కడియం పూల క్షేత్రంలో సరికొత్త విదేశీ మొక్కలు కొలువు తీరాయి. ముల్లు లేని మారేడు, పూలు పూయని హిపోల్ఫియా, ఇంటిలోపల పెరిగే మర్రి మొక్క, కనువిందు చేసే కాండముతో రాపిస్ ఎక్సెల్సా, రంగు రంగుల పువ్వులే కాదు ఆకులతోనూ వికసించే ఇంపేటియన్స్, నిండైన ఆకులతో పెద్ద చెట్ల మాదిరిగా గదుల్లోనూ అలరించే పెట్రో ఫోనిక్స్, ఆక్సిజన్‌ను పుష్కలంగా అందించే నల్ల జామియా కులకాస్ ఇలాంటి ఎన్నో అరుదైన, అందమైన మొక్కలు కడియం-పల్ల వెంకన్న నర్సరీలో కనువిందు చేస్తున్నాయి. నేడు విచిత్ర రీతిలో వినోదాన్ని అందిస్తున్న ఈ పరదేశీ మొక్కలను పలకరిద్దాం మన 'విరితోట'లో..
బ్లాక్ జామియా కులకాస్..
దీనిని ఆక్సిజన్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. కొమ్మలకు ఇరువైపులా సరి సంఖ్యలో ఆకులు ఉండి ఇండోర్లో పెరిగే మొక్క. రోజువారీ కొంచెం నీటిని అందిస్తే మట్టిలోనే కాక కొబ్బరి పొట్టులోనూ పెరుగుతుంది. ఇది థారులాండ్‌కు చెందినది. ఇప్పటివరకు ఈ జాతి మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉండేవిగానే మనకు తెలుసు. ఇవి మాత్రం కాండము, ఆకులతో సహా పూర్తిగా నలుపు రంగులోనే ఉంటాయి. బ్లాక్ జామియా కులకాస్ మొక్కలు కడియం నర్సరీలలో ఉన్నాయి.
ఊడమర్రి కాదు పిల్లలమర్రి..
మర్రి అనగానే మనకు ఊడలు భూమిలోకి పెరిగి దీర్ఘకాలం పెరిగే విస్తారమైన చెట్లు గుర్తొస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మర్రిచెట్టు అడుగు ఎత్తులో, అందమైన ఆకులతో ఇంటి లోపల, కుండీల్లోనూ పెంచుకునే సౌలభ్యమున్న మొక్క. పైకస్ బెంగాల్ గోల్డ్ దీని శాస్త్రీయ నామం. కలకత్తా నుంచి దిగుమతి చేసుకున్న మొక్కిది. దీని ఆకులు ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు మిళితమై తళ తళా మెరుస్తూ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంట్లో టీ పాయి, కబోర్డు, డైనింగ్ టేబుల్, బెడ్ లాంప్ ఎక్కడైనా చాలా తక్కువ నీటి సహాయంతో పెంచుకోవచ్చు.
ఇఫోర్బియా డ్వార్ఫ్ (మోనోఎడినమ్)..
ఇఫోర్బియా అంటే మొక్క మొదలు నుంచి చివరి వరకు ముళ్ళుండి, గుత్తులుగా చిన్న చిన్న పువ్వులు పూస్తుందని మనకు తెలుసు. కానీ ఈ ఇపోర్బియా డ్వార్ఫ్‌కి అసలు ముళ్ళే ఉండవు. పువ్వులూ పూయవు. ఆకుల చివర్లలో తెల్లని చారలుండి మొక్కకు అందాన్నిస్తాయి. మొక్క అడుగులోపు ఎత్తు మాత్రమే పెరుగుతుంది. సెమీషేడ్‌లో కుండీల్లో పెరుగుతుంది. ఇది మలేషియా నుంచి దిగుమతి చేసుకున్న మొక్క.
ఇంపేటియన్స్ బాల్సమైన..
మొక్క ఆరు నుంచి 12 అంగుళాల ఎత్తు పెరుగుతుంది. ఆకులు, పువ్వులు రంగులతో అలరించే సీజనల్ మొక్క ఇంపేటియన్స్ బాల్సమైన. పూణే నుంచి దిగుమతి అయింది. పూలు వర్షాకాలం చివరిలో పూయడం ప్రారంభించి శీతాకాలం చివరిలో ఆగిపోతాయి. ఆకులు క్రోటన్స్‌కున్నట్లు రంగురంగుల మచ్చలతో ఉండి, చంద్రకాంత పువ్వుల్లాంటి పూలతో వర్ణ శోభితమై ఉంటాయి. ఇందులో దాదాపు 22 రకాల రంగులతో పూలు పూస్తాయి. ఇవి శీతల ప్రాంతాల్లోనూ, ఇండోర్, సెమీషేడ్లలోను బాగా పెరుగుతాయి.
రాపిస్ ఎక్సెల్సా బ్యాంబూ..
అందమైన వెదురు మొక్క రాపిస్ ఎక్సెల్సా బ్యాంబూ. ఇది చైనా జాతి మొక్క. కాండము కణుపులు కలిగి పొడవుగా కనువిందు చేస్తుంది. సన్నని గడ్డిపరకల్లాంటి ఆకులు జుట్టును పోలి కళాత్మకంగా ఉంటుంది. ఆరుబయట సిట్‌ఔట్, అరుగు, బాల్కనీ, ఫోర్టికో తదితర ప్రదేశాల్లో అలంకరణగా పెంచుకోవడానికి ఈ మొక్కలు చాలా బాగుంటాయి. వారానికి ఒకరోజు నీరు అందిస్తే సరిపోతుంది.
మహా మారేడు..
బిల్వవృక్షంగా 10 మీటర్ల ఎత్తు పెరిగే మారేడు కాదు ఈ మహా మారేడు. ఇది నాలుగైదు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. ఇది శ్రీలంక నుంచి దిగుమతి చేసుకున్న మొక్క. దీని శాస్త్రీయ నామం ఎగెల్ మార్మలోస్. వెలగ మొక్క కుటుంబమైన రూటేసికి చెందినది. దీని ఆకులు, పువ్వులు, కాయలు అన్నీ సుగంధ పరిమళాన్నిస్తాయి. పువ్వులు ఆకుపచ్చ, తెలుపు రంగులలో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. పండ్లలో ఖనిజాలు, కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిన్ ఉంటాయి. ఈ మొక్క ఆకులు, పళ్ళు ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల ఆయుర్వేదంలో విరివిగా వినియోగిస్తారు. ముళ్ళు లేకపోవటం ఈ మొక్క ప్రత్యేకత.