించడానికి సమర్థవంతమైన విధానాలు, కార్యక్రమాల కోసం ఈ రోజు ఒక అవకాశంగా ఉపయోగపడుతుంది. అనేక ప్రభుత్వాలు, సంస్థలు మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టాలు, విధానాలు, కార్యక్రమాల గురించిన సమాచారాన్ని పంచుకోవడానికి ఈ రోజును ఉపయోగిస్తాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న మాదకద్రవ్యాల సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి ప్రభుత్వాలు, రాజ్యాంగవ్యవస్థలు, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలు, విద్యావేత్తలు, సంఘాల మధ్య సహకారం అవసరమని కూడా వారు నొక్కి చెప్పారు. అయితే ఈ ఒక్కరోజు మాత్రమే దీని గురించి ఆలోచించడం కాకుండా.. నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ముందుకొచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి.
మాదకద్రవ్యాల దుర్వినియోగం, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారం కోసం పిలుపునిచ్చే తీర్మానం ద్వారా 'థింక్‌ హెల్త్‌, డ్రగ్స్‌ కాదు' అనే థీమ్‌తో 1987లో ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. వ్యక్తులు, కుటుంబాలు, సమాజాలపై మాదకద్రవ్యాల దుర్వినియోగం ప్రభావం గురించి అవగాహన పెంచడం, అలాగే నివారణ, చికిత్స మరియు పునరావాస కార్యక్రమాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ప్రతి సంవత్సరం, యునైటెడ్‌ నేషన్స్‌ ఆఫీస్‌ ఆన్‌ డ్రగ్స్‌ అండ్‌ క్రైమ్‌ (యుఎన్‌ఓడిసి) మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం కోసం దృష్టి సారించడానికి ఒక థీమ్‌ను ఎంచుకుంటుంది. అయితే, ఇది మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో తలెత్తుతున్న సవాళ్లను పరిష్కరించడం కోసం, మాదకద్రవ్య వ్యసనాన్ని నిరోధించడం, చికిత్స చేయడం, అందుకు తగిన వ్యూహాలను రూపొందించడంపైన ఈ థీమ్‌ వుంటుంది.
ప్రపంచ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా, డ్రగ్స్‌ రహిత సమాజం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ కార్యకలాపాలలో విద్యా ప్రచారాలు, బహిరంగ ర్యాలీలు, సమావేశాలు, కళా ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు ఉన్నాయి. మాదకద్రవ్యాల యొక్క హానికరమైన ప్రభావాల గురించి అవగాహన కల్పించడం.. ఆరోగ్యకరమైన పద్ధతులను అవగాహన చేసుకోవడానికి ఆయా వ్యక్తులను ప్రోత్సహించడం.. నివారణ, చికిత్స యొక్క ప్రాముఖ్యతను పెంచడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ముఖ్యంగా వ్యక్తులు, కుటుంబాలు, పాఠశాలలు అందరూ పాల్గొనాలి. తద్వారానే పౌర సమాజాన్ని డ్రగ్‌ రహిత ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యం సాధించడానికి వీలవుతుంది.

  • పెరిగిన వినియోగం..

ప్రపంచ వ్యాప్తంగా సుమారు 269 మిలియన్ల మంది మాదక ద్య్రవాలకు బానిసలయ్యారని పలు నివేదికలు చెబుతున్నాయి. వీరే కాకుండా ఎప్పుడన్నా ఒకసారి వాడుతున్నవారు 5.5 శాతం మంది వున్నారు. దేశంలో అయితే... మద్యం 16 కోట్ల మంది, గంజాయి 3.1 కోట్లు, హెరాయిన్‌ 2.8 కోట్లు, కొకైన్‌, ఇతర మత్తు పదార్థాలు 1.18 కోట్ల మంది వాడుతున్నారని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా 2004లో 21 శాతం వాడుతుంటే ఇప్పుడది 29.5 శాతానికి పెరిగిందని యుఎన్‌ఓడిసి విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. మాదకద్రవ్యాల వాడకం వలన ప్రపంచవ్యాప్తంగా అర మిలియన్‌ మంది 2019లో మరణిస్తే.. ఇండియాలో జరిగిన ఆత్మహత్యల్లో అధిక శాతం ఈ కోవకు చెందినవేనని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు ఉపయోగించేవారు 0.71 శాతం ఉంటే, ప్రపంచ సగటు కంటే ఎక్కువగా మనదేశంలో 2.65 శాతం ఈ ప్రమాదకరమైన డ్రగ్స్‌ వాడుతున్నారని ఆ నివేదిక పేర్కొంది. 1985లో నార్కొటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ చట్టం ప్రకారం మాదకద్రవ్యాలు వాడడం, కలిగి ఉండడం, సరఫరా, ఉత్పత్తి చట్టరీత్యా నేరం. అయినా ఈ రోజు మన దేశంలో విచ్చలవిడిగా డ్రగ్స్‌ దొరుకుతూనే ఉన్నాయి. వాడకం పెరుగుతూనే ఉంది. ఇంతటి ప్రమాదకరమైన సమస్య రోజురోజుకు తీవ్రమౌతున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. దీనికోసం తక్షణం పరిష్కారం దిశగా ప్రభుత్వాలు కదలాల్సి ఉంది.

2
  • కాశ్మీర్‌లో..

కాశ్మీర్‌ వంటి చోట్ల మాదకద్రవ్యాల ప్రభావం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. యువత జీవితాలను నాశనం చేస్తోంది. హెరాయిన్‌ వంటి హార్డ్‌ డ్రగ్స్‌ వినియోగం కూడా బాగా పెరిగింది. ఇవన్నీ ఎవరో చెబుతున్నవి కాదు.. అక్కడి అధికారులే చెబుతున్న వాస్తవాలు. జమ్మూకాశ్మీర్‌లో సుమారు 10 లక్షల మంది అంటే ఆ ప్రాంత జనాభాలో ఎనిమిది శాతం గంజాయి, ఓపియాయిడ్లు వంటి మాదకద్రవ్యాలకు అలవాటుపడ్డారు. ఇదే ఈ ఏడాది మార్చిలో సాక్షాత్తూ కేంద్రమంత్రి పార్లమెంటుకు తెలిపారు. గతంతో పోల్చేందుకు గణాంకాలు అందుబాటులో లేవు. కానీ, రిహాబిలిటేషన్‌కు వచ్చే రోగుల సంఖ్య బాగా పెరిగిందని డాక్టర్లు చెబుతున్నారు. 'ఓ పదేళ్లకు ముందు రోజుకు 10-12 డ్రగ్‌ అడిక్షన్‌ కేసులు మా ఆస్పత్రికి వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-200 కేసులు వస్తున్నాయి. ఇది ఆందోళన కలిగించే విషయం' అని ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌లో సైకియాట్రిస్ట్‌ ప్రొఫెసర్‌ యాసిర్‌ రాదర్‌ చెబుతున్నారు. ఇదే పరిస్థితి దేశంలో చాలాచోట్ల వేళ్లూనుకొని వుంది.

  • డ్రగ్స్‌ వ్యాపారం..

ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 157 దేశాల్లో గంజాయి సాగవుతోంది. దేశంలో 272 రాష్ట్రాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అంతర్జాతీయ పోర్టులు, ప్రైవేటుపరమైన పోర్టుల ద్వారా ఈ సరఫరా ఎక్కువగా జరుగుతోంది. ముంద్రా అయినా, దానితో సంబంధాలు ఉన్నాయని వస్తున్న కృష్ణపట్నం పోర్టు అయినా, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు అయినా, ముంబయిలో పట్టుబడినది అయినా ఇవన్నీ ప్రైవేటు పోర్టులు కావడం గమనార్హం. ఈ మహమ్మారికి బలైపోతున్న దేశాలు కూడా అత్యంత పేదరికంతో ఉన్న ఆఫ్రికా వంటి దేశాలే. అదే వరుసలో ఆసియా దేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచీకరణ విధానాలను అత్యంత వేగవంతంగా అమలు చేస్తున్న భారత్‌ లాంటి దేశాలలో డ్రగ్స్‌ వ్యాపారం మూడుపువ్వులు ఆరుకాయలుగా విస్తరిస్తోంది. 2030 నాటికి మాదకద్రవ్యాల వ్యాపారం 11 శాతం పెరగబోతున్నదని ఐరాస నివేదిక పేర్కొన్నది. ఆకలి, దారిద్య్రం, పేదరికం, నిరుద్యోగం, వైద్యం అందకపోవడం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్న ప్రజలను బడా కార్పొరేట్లు మాదకద్రవ్యాల వ్యాపారంతో దేశాన్ని దోచుకోవడంతో పాటు, యువతను నిర్వీర్యం చేస్తున్నారు. మత్తుకు బానిసలైన యువత డ్రగ్స్‌ను పొందడం కోసం ఎలాంటి ఘాతుకాలకు పాల్పడేందుకైనా సిద్ధపడుతున్నారు. ఈ కార్పొరేట్లకు ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సమయంలోనూ కార్పొరేట్ల దందాను కళ్లారా చూశాం. ఉచిత వ్యాక్సిన్‌ అందించి ప్రపంచాన్ని కాపాడుకోవాల్సిన ప్రభుత్వం.. కార్పొరేట్ల కొమ్ము కాసి, పేటెంట్‌ ద్వారా కాసులు దండుకునేందుకు దారులు వేసింది.

  • నిర్వీర్యమవుతున్న యువతరం..

ఈ దుర్వ్యసనం శారీరక మానసిక ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా తీవ్రమైన భావోద్వేగాలకు గురిచేస్తోంది. ఉత్సాహంతో ఉరకలు వేసే యువతతో పటిష్టమైన భారతావనిని నిర్మిస్తామని ఒకవైపు చెబుతూనే.. యువత శక్తిసామర్థ్యాలను నిర్వీర్యం చేసే మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వైపు పయనిస్తోన్న వారిని కట్టడి చేయలేకపోతున్నాయి పాలకపక్షాలు. పోటీ ప్రపంచంలో దూసుకెళుతున్న యువత.. ఆ ఒత్తిడి నుంచి బయట పడటానికి, క్షణికమైన ఆనందానుభూతులవైపు మొగ్గు చూపుతున్నారు. 'డ్రగ్స్‌ మిమ్మల్ని స్వర్గంలా అంటూనే మారువేషంలో నరకానికి తీసుకెళతాయి' అంటాడు డ్రగ్‌ థెరపిస్ట్‌ డోనాల్డ్‌ లిన్‌ ఫ్రాస్ట్‌. మాదక ద్రవ్యాల వినియోగం ప్రపంచవ్యాప్తంగా యువతపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీనివల్ల దేశానికి వెన్నెముక వుండాల్సిన యువశక్తి నిర్వీర్యమవుతోంది. ఇది సమాజాన్ని సామాజికంగా, భౌతికంగా, సాంస్కృతికంగా, మానసికంగా, ఆర్థికంగా నాశనం చేస్తోంది. డ్రగ్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మన స్వరం మరింత పెంచాలి.

  • పట్టనితనమే ప్రమాదం..

'నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌' పథకం ద్వారా 272 జిల్లాల్లో 13,000 మంది వాలంటీర్లను పెట్టి డ్రగ్స్‌ను అరికట్టాలని వేసిన ప్రణాళికపై కనీస చర్చ కూడా లేకుండా.. కేంద్ర హోం మంత్రి అన్ని రాష్ట్రాల హోం మంత్రులను పిలిచి, వామపక్ష తీవ్రవాదంపై చర్చించి వదిలేశారు. ఇండియా క్రైమ్‌ బ్యూరో లెక్కల ప్రకారం.. మన దేశంలో డ్రగ్స్‌ తీవ్రంగా వాడడం వలన 14 లక్షల మంది పిల్లలు, 80 లక్షల మంది పెద్దలు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. దీని వలన 2017-18 మధ్యలో 2,300 మంది మృతి చెందారు. ఈ లెక్కలు ఏడాదికేడాది పెరుగుతూనే వున్నాయి. ఉత్సాహం ఉరకలు వేసే యువతతో పటిష్టమైన దేశాన్ని నిర్మిస్తామంటూనే.. యువత శక్తియుక్తులను నిర్వీర్యం చేసే మాదకద్రవ్య వ్యాపారాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సిద్ధంగా లేదు. మత్తుకు బానిసలైన యువత... పేదరికం, నిరుద్యోగం, పెరిగిన ధరలు... వేటినీ పట్టించుకోనితనం పెనుప్రమాదం తెచ్చిపెడుతుంది.

3
  • విద్యాలయాల్లో..

ఇప్పుడు ఈ విష సంస్కృతి విద్యా కేంద్రాలకు, తరగతి గదులలోకి విస్తరించింది. విలాసాలకు అలవాటుపడిన చదువుకున్న యువకుల ద్వారా మధ్యతరగతికి డ్రగ్స్‌ను సరఫరా చేయిస్తున్నారు. చాక్‌లెట్స్‌, సిగరెట్ల ద్వారా చిన్న పిల్లలకు సైతం అలవాటు చేస్తున్నారు. ఆ మధ్య హైదరాబాద్‌లోని కొన్ని స్కూళ్లలో 1275 మంది విద్యార్థులు డ్రగ్స్‌ బారిన పడినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలోని ఒక ప్రముఖ త్రిబుల్‌ ఐటీలోనూ గంజాయి కలకలం రేగింది. అలాగే రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగిసిన అనంతరం డ్రగ్స్‌ పంపిణీ చేయడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • సినీ పరిశ్రమలో..

మన దేశంలో డ్రగ్స్‌ సేవిస్తున్న వారిలో 80 శాతం మంది 35ఏళ్ల లోపు వారే. వారిలోనూ ధనిక వర్గాల వారు హెరాయిన్‌, కొకైన్‌, ఒపియాడ్స్‌, ఇంజెక్షన్ల వంటివి ఉపయోగిస్తుండగా.. పేద, మధ్యతరగతి యువకులు గంజాయి వంటివి తీసుకుంటున్నారు. ధనిక వర్గానికి ఇవి మొదట పబ్‌లు, క్లబ్‌లు, సినీ పరిశ్రమ ద్వారా సరఫరా అవుతున్నాయి. ఇటీవల 'కబాలి' సినిమా నిర్మాతను డ్రగ్స్‌ కేసులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు డ్రగ్స్‌ వినియోగిస్తున్న వారి జాతకాలు బట్టబయలైన విషయం తెలిసిందే. డ్రగ్స్‌ వ్యవ్యహారంలో బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సినీ పరిశ్రమను కుదిపేసింది. ఇప్పటికీ పరిశ్రమలో మత్తుపదార్థాల వినియోగం వార్తలు గుప్పుమంటూనే వున్నాయి.

4
  • ఐటీలోనూ..

ఐటీ ఉద్యోగులు సైతం భారీగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వీకెండ్స్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు డ్రగ్స్‌ పార్టీలకు వెళుతున్నారని, పోలీసుల పక్కా నిఘాతో పట్టుకోవడంతో గుట్టు రట్టయ్యింది. అమెజాన్‌, ఇన్ఫోసిస్‌, మహేంద్ర, క్యూసాఫ్ట్‌ వంటి కంపెనీల ఉద్యోగులు సైతం ఇందులో వున్నట్లు సమాచారం.

  • చికిత్స- పునరావాసం..

నివారణ కీలకపాత్ర పోషిస్తుండగా.. వ్యసనంతో పోరాడుతున్న వారికి సమగ్ర చికిత్స అందించడం.. పునరావాస సేవలను కల్పించడం ప్రాముఖ్యతగా గుర్తించాలి. ఈ వ్యసనానికి బానిసలైన వారికి సరైన చికిత్సా కేంద్రాలు అందుబాటులో లేవు. ఈ పునరావాస కేంద్రాలకు తగిన నిధులతో పాటు చికిత్స కూడా అందుబాటులో వుంటే ఎక్కువమందికి ఉపయోగకరంగా వుంటుంది. తగిన సమయంలో చికిత్స అందించడం ద్వారా మాదకద్రవ్యాల పట్టు నుండి విముక్తి పొందగలుగుతారు. ఇందుకు తగిన వాతావరణాన్ని కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటానికి విద్య, నివారణ, చికిత్స, చట్టాల అమలుతో కూడిన ఏకీకృత విధానం అవసరం. మాదకద్రవ్యాల దుర్వినియోగం అనేది ఒక వివిక్త సమస్య కాదని, ఒక ఉమ్మడి బాధ్యత అని మనం గుర్తించాలి. దళాలు చేరడం ద్వారా వారికి నైతిక మద్దతు అందించే సమాజం కావాలి.

5


మాదకద్రవ్యాల దుర్వినియోగం యొక్క విస్తృతమైన సమస్య ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలనూ పీడిస్తూనే వుంది. వ్యక్తులు, కుటుంబాలు, సమాజానికి కోలుకోలేని హాని కలిగిస్తోంది. ఈ సమస్యకు వ్యతిరేకంగా ఐక్యంగా వ్యవహరించడం, మన మధ్యనున్న ఈ విధ్వంసక శక్తిని నిర్మూలించడానికి సమిష్టిగా పనిచేయడం చాలా అవసరం. భవిష్యత్‌ తరాలను రక్షించడానికి సమగ్ర మాదక ద్రవ్య వ్యతిరేక వ్యూహాన్ని అనుసరించడం నేటి తక్షణ అవసరం. మాదకద్రవ్యాల వ్యసనం నుండి విముక్తి పొందిన సమాజాన్ని నిర్మించడం, ప్రతి ఒక్కరినీ ఆరోగ్యకరమైన, సురక్షితమైన ప్రపంచం వైపుకు ప్రోత్సహించడం అనే కర్తవ్యాన్ని 'మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం' మనకు గుర్తుచేస్తుంటుంది. దుర్భలమైన వ్యక్తులను ఈ విష చక్రానికి గురికాకుండా రక్షించడం మన నైతిక బాధ్యత.

  • డ్రగ్స్‌ రహిత సమాజం కోసం..

దేశంలో సగానికిపైగా వున్న యువత మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారు. వీరిని సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ.. వారి ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. దీనివల్ల సమాజమూ, కుటుంబము తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడుతోంది. విద్య, వైద్య, ఆరోగ్యం, అభివృద్ధి వంటి వాటిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాల నిష్క్రియాపర్వం వల్ల యువతరం అసాంఘిక శక్తులుగా మారుతున్నారు. అధికారంలో వున్న ప్రభుత్వాలు కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్య, ఆరోగ్యం వంటి అంశాలపై దృష్టి పెట్టకపోగా, దేశ వనరులను అదానీ, అంబానీ వంటి వారి చేతుల్లో పెడుతోంది. మత్తులో జోగుతున్న యువతను ఆ మత్తు నుంచి బయటకు తీసుకురావాలి. సమాజంలో చోటుచేసుకుంటున్న సకల అనర్థాలకు, అరాచకాలకు, అమానుషత్వ ధోరణులకు మత్తే ప్రధాన కారణం అని అనేక సర్వేలు చెబుతున్నాయి. మానసిక ప్రవర్తనలో విపరీతమైన ధోరణులను ప్రేరేపించి, యువతను అరాచకత్వం వైపుకు నెడుతున్న డ్రగ్స్‌ను నుంచి వారిని దూరం చేయాలి. డ్రగ్స్‌ రహిత సమాజ రూపకల్పనకు మరింత కషి జరగాలి. ఏడాదిలో ఒకరోజు డ్రగ్స్‌ వ్యతిరేక దినోత్సవం జరుపుకున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు. ఆచరణలో నిర్దేశిత లక్ష్యాలకు కట్టుబడి వుండాలి. డ్రగ్స్‌ మహమ్మారిని పారదోలి... చైతన్యవంతమైన సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. డ్రగ్స్‌ రహిత సమాజం కోసం దీక్షబూనాలి.

  • ఇలా చేద్దాం..
  1.  మాదక ద్రవ్యాలను ఉపయోగించే వ్యక్తులు, వారి కుటుంబాలపై పడే కళంకం, వివక్ష వంటి ప్రతికూల ప్రభావం గురించి అవగాహన కల్పించడం.
  2.  మాదక ద్రవ్యాలను ఉపయోగించే వ్యక్తులలో 'ఎయిడ్స్‌', హెపటైటిస్‌ మహమ్మారి గురించి అవగాహన కల్పించడం. హెచ్‌ఐవి, హెపటైటిస్‌ నివారణ కార్యక్రమాలను విస్తరించడం.
  3.  మాదకద్రవ్యాల వినియోగ రుగ్మతలు, అందుబాటులో ఉన్న చికిత్సలు, ముందస్తు జోక్యం, మద్దతు యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడం.
  4.  చికిత్స, అందుబాటులో వున్న సేవలతో పాటు.. మాదకద్రవ్యాల సంబంధిత నేరాలకు పాల్పడితే జైలుశిక్షకు ప్రత్యామ్నాయాల కోసం న్యాయవాది గౌరవప్రదమైన భాష ఉపయోగించాలి. అలాంటి వైఖరిని ప్రోత్సహించడం ద్వారా కళంకం, వివక్షతో పోరాడండి.
  5.  మాదకద్రవ్యాల వినియోగాన్ని, ఆ వ్యసనాన్ని నిరోధించడానికి యువకులు, వివిధ సంఘాలకు అవగాహన కల్పించడం.
6

 

  • థీమ్‌-2023

ప్రతి ఏడాదీ ఒక్కో థీమ్‌ను నేపథ్యంగా తీసుకొని మాదకద్రవ్యాలను 'ప్రజలు ముందుగా.. కళంకము, వివక్షను ఆపండి. నివారణను బలోపేతం చేయండి' అనే థీమ్‌తో 2023 మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మాదకద్రవ్యాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలను ప్రభావితం చేస్తున్న సంక్లిష్ట సమస్య. మాదకద్రవ్యాలను ఉపయోగించే చాలామంది వ్యక్తులు సమాజంలో ఒక కళంకాన్ని, వివక్షను ఎదుర్కొంటుంటారు. అది వారి శారీరక, మానసిక ఆరోగ్యానికి మరింత హాని కలిగించే అంశం. అంతేకాదు.. వారికి అవసరమైన సహాయాన్ని పొందకుండా నిరోధించవచ్చు. అందుకే దీని ప్రాముఖ్యతను గుర్తించడం ద్వారా ప్రపంచాన్ని మాదక ద్రవ్యాల వ్యసనం నుంచి విముక్తి పొందిన సమాజం వైపు నడిపించడానికి, ఈ లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, సురక్షితమైన సమాజం వైపుకు ప్రోత్సహించడానికి ఈ థీమ్‌ ఉపయోగపడుతుంది. ఆ దిశగా ప్రయత్నించాలనే కర్తవ్యాన్ని ఈ థీమ్‌ గుర్తు చేస్తుంది.

కె.ఎక్స్‌. రాజు
9490099231